కొత్త స్పేస్‌సూట్!
చలేస్తే స్వెటర్. ఉక్కపోస్తే నూలు వస్త్రాలు. వానొస్తే రెయిన్ కోట్. ఏ కాలానికి ఆ దుస్తులు ధరించటం అలవాటే. ఆయా వాతావరణాల నుంచి శరీరాన్ని కాపాడటానికివి తప్పనిసరి. భూమ్మీద నివసించే మనకే ఇంత రక్షణ అవసరమైతే.
చలేస్తే స్వెటర్. ఉక్కపోస్తే నూలు వస్త్రాలు. వానొస్తే రెయిన్ కోట్. ఏ కాలానికి ఆ దుస్తులు ధరించటం అలవాటే. ఆయా వాతావరణాల నుంచి శరీరాన్ని కాపాడటానికివి తప్పనిసరి. భూమ్మీద నివసించే మనకే ఇంత రక్షణ అవసరమైతే.. అసలు వాతావరణమే లేని అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు ఇంకెంత భద్రత కావాలి? అందుకే ప్రత్యేక స్పేస్ సూట్లు ధరిస్తుంటారు. ఇవి కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి. కొత్త కొత్త మార్పులు, చేర్పులతో అధునాతనంగా రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో కొత్తరకం స్పేస్ సూట్‌ను ఆవిష్కరించింది. దీని ప్రత్యేకతలేంటో చూద్దాం.
అప్పుడెప్పుడో 1972లో చివరిసారి చంద్రుడి మీద మనిషి సంచరించాడు. అప్పట్నుంచీ మళ్లీ ఎవరూ అక్కడికి వెళ్లలేదు. ఇప్పుడు చంద్రుడి మీదికి మరోసారి మనుషులను పంపటానికి నాసా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆర్టెమిస్ ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో ప్రయాణించే వ్యోమగాములు ధరించే కొత్తరకం స్పేస్ సూట్‌ను ఇటీవల ప్రదర్శించింది. అప్పట్లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్‌డ్రిన్ ధరించిన భారీ స్పేస్ సూట్ల మాదిరిగా కాకుండా మరింత తేలికగా, సౌకర్యంగా, వివిధ శరీర ఆకారాలకు సరిపోయేలా దీన్ని రూపొందించటం విశేషం. ఆగ్జియోమ్ అనే కంపెనీ దీన్ని తయారుచేసింది. గతంలో నాసా రూపొందించిన సూట్లలోని డిజైన్ అంశాలను ఇందులో జోడించినప్పటికీ కొన్ని ప్రత్యేకతలు లేకపోలేదు. దీన్ని ఆగ్జియమ్ ఎక్స్‌ట్రావెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ అని పిలుచుకుంటున్నారు.
అసలు స్పేస్ సూట్ ఎందుకు?
అంతరిక్షంలో, చంద్రుడి ఉపరితలం మీద పరిస్థితులు విపరీతంగా ఉంటాయి. వీటిని తట్టుకోవటం చాలా కష్టం. స్పేస్ సూట్ లేకపోతే అక్కడ మనుషుల మనుగడ సాధ్యం కాదు. ఇది అంతరిక్షంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. వాతావరణం లేకపోవటం వల్ల సూర్యరశ్మి నేరుగా పడేచోట్ల ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుంది. అదే చీకటి ప్రాంతాల్లో గడ్డ కట్టించేంత చల్లగా ఉంటుంది. స్పేస్ సూట్ చేసే ప్రధానమైన పని విపరీత ఉష్ణోగ్రతల నుంచి వ్యోమగాములకు రక్షణ కల్పించటం. ఇది శ్వాసించటానికి తగినంత గాలి అందేలా చేస్తుంది కూడా. అలాగే శరీరం చుట్టూ తగినంత గాలి పీడనంలో ఉండేలా కూడా చూస్తుంది. మామూలు దుస్తుల్లా కాకుండా మనిషి ఆకారంలో ఉండేలా స్పేస్ సూట్‌ను రూపొందించటంలో మతలబు ఇదే. అంతరిక్షంలో రేడియేషన్ చాలా హాని కలిగిస్తుంది. సూక్ష్మమైన ఉల్కలు, ఇతర రేణువుల వంటివి అతి వేగంగా ప్రయాణిస్తుంటాయి. వీటి నుంచీ స్పేస్ సూట్ రక్షణ కల్పిస్తుంది. చంద్రుడి మీద దుమ్ము మరో అతి పెద్ద సమస్య. ఇది భూమ్మీద దుమ్ము కన్నా మరింత ఎక్కువ కోతకు గురిచేస్తుంది. తాకిన ప్రతిదాన్నీ కోసేస్తుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్తే పెను సమస్యగా పరిణమిస్తుంది. చంద్రుడి దుమ్ము ధూళి నుంచి స్పేస్ సూట్ కాపాడుతుంది. కఠినమైన పరిస్థితులు, వాతావరణాల నుంచి రక్షించటానికే కాదు.. అంతరిక్షంలో ప్రయోగాలు, పనులు చేయటానికీ ఇది తోడ్పడుతుంది.
పాత సూట్ల కన్నా భిన్నం
అంతరిక్ష అన్వేషణలో 1961-72 మధ్య సాగిన అపోలో ప్రయోగాలు గొప్ప మైలురాళ్లుగా నిలిచాయి. అప్పటి వ్యోమగాములు ధరించిన స్పేస్ సూట్లు కూడా విప్లవాత్మకమైనవే. ప్రాథమిక స్పేస్ సూట్ల మాదిరిగా కాకుండా అపోలో వ్యోమగాములు వేసుకున్న సూట్లలో లైఫ్ సపోర్టు సిస్టమ్‌లను జోడించారు. అంతరిక్షంలోని శూన్యానికి గురైనప్పుడు ఇవి పెద్దగా ఉబ్బేవి కావు. చంద్రుడి ఉపరితలం మీద నడవటానికి తోడ్పడే ప్రత్యేకమైన బూట్లు కూడా ఉండేవి. అంతరిక్ష కేంద్రంలో వాడే స్పేస్ సూట్ల తయారీకీ వీటి ప్రాథమిక సూత్రాలనే అనుసరిస్తున్నారు. కాకపోతే సాంకేతికంగా కొన్ని మార్పులు చేశారు. అపోలో స్పేస్ సూట్లు అప్పటికి గొప్పవే అయినప్పటికీ అవి కఠినంగా ఉండేవి. అంత సౌకర్యంగా ఉండేవి కావు. భుజాలు, మణికట్టు, తుంటి, మోకాళ్ల వద్ద రబ్బరును జోడించినా పెద్దగా వంగేవి కావు. అందుకే ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్ వీటితో చంద్రుడి మీద నడవటానికి కష్టపడేవారు. నడవటం కన్నా గెంతులేయటమే మంచిదనే విషయాన్ని గ్రహించి, దాన్నే అనుసరించారు. నడుం వంచాలంటే దాదాపు అసాధ్యమనే చెప్పుకోవచ్చు. చేతులకు గ్లవుజులు వేసుకోవటం వల్ల ఏదైనా పట్టుకోవటమూ కష్టమయ్యేది. కొత్త సూట్ మరింత బాగా కదలటానికి తోడ్పడుతుంది. వంగటం, గెంతటం, మోకాళ్ల మీద కూర్చోవటం వంటివి తేలికగా చేయొచ్చు. తల చుట్టూ మరింత పెద్ద, స్పష్టమైన బుడగ ఉండటం వల్ల విస్తృత కోణంలో ఉన్న దృశ్యాలను చూడొచ్చు. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఇరుకు బిలాలను పరిశీలిస్తున్నప్పుడు ఇలాంటి సదుపాయం అత్యవసరం. ఇక్కడ మంచుతో కూడిన నీరు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తల భాగంలో అత్యధిక నాణ్యతతో కూడిన కెమెరా ఉండటం మరో ప్రత్యేకత. ఇలా స్పేస్ సూట్ చాలావరకు మారినప్పటికీ కొన్ని విషయాల్లో ముందడుగు వేయలేకపోయాం. ఉదాహరణకు- ఇప్పటికీ స్పేస్ సూట్లలో డైపర్లనే వాడటం.
తొలినాళ్లలో..
మనదేశపు తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ. ఆయన 1984లో సోయుజ్ టి-11 ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. రష్యా తయారుచేసిన సోకోల్ సూట్‌ను ధరించారు.
తొలి వ్యోమగామి, సోవియట్ యూనియన్‌కు చెందిన యూరీ గగారిన్ జ్వెజ్దా కంపెనీ తయారుచేసిన ఎస్‌కే-1 స్పేస్ సూట్‌ను ధరించారు. చాలా ఎత్తులో ప్రయాణించే విమాన పైలట్లు ధరించే సూట్ల స్ఫూర్తితో దాన్ని రూపొందించారు. దీనికి విడదీయటానికి వీల్లేని హెల్మెట్, తోలు గ్లవుజులు, బూట్లు ఉండేవి. తోలుతో కప్పిన రేడియో హెడ్‌సెట్ కూడా ఉండేది. వోస్టోక్-1 వాహకనౌక మీదుండే కంట్రోళ్లను చూడటానికి వీలుగా అద్దాన్ని కూడా సూట్‌కు కుట్టటం విశేషం. అదే సంవత్సరం నాసా చేపట్టిన మెర్క్యురీ ప్రయోగంలో భాగంగా అమెరికాకు చెందిన అలన్ షెపర్డ్ అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో వ్యక్తిగా చరిత్రకు ఎక్కారు. జెట్ విమానం ప్రెషర్ సూట్‌ను మెరుగుపరచి ఆయన వేసుకున్న స్పేస్ సూట్‌ను తయారుచేశారు. దీని లోపలి పొరను నైలాన్‌తో కూడిన వస్త్రం (నియోప్రేన్), బయటి పొరను అల్యూమినియంతో కూడిన నైలాన్‌తో రూపొందించారు. దీనికి జిప్పులు కూడా ఉండేవి. వ్యోమనౌక కంట్రోళ్లను తేలికగా వాడుకోవటానికి ప్రత్యేకమైన గ్లవుజులు కూడా ఉండేవి. ఫ్రెండ్‌షిప్ 7 వ్యోమనౌక ద్వారా 1962లో భూమిని మూడు సార్లు చుట్టి వచ్చిన జాన్ గ్లెన్ అనే వ్యోమగామి కూడా ఇదే సూట్‌ను ధరించారు.
అంతరిక్ష పర్యటక యుగంలో
అంతరిక్ష పర్యటకం కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. స్పేస్ సూట్ల డిజైన్‌నూ మార్చేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ సూట్‌ను తలమానికమైనదని చెప్పుకోవచ్చు. 3డీ ముద్రణ పద్ధతిలో రూపొందించిన దీన్ని హెల్మెట్‌లో మైక్రోఫోన్లు కూడా ఉన్నాయి. సూట్‌లో పీడనాన్ని నియంత్రించటానికి కవాటాలూ ఏర్పరచారు. టచ్ స్క్రీన్‌కు తోడ్పడే గ్లవుజులు మరో ప్రత్యేకత. అవసరమైనప్పుడు చేత్తో తాకటానికి వీలుగా నడుం వద్ద జిప్పులనూ ఏర్పాటు చేశారు. అన్నింటికన్నా ముఖ్యంగా వీటి వెలుపలి భాగాన్ని మంటలకు అంటుకోకుండా రూపొందించారు.
* ఆధునిక స్పేస్ సూట్లకు మరో నిదర్శనం బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్ సూట్. ఇది చాలా తేలికగా ఉంటుంది. సూట్ ఒత్తిడికి గురైనా కూడా కదిలే కీళ్ల వంటి నిర్మాణాలు మరింత ఎక్కువ కోణంలో వంగటానికి తోడ్పడతాయి. రీబాక్ కంపెనీ సాయంతో ప్రత్యేకమైన పాదరక్షలనూ రూపొందించారు.
చంద్రుడి మీదికి వెళ్లేటప్పుడు తెల్ల సూట్లే
సాధారణంగా స్పేస్ సూట్లు తెల్లగా ఉంటాయి. ఇవి లోపలికి వేడి ప్రసరించకుండా చూస్తూనే.. బయటి కాంతిని అవతలికి వెదజల్లుతాయి. వాతావరణం లేని అంతరిక్షంలో సూర్యుడి నుంచి నేరుగా పడే ఎండను తట్టుకోవటానికిది అత్యవసరం. మరి ఏగ్జియమ్ రూపొందించిన సూట్ నల్లగా ఉందేం అనుకుంటున్నారా? ఇది కేవలం ప్రదర్శనకు మాత్రమే. అసలు ప్రయోగంలో వ్యోమగాములు తెల్ల సూట్లనే ధరిస్తారు.
అన్నిరకాల అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడేలా కొత్త సూట్‌ను తీర్చిదిద్దారు. చంద్రుడి ఉపరితలం మీద దుమ్ముధూళిని తట్టుకోవటంతో పాటు గురుత్వాకర్షణ స్వల్పంగా ఉండే వ్యోమనౌక లోపల సురక్షితంగా, ఆయా పనులను తేలికగా చేసుకునేలా తీర్చిదిద్దారు.
కొత్త సూట్ హెల్మెట్ పక్కలకు హెచ్‌డీ వీడియో కెమెరాను అమర్చారు. దీంతో నేరుగా భూమికి ప్రత్యక్ష వీడియో ప్రసారాలు చేయొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ IPL Final: ఐపీఎల్ టాప్ 10 కథనాలు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..
-
Movies News
Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్
-
Sports News
Dhoni - Jaddu: మహీ భాయ్.. కేవలం నీ కోసమే: వైరల్‌గా మారిన జడ్డూ పోస్టు
-
India News
Manipur: మణిపుర్లో పరిస్థితులు సద్దుమణిగేందుకు కొంత సమయం పడుతుంది: సీడీఎస్
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్ తోడిన ఘటన.. ఆ నీళ్లకు డబ్బులు వసూలు చేయండి..!