షావోమి ఫ్లాగ్‌షిప్‌..ఒప్పో, కూల్‌పాడ్ బడ్జెట్‌ ఫోన్లు

పండగ తేదీ దగ్గర పడుతుండటంతో మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ల సందడి మొదలయింది. వినియోగదారులను ఆకట్టుకోవడంతో పాటు అమ్మకాల జోరు కొనసాగించేందుకు మొబైల్‌ తయారీ కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త మోడల్స్‌ను...

Updated : 12 Aug 2022 12:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పండగ తేదీ దగ్గర పడుతుండటంతో మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ల సందడి మొదలయింది. వినియోగదారులను ఆకట్టుకోవడంతో పాటు అమ్మకాల జోరు కొనసాగించేందుకు మొబైల్‌ తయారీ కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త మోడల్స్‌ను తీసుకొస్తున్నాయి. తాజాగా షావోమి రెండు ఎంఐ ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ను విడుదల చేస్తే, ఒప్పో, కూల్‌పాడ్ కంపెనీలు బడ్జెట్ ఫోన్లను విడుదల చేశాయి. ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్స్‌ ఇస్తున్నారు, వాటి ధరెంత వంటి వివరాలు తెలుసుకుందాం.

ఎంఐ 10టీ, 10టీ ప్రో 

ఈ మోడల్స్‌లో కెమెరా మినహా మిగతా ఫీచర్స్‌ అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత ఎంఐయుఐ 12 ఓఎస్‌తో ఇవి పనిచేస్తాయి. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంది. రెండు ఫోన్లలోను ఆక్టాకోర్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. సైడ్‌ మౌంట్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ ఫీచర్‌ ఉంది. 10టీ ప్రోలో డ్యూయల్‌ స్పీకర్స్‌ ఉన్నాయి.

ఇక కెమెరా విషయానికొస్తే రెండు మోడల్స్‌లోను నాలుగు కెమెరాలను ఇస్తున్నారు. వెనక మూడు ముందు ఒక కెమెరా ఉన్నాయి. 10టీ మోడల్‌లో వెనుక వైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 ఎంపీ మాక్రో లెన్స్‌ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 20 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 10టీ ప్రో మోడల్‌లో వెనుక వైపు 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందు సెల్ఫీల కోసం 20 ఎంపీ కెమెరా ఉంది.

ఎంఐ 10టీ 6జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్ ధర రూ. 35,999. 8జీబీ ర్యామ్‌/128జీబీ అంతర్గత స్టోరేజి ధర రూ. 37,999. కాస్మిక్‌ బ్లాక్‌, లూనార్ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. 10టీ ప్రో 8జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్‌ ధర రూ. 39,999. అరోరా బ్లూ, కాస్మిక్‌ బ్లాక్, లూనార్ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. అక్టోబరు 16 నుంచి ఎంఐ, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్లతో పాటు ఎంఐ హోం స్టోర్లలో ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి.


ఒప్పో ఏ 15

ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ ఓఎస్ 7.2తో ఇది పనిచేస్తుంది. 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ మీడియాటెక్‌ హీలియో పీ35  ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలు ఇస్తున్నారు. వెనక వైపు ఏఐ ఫీచర్‌తో 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,230 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 10 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 3జీబీ ర్యామ్‌/32జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరింయట్‌ ధర రూ. 10,990. డైనమిక్ బ్లాక్‌, మిస్టరీ బ్లూ రంగుల్లో లభిస్తుంది. త్వరలోనే అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి.


కూల్‌పాడ్  కూల్ 6

బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌గా తీసుకొచ్చిన కూల్‌ 6లో 6.53 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.  మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 21 ఎంపీ పాప్‌-అప్‌ కెమెరా అమర్చారు. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. వెనక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఫీచర్‌ కూడా ఇస్తున్నారు. 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజి వేరియంట్ ధర రూ. 10,999. 6జీబీ ర్యామ్/128జీబీ అంతర్గత మెమరీ ధర రూ. 12,999. బ్లూ, బ్లాక్‌ రంగుల్లో లభిస్తున్న ఈ ఫోన్‌ అమ్మకాలు అమెజాన్‌లో ప్రారంభమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని