Nervous System: టమోటాలోనూ నాడీ వ్యవస్థ!

చీమలు, దోమల వంటివి కుడుతున్నట్టు అనిపిస్తే వెంటనే చేత్తో తరిమేస్తుంటాం కదా. ఇవి కుడుతున్నట్టు మనకెలా తెలుస్తుంది? నాడీ వ్యవస్థ మూలంగానే. చర్మం నుంచి వెలువడే నాడీ సంకేతాలు మెదడుకు

Updated : 04 Aug 2021 16:49 IST

చీమలు, దోమల వంటివి కుడుతున్నట్టు అనిపిస్తే వెంటనే చేత్తో తరిమేస్తుంటాం కదా. ఇవి కుడుతున్నట్టు మనకెలా తెలుస్తుంది? నాడీ వ్యవస్థ మూలంగానే. చర్మం నుంచి వెలువడే నాడీ సంకేతాలు మెదడుకు, అక్కడ్నుంచి వచ్చే సంకేతాలు చేతులకు చేరుకుంటాయి. దీంతో చేతులను కదిలిస్తాం. ఇలాంటి హెచ్చరిక వ్యవస్థ టమోటాల్లోనూ ఉంటున్నట్టు బ్రెజిల్‌ పరిశోధకులు గుర్తించారు. మనుషుల మాదిరిగా మొక్కల్లో నాడీ వ్యవస్థ ఉండదు గానీ జైలమ్‌, ఫ్లోయెమ్‌ అనే సన్నటి గొట్టాలుంటాయి. చక్కెర, ఖనిజాలతో కూడిన నీరు వీటిల్లోంచే మొక్క వివిధ భాగాలకు ప్రసరిస్తుంటుంది. ఆవేశిత అయాన్లు నిరంతరం వీటి నుంచి లోపలికి, బయటకు వస్తుంటాయి. ఇవే మన నాడీ వ్యవస్థ మాదిరిగా విద్యుత్‌ సంకేతాలు ప్రసరించేలా చేస్తాయి. దెబ్బతిన్న ఆకులు ఇలాగే ఇతర ఆకులకు విద్యుత్‌ సంకేతాలు పంపిస్తున్నట్టు గత అధ్యయనాల్లో తేలింది. అయితే ఇది కాయలు, పండ్లలోనూ కొనసాగుతున్నట్టు తాజాగా బయటపడింది. గొంగళిపురుగుల వంటి కీటకాలు దాడి చేసినప్పుడు టమోటాలు మొక్క మొత్తానికి ఇలాగే హెచ్చరికలను పంపించుకుంటుండటం గమనార్హం. అంతేకాదు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను విడుదల చేస్తూ తమను తాము కాపాడుకునే ప్రయత్నమూ చేస్తున్నాయి. మొక్కలైతేనేమి? ప్రాణమంటే ఎవరికైనా తీపే కదా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని