artificial intelligence: ఏఐ సాయంతో ఉద్యోగం!

కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తుందని, దీని మూలంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వెల్లువెత్తటం చూస్తున్నదే.

Published : 03 Jul 2024 00:45 IST

కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తుందని, దీని మూలంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వెల్లువెత్తటం చూస్తున్నదే. కానీ దీన్ని తెలివిగా వాడుకోవటం ద్వారా ఉద్యోగం వచ్చే అవకాశాలనూ మెరుగుపరచుకోవచ్చు. 

ఉద్యోగం దొరకటం అంత తేలికైన పని కాదు. చాలాకాలం వేచి చూడాల్సి వస్తుంది కూడా. బోలెడన్ని ఈమెయిళ్లు పంపాలి. కాల్స్‌ చేయాలి. రెజ్యుమే ఆకట్టుకునేలా ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు సృజనాత్మకంగా సమాధానాలు ఇవ్వాలి. ఇన్ని చేసినా కచ్చితంగా ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితి కొత్తేమీ కాదు. చాలాకాలంగా  ఎదుర్కొంటూనే వస్తున్నాం. మార్పేమీ లేదు. కానీ ఇప్పుడు జనరేటివ్‌ ఏఐ రూపంలో కొత్త మార్పు వచ్చింది. దీని టూల్స్‌ సాయంతో తాము ఇతరుల కన్నా ప్రత్యేకమని తెలియజేసు కోవచ్చు. భాషను మెరుగుదిద్దటమే కాకుండా ఇంటర్వ్యూకు త్వరగా సన్నద్ధం కావటానికీ అవకాశం కల్పిస్తున్నాయి. 

మెటా ఏఐతో క్విజ్‌

ఇప్పుడు మనదేశంలో మెటా ఏఐ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో ఆయా అంశాల మీద మనకు మనమే క్విజ్‌ నిర్వహించుకోవచ్చు కూడా. ఉదాహరణకు- పైథాన్‌ మీద ప్రధానంగా దృష్టి పెట్టే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగం కోసం వెళ్తున్నారనుకోండి. దీనికి సంబంధించిన ప్రశ్నలతో క్విజ్‌ ఏర్పాటు చేసి, సన్నద్ధం చేయమని మెటా ఏఐని కోరవచ్చు. అంతేకాదు.. ఆయా అంశాల గురించి సవివరంగా శోధించవచ్చు.

ఛాట్‌జీపీటీతో కవర్‌ లెటర్‌

ఛాట్‌జీపీటీ పేరు వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. టెక్‌ లోకంలో ఇప్పుడిది సర్వత్రా విస్తరించింది. కళాశాల విద్యార్థులూ అసైన్‌మెంట్లను పూర్తి చేయటానికి దీని సాయం తీసుకుంటున్నారు. మరి దీన్ని రెజ్యుమే తయారీకి ఎందుకు వాడుకోకూడదు? దీనర్థం మొత్తం కవర్‌ లెటర్‌ను ఛాట్‌జీపీటీతో రాసుకోవాలని కాదు. రెజ్యుమేను మరింత ఆకర్షణీయంగా మలచుకోవటానికి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. వ్యాకరణ దోషాలను పరిహరించుకోవచ్చు. అర్థవంతంగా మలచుకోవచ్చు. కాకపోతే ఛాట్‌జీపీటీకి ఇచ్చే ప్రాంప్ట్‌ల విషయంలో సృజనాత్మకంగా వ్యవహరించాలి. ఆయా ఉద్యోగాలకు అనువైన ప్రాంప్ట్‌లు ఇవ్వాలి. మన బలాలను, ప్రాధాన్యాలను సవివరంగా అందించాలి. అంతా పూర్తయ్యాక దోషాలేవైనా ఉన్నాయేమో జాగ్రత్తగా చదువుకోవాలి. అనుచిత భాష ఉంటే సవరించాలి. తర్వాత కంపెనీలకు పంపాలి.

ఇంటర్వ్యూకు సిద్ధం

ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరైనా సరే. ప్రతిదీ కొత్తదే. ప్రతిదీ సవాలే. జీపీటీ-4ఓలో సమ్మిళితమైన ఛాట్‌జీపీటీ వాయిస్‌ టూల్‌తో మనకు మనమే ఇంటర్వ్యూకు సిద్ధం కావొచ్చు. ఇది మనుషులు మాట్లాడినట్టే గలగలా మాట్లాడేస్తుంది. ఛాట్‌జీపీటీ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని, వాయిస్‌ విభాగంలోకి వెళ్లి ఇంటర్వ్యూ సన్నివేశాన్ని సిమ్యులేట్‌ చేయొచ్చు. అప్పుడు ఛాట్‌జీపీటీ ఇంటర్వ్యూ చేసేవారి మాదిరిగా ప్రశ్నలు సంధిస్తుంది. ఎలాంటి ఉద్యోగమో స్పష్టంగా వివరిస్తే దానికి అనుగుణంగా ఇంటర్వ్యూ చేస్తుంది. ప్రశ్నలను తిప్పి అడుగుతూ నైపుణ్యాలను వెలికి తీయటానికీ ప్రయత్నిస్తుంది. 

ఈమెయిళ్ల సారాంశాలు

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటం మొదలు పెట్టినప్పటి నుంచీ అక్‌నాలెడ్జ్‌మెంట్లు, సమాధానాలతో ఇన్‌బాక్స్‌ నిండుతూ వస్తుంది. కొన్ని ఉపయోగపడనివీ ఉండొచ్చు. వీటిని విడదీసుకోవటం అంత తేలిక కాదు. అదృష్టం కొద్దీ ఇప్పుడు జీమెయిల్‌లో బిల్టిన్‌గా ఈమెయిళ్ల సారాంశాన్ని గుదిగుచ్చే ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది త్వరగా సమాచారాన్ని విడమరచి పెడుతుంది. ఒకేసారి ఎక్కువ మెయిళ్లను మేనేజ్‌ చేసేటప్పుడు చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే ముఖ్యమైన మెయిళ్లను క్షుణ్ణంగా చదవటం ముఖ్యమనే సంగతిని విస్మరించరాదు. కీలకమైన వివరాలను పట్టుకోలేకపోతే తర్వాత చింతించాల్సి వస్తుంది.

కోపైలట్‌తో స్వీయ బ్రాండింగ్‌

మిగతావారి కన్నా మనల్ని భిన్నంగా, ప్రత్యేకంగా ఉంచేది ఏది? స్వీయ గుర్తింపు. రెజ్యూమ్‌లో గానీ సోషల్‌ మీడియాలో గానీ ఇది అవసరమే. కోపైలట్‌ వంటి టూల్స్‌ పదాల ప్రాంప్ట్‌లతోనే ఇమేజ్‌లను సృష్టిస్తాయి. సోషల్‌ మీడియా కోసమైతే కార్టూన్లను పోలినవీ వాడుకోవచ్చు. ఇలాంటి జనరేటివ్‌ ఏఐ టూల్స్‌తో ఎలాంటి ఇమేజ్‌లనైనా రూపొందించుకోవచ్చు. అయితే తగిన ప్రాంప్ట్‌లను ఇస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేక గుర్తింపు పొందొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని