Published : 10 May 2022 02:26 IST

SmartPhone: కొత్త ఫోన్ కొంటున్నారా..? అయితే ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి!

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఫోన్‌ కొనాలనుకునేవారికి ఎన్నో సందేహాలు. ఫోన్‌లో బ్యాటరీ నుంచి కెమెరా పిక్సెల్‌, స్క్రీన్‌ డిస్‌ప్లే‌, ర్యామ్‌ ఇలా ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని ఒక మోడల్‌ను ఎంచుకుంటే అది తమ బడ్జెట్‌లో రాకపోవచ్చు. దీంతో ఏదో ఒక ఫీచర్‌ బాగుంటే చాలు అనుకుని ఫోన్‌ కొనేస్తుంటారు. తర్వాత అది తమ అవసరానికి తగినట్లుగా లేకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. మరి, స్మార్ట్‌ఫోన్ కొనేముందు వాటిల్లో మ‌నం చూడాల్సిన ఫీచ‌ర్లు ఏమిటి? త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్‌ కొనేముందు ముఖ్యంగా ఆరు అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ సామర్థ్యం, ప్రాసెసర్‌, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, డిజైన్‌. ఒకవేళ మీరు స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడిపేవారయితే స్పీకర్స్‌, ఫోన్‌ క్వాలిటీ, స్ల్పాష్‌ రెసిస్టెంట్ వంటి అంశాల్ని కూడా గుర్తు పెట్టుకోవాలి.


1️⃣ ఎక్కువసేపు ఫోన్‌లో వీడియోలు చూసేవారైతే అమోలెడ్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ స్పీకర్స్‌, 3.5 ఎమ్‌ఎమ్‌ జాక్‌ వంటి ఫీచర్లు ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం ఉత్తమం. మొబైల్ గేమింగ్ మీ ప్రాధాన్యమైతే 90 హెర్జ్‌ లేదా 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తోపాటు 240 హెర్జ్‌ ఆపై టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ కలిగిన మోడల్స్‌ మెరుగైన పనితీరును అందిస్తాయి.  


2️⃣ ఫోన్‌ పనితీరు మెరుగ్గా ఉండాలనుకుంటే కొత్త తరం ప్రాసెసర్‌తో పనిచేసే మోడల్స్‌వైపు దృష్టిసారించడం మేలు. ఉదాహరణకు ₹ 20 వేలలోపు ధరలో 6 ఎన్‌ఎమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ కలిగిన ఫోన్లు ఉత్తమమైన పనితీరును అందించడమే కాకుండా తక్కువ బ్యాటరీ ఉపయోగించుకుంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల బ్యాటరీ జీవితకాలం మెరుగవుతుందట. అలానే ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే మోడల్స్‌ను ఎంచుకుంటే, బ్యాటరీ ఛార్జింగ్ చేసే సమయం కూడా తగ్గిపోతుందని సూచిస్తున్నారు. 


3️⃣ ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద మొబైల్‌ మార్కెట్‌ కావడంతో యూజర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు తక్కువ ధరలో మంచి కెమెరా సామర్థ్యం కలిగిన ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే కెమెరా పరంగా ఫోన్‌ మోడల్‌ను ఎంచుకునే ముందు మెగాపిక్సెల్ ఎంత‌? ఎన్ని సెన్సార్లు ఉన్నాయనేది మాత్రమే చూస్తే సరిపోదు. కెమెరా పనితీరు ఎలా ఉంది? వెనుక వైపు కెమెరాల్లో అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా ఉందా? డెప్త్‌ సెన్సార్‌ కెమెరా ఇస్తున్నారా? లేదా? వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 


4️⃣ గూగుల్ గతేడాదే ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌ను విడుదల చేసినప్పటికీ.. 2022లో విడుదలైన చాలా స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో మార్కెట్లోకి విడుదలయ్యాయి. కొత్తగా ఫోన్‌ కొనాలనుకునేవారు ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తున్న మోడల్స్‌ను ఎంచుకోమని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లతోపాటు, ప్రైవసీ సెట్టింగ్స్‌ను కూడా యూజర్స్ పొందవచ్చు.  


5️⃣ 5జీ సాంకేతికతను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. గతేడాది నుంచే మొబైల్ తయారీ కంపెనీలు 5జీ సాంకేతికత ఉన్న ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే మోడల్స్‌ను ఎంచుకోవడం మేలు. 


6️⃣ చివరగా ఫోన్‌ కొనేముందు గుర్తుంచుకోవాల్సింది.. సర్వీస్‌ ఎలా ఉంటుందనేది. ఫోన్ కొన్న తర్వాత రిపేర్‌ అయితే సదరు కంపెనీ సర్వీస్‌ ఎలా ఉంది? ఫోన్‌ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని రోజుల సమయం తీసుకుంటున్నారు? సర్వీస్‌ సెంటర్లు అన్ని చోట్లా అందుబాటులో ఉన్నాయా? లేదా? వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts