ఇన్‌స్టా బర్త్‌డే సెలబ్రేషన్స్‌..చేసేయండిలా..!

ఫొటో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రాం విడుదలయి ఈ ఏడాదితో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూజర్స్‌ని తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి ఆహ్వానిస్తూ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది....

Published : 08 Oct 2020 22:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫొటో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రాం అందుబాటులోకి వచ్చి ఈ ఏడాదితో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూజర్స్‌ని తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి ఆహ్వానిస్తూ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా యూజర్స్‌ తమ ఫోన్లలో ఇన్‌స్టా యాప్‌ ఐకాన్‌ మార్చుకోవచ్చు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌ తన పాత యాప్‌ ఐకాన్స్‌తో పాటు కొన్ని కొత్త ఐకాన్స్‌ను సీక్రెట్‌ మెనూ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్స్‌ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ సీక్రెట్ మెనూలో మొత్తం 13 ఇన్‌స్టాగ్రాం ఐకాన్స్‌ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన దాంతో మీ ఇన్‌స్టాగ్రాం హోం ఐకాన్‌ను మార్చుకోవచ్చు. ఇంతకీ ఆ సీక్రెట్‌ మెనూ ఎలా కనుక్కోవాలో తెలుసుకోవాలంటే కిందకి ఒక లుక్కేయండి మరి...

* ఈ ఐకాన్‌ మార్చుకునే ఫీచర్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్స్‌కి దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ముందుగా మీ ఫోన్‌లో లేటెస్ట్‌ వెర్షన్ ఇన్‌స్టాగ్రాంను అప్‌డేట్‌ చెయ్యండి. ఫోన్‌లో ఇన్‌స్టాగ్రాం యాప్‌ ఓపెన్‌ చేసి అందులో ప్రొఫైల్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత కుడి వైపు పై భాగంలో హామ్‌బర్గర్‌ మెనూ కనిపిస్తుంది.

* దానిపై క్లిక్‌ చేస్తే పాప్‌-అప్‌ విండో ఓపెన్‌ అవుతుంది. అందులో సెట్టింగ్స్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. తర్వాత సెర్చ్‌, ఫాలో/ఇన్‌వైట్‌ ఫ్రెండ్స్‌ వంటి ఆప్షన్స్‌తో మెనూ కనిపిస్తుంది. ఇక్కడ మొబైల్‌ స్క్రీన్‌ను కిందకి డ్రాగ్‌ చేస్తే పలు రకాల ఎమోజీలు దర్శనమిస్తాయి. అందులో గిఫ్ట్‌బాక్స్‌ ఎమోజీ కనిపించే వరకు డ్రాగ్‌ చేస్తే వివిధ రకాల కలర్స్‌తో సెలబ్రేషన్‌కి సంబంధించిన యానిమేషన్స్‌ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

* తర్వాత 13 రకాల ఇన్‌స్టాగ్రాం యాప్‌ ఐకాన్‌లతో మెనూ ప్రత్యక్షమవుతుంది. వాటితో పాటు ‘‘యాప్‌ ఐకాన్‌ మార్చి మా పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు ఈ నెలలో  మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ’’ అనే మెసేజ్‌ కనిపిస్తుంది. లిస్ట్‌లో ఉన్న ఐకాన్‌లలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు యాప్‌ ఐకాన్‌ మార్చారు అనే పాప్-అప్ మెసేజ్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేస్తే ఇన్‌స్టాగ్రాం ఐకాన్‌ మారిపోతుంది. కొన్ని మొబైల్స్‌లో అయితే ఐకాన్‌ మార్చాక హోం పేజీ మీద షార్ట్‌ కట్‌ క్రియేట్‌ అవుతుంది. అలా మీరు ఇన్‌స్టా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగం కావొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని