
Apple App Store 2021: యూజర్స్ మెచ్చిన టాప్ యాప్స్, గేమ్స్ ఏంటో తెలుసా?
ఇంటర్నెట్‌డెస్క్: యాప్ స్టోర్ అనేది యాపిల్ స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్క యూజర్‌కు అవసరమైన అప్లికేషన్లను అందించే భాండాగారం. ఏటా సరికొత్త అప్లికేషన్లు, గేమ్స్‌తో పాటు ఉన్న వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఎన్నో యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే, ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సరికొత్త ఆవిష్కరణలతో యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లలో వేల అప్లికేషన్లు యాప్ స్టోర్‌లో వచ్చి చేరాయి. కానీ, వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్స్, గేమ్స్ ఏవంటే ఏం చెబుతాం. తాజాగా యూజర్స్ మెచ్చిన అప్లికేషన్లను, గేమ్స్ జాబితాను యాపిల్ సంస్థ విడుదల చేసింది. మరి 2021లో భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన అప్లికేషన్లతో పాటు గేమ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..!
వాట్సప్ మెసెంజర్
స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాడే అప్లికేషన్ వాట్సప్ మెసెంజర్. దీంతో మెసేజ్ మాత్రమే కాకుండా వీడియో కాల్స్, లొకేషన్ షేరింగ్, కాంటాక్ట్స్ షేరింగ్ వంటి వాటితో పాటు తాజాగా ఆన్లైన్ పేమెంట్ చేసే సౌకర్యం ఈ అప్లికేషన్లో ఉంది. ఈ ఏడాది యాపిల్ యాప్ స్టోర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన అప్లికేషన్లలో ఇది అగ్రస్థానంలో కొనసాగుతోంది.
యూట్యూబ్
ఆన్లైన్లో వీడియో వీక్షణకు ప్రతి ఒక్కరూ వాడే అప్లికేషన్ ఇది. దీనిలో లక్షల వీడియోలు అందుబాటులో ఉంటాయి. వీడియో క్లిప్స్, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్స్మ్, మూవీ ట్రైలర్స్, ప్రత్యక్ష ప్రసారాలు వంటి చాలా రకాల కంటెంట్ ఉండటంతో లక్షల మంది యూజర్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. గూగుల్‌కి చెందిన టాప్ ఫోర్ యాప్స్‌లో యూట్యూబ్ కూడా ఉండడం గమనార్హం. ఈ ఏడాది యాప్ స్టోర్‌లో యూట్యూబ్ రెండో స్థానాన్ని సంపాదించుకుంది.
ఇన్స్టాగ్రామ్
వాట్సాప్ తర్వాత స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ముఖ్యంగా యూత్ ఎక్కువగా వాడే అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్. సెలబ్రిటీలతో పాటు చాలా మంది దీనిలో తమ ఫొటోలను, వీడియోలను ఇతరులతో పంచుకుంటుంటారు. 2021లో ఇన్స్టాగ్రామ్ తన పాపులారిటీని కోల్పోకుండా అత్యంత ప్రజాదరణ పొందిన అప్లికేషన్లలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఫేస్బుక్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో ఫేస్బుక్ ఒక ఊపు ఊపేసిందని చెప్పుకోవచ్చు. ఫేస్బుక్ ఖాతా ఉంటే ఎంతో మంది స్నేహితుల్ని చేసుకోవచ్చని భావించిన చాలా మంది ఖాతాను తెరిచారు. కాలక్రమంలో దీనికి ఒక ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించగా.. ప్రతి ఒక్క యూజర్ దీన్నే డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే కొన్ని ఫోన్లలో డీఫాల్ట్గానూ వస్తోంది. తాజాగా యాప్ స్టోర్‌లో హౌజ్ ఆఫ్ మెటాలో మూడో అప్లికేషన్‌గా ఫేస్బుక్ ఎంతగానో పాపులర్ అయ్యింది.
గూగుల్ పే
ఆన్లైన్ పేమెంట్ వచ్చాక ఎక్కువగా ప్రాచుర్యం పొందిన అప్లికేషన్లలో గూగుల్ పే అగ్రస్థానంలో ఉంది. ఈ అప్లికేషన్ కూడా యాపిల్ ప్లే స్టోర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఐదో స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే మరో ఆన్లైన్ పేమెంట్ యాప్ ఫోన్ పే కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. అత్యంత ప్రజాదరణ పొందిన అప్లికేషన్లలో ఫోన్ పే 8వ స్థానంలో కొనసాగుతోంది.
స్నాప్‌చాట్
ఒకేసారి 16 మంది స్నేహితులతో వీడియో చాట్ చేయడానికి వాడే యాప్ స్నాప్‌చాట్. మొదట్లో ఈ యాప్‌ను తక్కువగానే ఆదరించినా..ఆ తర్వాత ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. తాజాగా ఈ జాబితాలో స్పాప్‌చాట్ కూడా వచ్చి చేరి 6వ స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ జాబితాలో ఇవేకాకుండా అమెజాన్ ఇండియా, గూగుల్ క్రోమ్, జీ మెయిల్ కూడా అత్యంత ప్రజాదరణ పొందిన అప్లికేషన్లలో చోటు దక్కించుకున్నాయి.
➼ అలాగే ఈ ఏడాది యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్ యాప్ స్టోర్లలో టాప్ గేమ్స్‌ను యాపిల్ సంస్థ ప్రకటించింది. అవేంటో కూడా తెలుసుకుందాం..
లూడో కింగ్
కరోనా లాక్డౌన్ సమయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గేమ్స్‌లో లూడో కింగ్ అని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఈ గేమ్‌ను ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని తెగ ఆడేస్తున్నారు. దీన్ని ఇండియన్ స్టూడియో గేమీషన్ టెక్నాలజీ రూపొందించింది. అయితే, ఈ ఏడాది యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్లలో టాప్ గేమ్‌గా స్థానం సంపాదించుకుంది.
బాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)
క్రాఫ్టన్ సంస్థ డెవలప్ చేసిన బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) గేమ్‌కు గతంలో కంటే ఎక్కువ ఆదరణ లభించడం విశేషం. ఈ ఏడాది ఈ గేమ్‌ను యాపిల్ యూజర్స్ చాలా మంది ఆదరించారు. ఈ గేమ్ ఐఫోన్లలో రెండో స్థానాన్ని, ఐప్యాడ్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకుని అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్స్ జాబితాలో కొనసాగుతోంది. ఇది పూర్తిగా పబ్జీ తరహాలోనే ఉన్నప్పటికీ ఆట పరంగా చాలా తేడాలు ఉన్నాయి.
గారెనా ఫ్రీ ఫైర్
ఈ ఏడాది టాప్ 10 గేమ్స్ ఇన్ యాప్ స్టోర్ జాబితాలో గారెనా ఫ్రీ ఫైర్ ఐఓఎస్ ఫ్లాట్‌ఫామ్‌లో మూడో స్థానాన్ని దక్కించుకోగా.. ఐప్యాడ్ ఓఎస్‌లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
సబ్వే సర్ఫేస్
పాపులర్ గేమ్స్ జాబితాలో ఈ ఏడాది సబ్వే సర్ఫేస్ కూడా చోటు దక్కించుకుంది. అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్స్ జాబితాలో ఇది ఐఓఎస్‌లో నాలుగు, ఐప్యాడ్‌లో ఆరో స్థానాన్ని సంపాదించుకుంది.
క్యాండీ క్రష్ సాగా
2012లో వచ్చిన క్యాండీ క్రష్ సాగా ముందుగా ఫేస్బుక్ ఆ తర్వాత ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్లలో చాలా సందడి చేసింది. ఈ ఏడాది టాప్ గేమ్స్ ఇన్ యాప్ స్టోర్‌లో స్థానం దక్కించుకుంది. యాపిల్ ఐఫోన్లలో 5వ స్థానాన్ని, ఐప్యాడ్‌లో 10వ స్థానంలో కొనసాగుతూ పాపులర్ గేమ్ జాబితాలో కొనసాగుతోంది.
ఇవేకాకుండా ఈ ఏడాది యాపిల్ సంస్థ ప్రకటించిన టాప్ గేమ్స్ జాబితాలో కాల్ ఆఫ్ డ్యూటీ:మొబైల్, 8 బాల్ పూల్, వాటర్ సార్ట్ పజిల్, అమాంగ్ హస్, కౌంటర్ మాస్టర్: క్రౌడ్ రన్నర్ త్రీడీ గేమ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.