Tim Cook: 9 ఏళ్లకే యాప్‌ డిజైన్‌‌.. టాలెంట్‌కు టిమ్‌ కుక్‌ ఫిదా!

భారత సంతతికి చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలిక చేసిన ఆవిష్కరణకు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఫిదా అయ్యారు... 

Updated : 26 Sep 2022 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధునిక ప్రపంచంలో ఆవిష్కరణలకు కొదవలేదు. ముఖ్యంగా నేటి తరం విద్యార్థులు, యువత సాంకేతికత ఆధారంగా చేసే ఆవిష్కరణలు అబ్బురపరుస్తుంటాయి. తాజాగా ఓ తొమ్మిదేళ్ల బాలిక చేసిన ఆవిష్కరణకు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఫిదా అయ్యారు. భారత సంతతికి చెందిన హనా అనే బాలిక తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌లో నివసిస్తోంది. ఇటీవల పిల్లల కోసం హనా స్టోరీ పేరుతో కథలు చెప్పే యాప్‌ను సొంతంగా డెవలప్‌ చేసింది. ఇందులో పిల్లల కోసం కొన్ని కథలు ప్రీలోడెడ్‌గా ఉంటాయి. వాటితోపాటు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలనుకుంటున్న బెడ్‌టైమ్‌, క్లాసిక్‌, నీతి కథలను రికార్డు చేసి యాప్‌లో స్టోర్ చేయొచ్చు. దానివల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల వాయిస్‌లోనే కథలు వినడంతోపాటు, వారికి దగ్గరగా ఉన్నామనే భావనకు గురవుతారని హనా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. 

యాప్‌ను పూర్తి స్థాయిలో డిజైన్‌ చేశాక, పరిశీలించమని కోరుతూ టిక్‌ కుక్‌కు పంపగా, ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ మెయిల్ చేశారని హనా తండ్రి తెలిపారు. చిన్నవయస్సులోనే యాప్‌ను డిజైన్‌ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని అభినందిస్తూ మెయిల్‌కు  కుక్‌ రిప్లై ఇచ్చినట్లు చెప్పారు. ఈ యాప్‌ కోసం థర్డ్‌-పార్టీ కోడ్‌లు, ఇతర లైబ్రరీల నుంచి ఎలాంటి సమాచారాన్ని ఉపయోగించకుండా, హనా సొంతంగా సుమారు 10 వేల లైన్ల కోడింగ్‌ను రాసింది. టెక్నాలజీ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ ఆసక్తితోనే తన అక్క లీనా ఫాతిమా నుంచి కోడింగ్ నేర్చుకున్నట్లు చెప్పింది. ఈ యాప్‌ను యాప్‌స్టోర్‌లో ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్‌ యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. వచ్చే ఏడాది జరిగే యాపిల్ వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు హనా తెలిపింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని