ఈ ఏటి మేటి స్మార్ట్‌వాచ్‌లివే..!

కొన్నేళ్ల క్రితం స్మార్ట్‌వాచ్‌ అంటే..దానితో పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయం చాలా మంది యూజర్స్‌లో ఉండేది. కానీ గతేడాది కాలంలో మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొత్త ఫీచర్స్‌తో అందుబాటు ధరలో ఉండటంతో వీటి వినియోగం పెరిగింది...

Updated : 12 Aug 2022 15:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కొన్నేళ్ల క్రితం స్మార్ట్‌వాచ్‌ అంటే.. దాంతో పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయం చాలా మంది‌లో ఉండేది. కానీ గతేడాది కాలంలో మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొత్త ఫీచర్స్‌తో పాటు అందుబాటు ధరలో ఉండటంతో వీటి వినియోగం ఎక్కువైంది. అలానే కొవిడ్‌-19 ప్రభావంతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపట్ల జాగ్రత్త పెరిగింది. మారిన జీవనశైలికి అనుగుణంగా ఏం తింటున్నాం?.. ఎంత తింటున్నాం?.. ఎంత బరువు పెరిగాం?.. ఎంతసేపు వ్యాయామం చేశాం? ఇలా ప్రతిదీ లెక్కలు వేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు శరీర పనితీరు గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తూ ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచుతుండటంతో స్మార్ట్‌వాచ్‌ వినియోగానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మరి 2020లో మార్కెట్లో సందడి చేసిన టాప్‌ స్మార్ట్‌వాచ్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా...?


శాంసంగ్ గెలాక్సీ వాచ్‌ 3 

గుండ్రటి డయల్‌తో చూడటానికి సాధారణ వాచ్‌ తరహాలో ఉండే గెలాక్సీ వాచ్‌ 3లో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్స్‌ ఉన్నాయి. 1.4-అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ డీఎక్స్‌ ప్రొటెక్షన్‌ ఉంది. ఎగ్జినోస్‌ 9110 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ‌శాంసంగ్‌ వన్‌ యూఐ వాచ్‌ ఎడిషన్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. హార్ట్‌రేట్ సెన్సర్‌తో పాటు‌, శరీరంలో బ్లడ్‌ ఆక్సిజన్‌ శాతాన్ని అంచనా వేసేందుకు సెన్సర్స్‌, యాక్సిలరో మీటర్‌, గైరోస్కోప్‌, యాంబియంట్ లైట్ సెన్సర్‌, ఒత్తిడిని గుర్తించే సెన్సర్స్‌, ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌, 4జీ కనెక్టివిటీ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. 340 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇంకా బ్లడ్ ప్రెజర్‌ మానిటర్‌తో పాటు ఈసీజీ చెక్‌ చేసుకోవచ్చు. ఈ వాచ్‌ ప్రారంభ ధర రూ. 38,990. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. నోటిఫికేషన్ రీడింగ్, మెసేజ్‌ రిప్లై, వాచ్‌ ఫేస్‌ కస్టమైజేషన్ వంటి ఫీచర్స్‌ కూడా ఉన్నాయి.    


యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6 

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6లో 1.78 అంగుళాల ఓఎల్‌ఈడీ రెటీనా డిస్‌ప్లే ఇస్తున్నారు. యాపిల్ ఎస్‌5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వాచ్‌ ఓఎస్ ‌7తో పనిచేస్తుంది. 16 జీబీ అంతర్గత మెమొరీ ఇస్తున్నారు. ఈ వాచ్‌ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 18 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీంతో ఈసీజీ, బ్లడ్‌ ఆక్సిజన్‌ శాతం వంటివి చెక్‌ చేసుకోవచ్చు. ఇందులో యాక్సిలరో మీటర్‌తో పాటు ఎలక్ట్రికల్ హార్ట్‌ సెన్సర్‌, స్లీప్ ట్రాకర్‌ ఉన్నాయి. ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను కూడా సూచిస్తుంది. 50 మీటర్ల లోపల నీటిలో పడినా పనిచేస్తుంది. అల్యూమినియం, స్లెయిన్‌లెస్‌ స్టీల్, టైటానియమ్‌, సెరామిక్‌ డయల్స్‌ వేరియంట్లలో ఈ వాచ్‌ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 49,900.   


షావోమి ఎంఐ వాచ్‌ రివాల్వ్‌

షావోమి నుంచి వచ్చిన తొలి స్మార్ట్‌వాచ్‌. ఇందులో పీపీజీ హార్ట్‌రేట్ సెన్సర్‌, త్రీ-యాక్సిస్‌ యాక్సెలరేషన్‌ సెన్సర్‌, గైరోస్కోప్, జియోమాగ్నటిక్‌ సెన్సర్, లైట్ సెన్సర్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఈ వాచ్‌లో 1.3-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ఉంది. షావోమి వేర్‌ యాప్‌ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్‌ 5 ఏటీఎం వాటర్ ప్రూఫ్‌ డిజైన్‌తో తయారైంది. ఫస్ట్‌బీట్ అల్గారిథమ్‌ సహాయంతో సైకలాజికల్‌ డేటాను కూడా అందిస్తుంది. స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్, హార్ట్‌రేట్ మానిటరింగ్, బాడీ ఎనర్జీ మానిటరింగ్, 10 స్పోర్ట్స్‌ మోడ్స్‌, 110 వాచ్‌ ఫేసెస్‌ ఉన్నాయి. 420 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు వారాల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 10,999.     


ఒప్పో స్మార్ట్‌వాచ్‌

ఒప్పో స్మార్ట్‌వాచ్‌ రెండు డిస్‌ప్లే వేరియంట్లలో లభిస్తుంది. 1.6-అంగుళాలు, 1.9-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే. స్నాప్‌డ్రాగన్‌ వేర్‌ 3100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దానితో పాటు బ్యాటరీ సేవింగ్ మోడ్‌ కోసం యాంబిక్యూ మైక్రో అపోలో 3 వైర్‌లెస్‌ ప్రాసెసర్‌ను కూడా ఉపయోగించారు. వేర్‌ ఓఎస్‌ 5తో ఈ వాచ్‌ పనిచేస్తుంది. 5ఏటీఏం వాటర్‌ ప్రూఫ్‌ డిజైన్‌తో తయారైంది. 1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్ మెమొరీ ఇస్తున్నారు. 430 ఎంఏహెచ్‌, 300 ఎంఏహెచ్‌ బ్యాటరీ వేరియంట్లలో లభిస్తాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే పవర్‌ సేవర్‌ మోడ్‌లో 21 రోజులు, 14 రోజులు పనిచేస్తాయి. ఈ వాచ్‌లో గైరోస్కోప్‌ సెన్సర్‌, జియో మాగ్నటిక్‌ సెన్సర్‌, హార్ట్‌బీట్ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్‌, ట్రై-యాక్సియల్‌ యాక్సిలరేషన్‌ సెన్సర్‌, స్లీప్‌ మానిటర్‌, ఫిట్‌నెస్‌ మానిటర్‌, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ గైడ్‌ ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ ప్రారంభ ధర రూ. 14,990.  


అమేజ్‌ఫిట్ జీటీఎస్‌

యాపిల్‌ తరహా డిజైన్ ఆకృతితో మెటల్‌ బాడీతో అమేజ్‌ఫిట్ జీటీఎస్‌ వాచ్‌ను తీసుకొచ్చింది. ఇతర స్మార్ట్‌వాచ్‌లకు ధీటుగా ఇందులో కూడా వాటర్‌ రెసిస్టెంట్, హార్ట్‌రేట్ సెన్సర్‌, 12 రకాల ఎక్సర్‌సైజ్ మోడ్‌లు, 6-యాక్సిస్ యాక్సిలరేషన్ సెన్సర్‌, యాంబియంట్ లైట్ సెన్సర్‌, స్లీప్‌ మానిటర్‌ ఉన్నాయి. ఈ వాచ్‌లో 1.65-అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. 220 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 14 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 9,999.     


హువావే వాచ్‌ జీటీ 2ఈ

ఈ వాచ్‌లో 1.39 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. కిరిన్‌ ఏ1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. యాక్సిలరోమీటర్‌ సెన్సర్‌, గైరోస్కోప్‌ సెన్సర్‌, జియోమాగ్నటిక్‌ సెన్సర్‌, ఆప్టికల్ హార్ట్‌రేట్ సెన్సర్‌, యాంబియంట్ లైట్ సెన్సర్‌, ఎక్సర్‌సైజ్‌ మానిటర్‌ ఉన్నాయి. 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ ఇస్తున్నారు. ఈ వాచ్‌ 5 ఏటిఎం వాటర్ ప్రూఫ్‌ రెసిస్టెంట్‌తో తయారైంది. నోటిఫికేషన్స్‌ చూడొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు వారాల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. వాచ్‌ ప్రారంభ ధర రూ. 11,990.

ఇవీ చదవండి..

2020లో వాట్సాప్‌ టాప్‌ ఫీచర్స్‌ ఇవే..!

ఒప్పో నుంచి స్లైడ్ ఫోన్‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని