App Yoga: యాప్‌ యోగం!

శరీరాన్ని, మనసును సంయోగం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చటానికి యోగా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో భాగమైన ఆసనాలు శరీరం బలంగా ఉండటానికి.. కండరాలు, కీళ్లు సాఫీగా కదలటానికి తోడ్పడతాయి. అలాగే పొట్టలోని అవయవాలను సున్నితంగా మర్దన చేస్తాయి.

Updated : 26 Jun 2024 07:05 IST

శరీరాన్ని, మనసును సంయోగం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చటానికి యోగా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో భాగమైన ఆసనాలు శరీరం బలంగా ఉండటానికి.. కండరాలు, కీళ్లు సాఫీగా కదలటానికి తోడ్పడతాయి. అలాగే పొట్టలోని అవయవాలను సున్నితంగా మర్దన చేస్తాయి. ఇలా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి, జబ్బుల నివారణకు దోహదం చేస్తాయి. ఇక ధ్యానం, ప్రాణాయామాలేమో మానసిక ప్రశాంతతకు, కంటి నిండా నిద్ర పట్టటానికి తోడ్పడతాయి. అదే సమయంలో ఆధ్యాత్మిక సాధనకూ ఉపయోగపడతాయి. అయితే యోగా విషయంలో చాలామంది చేసే పొరపాటు సరైన పద్ధతిని పాటించకపోవటం. కొద్దిరోజులు సాధన చేసి మానెయ్యటం. మరి ఇలాంటి అడ్డంకులను దాటి, రోజువారీ జీవితంలో యోగాను ఒక భాగంగా మలచుకోవాలంటే? యాప్‌ల సాయం తీసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు అంతా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఇవి అనుక్షణం చేదోడుగా నిలుస్తాయనటంలో సందేహం లేదు. అలాంటి కొన్ని యాప్‌లు ఇవిగో..


ప్రయోగ

యోగా చేసే పద్ధతులను సూచించటం దీని ఉద్దేశం. వాచ్‌ఓఎస్, ఐఓఎస్‌ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఇది పలు వీడియో, ఆడియోల ద్వారా మార్గ నిర్దేశం చేస్తుంది. యాపిల్‌ వాచ్‌లోని ఎంఎల్, విజన్‌ ఆధారిత బాడీ మానిటరింగ్‌ ట్రాక్స్‌ సాయంతో శరీరంలోని 17 కీళ్ల కదలికలను పసిగడుతుంది. వీటి కదలికలను బట్టి ఆసనాలు ఎలా వేస్తున్నారో విశ్లేషిస్తుంది. తప్పుగా చేస్తుంటే వెంటనే సరిదిద్దుకోవాలని చెబుతుంది. ఎలా సరిదిద్దుకోవాలో చూపిస్తుంది కూడా.


కల్ట్‌.ఫిట్‌

ఇందులో బోలెడన్ని వ్యాయామ, ఫిట్‌నెస్‌ తరగతులుంటాయి. ఇందులో యోగా ఒకటి. ఇది కష్టం అనిపించకుండా వినోదభరితంగా యోగాను చేసేలా పురికొల్పుతుంది. ఆయా వ్యక్తుల ఫిట్‌నెస్‌ లక్ష్యాలకు అనుగుణంగా.. శక్తి, బలం పెంపొందేలా యోగా తరగతులను నిర్ణయించటం దీని ప్రత్యేకత. ఇలా శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కావాలంటే ఇతర రకాల వ్యాయామాల రీతులనూ సాధన చేయొచ్చు.


ఆసన రెబెల్‌ 

ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని, బరువు తగ్గాలని, ఫిట్‌గా ఉండాలని కోరుకునేవారి కోసం ఉద్దేశించిన యోగా, ఫిట్‌నెస్‌ యాప్‌ ఇది. యోగా స్ఫూర్తితో ఫిట్‌నెస్‌ను సాధించేలా చూడటం దీని ప్రత్యేకత. కొన్నిరకాల సమస్యలు తగ్గటానికి ప్రత్యేకించిన ఆసనాలనూ ఇందులో చూడొచ్చు. ఉదాహరణకు- జీర్ణశక్తిని పెంచుకోవటానికి ఊర్ధ్వ ధనురాసనం, ధనురాసనం, బాలాసనం, మార్జాలాసనం, ఉష్ట్రాసనం వంటివి సక్రమంగా ఎలా చేయాలో నేర్చుకోవచ్చు.


కామ్‌

ఇది ధ్యానం, ప్రశాంతత, నిద్ర కోసం రూపొందించిన యాప్‌. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవటం, మూడ్స్‌ను నియంత్రణలో పెట్టుకోవటం, కంటి నిండా నిద్ర పట్టేలా చూసుకోవటం, ఏకాగ్రతను పెంచుకోవటం వంటి వాటిని దీంతో సాధించొచ్చు. నిద్ర పట్టటానికి తోడ్పడే కథలు, ప్రాణాయామం, శరీరాన్ని సాగదీసే వ్యాయామాలు, ప్రశాంతత చేకూర్చే సంగీతం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటిని సాధన చేసే లక్షలాది మందితో అనుసంధాన మయ్యే అవకాశమూ ఉంది.


యాంగ్జయిటీ అండ్‌ స్లీప్‌: అర్బన్‌ హెల్త్‌

ధ్యాన పద్ధతులు, నిద్ర కథలు, హిప్నోథెరపీ, ప్రాణాయామం, ప్రశాంత సంగీతం వంటి ఫీచర్లతో ఇది కట్టి పడేస్తుంది. ప్రముఖ సైకాలజిస్టులు, మానసిక ఆరోగ్య నిపుణులు దీన్ని సిఫారసు చేస్తుండటం విశేషం. ధ్యానం ఆరంభించేవారికిది బాగా సరిపోతుంది. నైపుణ్యం పొందినవారికీ మేలు చేస్తుంది. ప్రాణాయామం వంటి శ్వాస విధానాలతో త్వరగా, తేలికగా మానసిక ప్రశాంతత పొందటం.. నిర్దేశిత పాఠాలతో బాధను అధిగమించటం.. కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ పద్ధతులతో విశ్వాసాన్ని పెంపొందించుకోవటం.. వ్యక్తిగత ప్రణాళికతో మంచి అలవాట్లను అలవరచుకోవటం.. ఐదు నిమిషాల్లోనే ఆందోళన తగ్గించుకోవటం వంటి అవసరాల కోసం ఇందులో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.


హెడ్‌స్పేస్‌: మైండ్‌ఫుల్‌ మెడిటేషన్‌

మనసు మీద దయ చూపండని సూచించటంలోనే దీని లక్ష్యమేంటో అర్థమవుతుంది. ఇది ధ్యానం ద్వారా ఆనందాన్ని పొందటాన్ని ప్రోత్సహిస్తుంది. కథలు, సంగీతంతో ప్రశాంతత చేకూరుస్తుంది. ఇలా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి, కంటి నిండా నిద్ర పోవటానికి తోడ్పడుతుంది. స్వల్పకాల తరగతులతో రోజువారీ జీవితంలో ధ్యానాన్ని ఒక భాగం చేసుకునేలా పురికొల్పుతుంది. రోజును ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా ఆరంభించాలో నేర్పిస్తుంది. ఈ విధంగా మానసికంగా మంచి ఆరోగ్యంతో తొణికి సలాడేలా చేస్తుంది. ఇదొక్కటే కాదు.. మనసు పెట్టి ఎలా తినాలి? ఎలా ఖర్చు చేయాలి? అనేదీ నేర్చుకోవచ్చు. తల్లిదండ్రులు, పిల్లల ఒకరితో ఒకరు ఎలా మెలగాలో బోధించే ప్రత్యేక ఫీచర్‌ కూడా ఉంది.


యోగా ఫర్‌ బిగినర్‌- యోగా యాప్‌

యోగా నేర్చుకోవాలని అనుకునేవారికిది అనువైంది. స్వల్పకాలంలో చేయగల ఆసనాలను దీంతో త్వరగా నేర్చుకోవచ్చు. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ కుటుంబంలో అందరి అవసరాలకు అనుగుణమైన ఆసనాలను దీంతో సాధన చేయొచ్చు. ఇందులో వందకు పైగా ఆసన రీతులున్నాయి. చిన్నగా ఆరంభించి క్రమంగా పెంచుకుంటూ రావొచ్చు. నిపుణుల సూచనలతో కూడిన వీడియోలను చూస్తూ సరైన పద్ధతిలో ఎలా వేయాలో నేర్చుకోవచ్చు. ఏ ఆసనం వేస్తున్నప్పుడు ఏయే అవయవాల మీద ధ్యాస పెట్టాలో కూడా ఇది చూపిస్తుంది. ఎంతమేరకు పురోగతి సాధిస్తున్నామో ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది కూడా. 


సద్గురు- యోగా అండ్‌ మెడిటేషన్‌

దీని ద్వారా తెలుగుతో పాటు మొత్తం 12 భాషల్లో ఈశా యోగ పద్ధతులను సాధన చేయొచ్చు. యోగా మొదలుపెట్టేవారు దీన్ని ప్రయత్నించొచ్చు. ఉచిత యోగా, ధ్యాన పద్ధతులతో ప్రయోజనం పొందొచ్చు. రోజుకు కొద్ది నిమిషాల సాధనతోనే ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడటానికి.. ప్రశాంతంగా, ఆనందంగా ఉండటానికి దారి చూపుతుంది. రోజూ వేర్వేరు అంశాల మీద సూక్తులు, కథనాలు, పాడ్‌కాస్ట్‌లు, వీడియోలు కూడా చూడొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని