iPhone 14: యాపిల్‌ ఈవెంట్ జరిగేది అప్పుడేనా‌.. ఐఫోన్‌ 14తోపాటు ఇంకా ఏం విడుదలవుతాయ్‌?

యాపిల్‌ ఐఫోన్‌ 14 విడుదల తేదీ, ధరపై నెట్టింట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సెప్టెంబరు 7న నిర్వహించే కార్యక్రమంలో ఐఫోన్‌ 14ను విడుదల చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి...

Updated : 17 Aug 2022 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ ఐఫోన్‌ 14 విడుదల తేదీ, ధరపై నెట్టింట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏటా సెప్టెంబర్‌ నెల రెండో వారంలో యాపిల్ కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఈ ఏడాది మాత్రం సెప్టెంబరు 7న నిర్వహించే కార్యక్రమంలో ఐఫోన్‌ 14ను విడుదల చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐఫోన్‌ 14తోపాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8ను కూడా విడుదల చేయనుందట. ఇంతకీ, ఐఫోన్‌ 14ను ఎన్ని వేరియంట్లలో తీసుకొస్తున్నారు? వాటి ధరెంత ఉండొచ్చు వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం.


డిజైన్‌ & వేరియంట్స్‌

ఐఫోన్‌ను 14ను నాలుగు వేరియంట్లలో తీసుకొస్తున్నారు. వీటిలో ఐఫోన్‌ 14, ఐఫోన్ 14 మాక్స్‌, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ ఉన్నాయి. ఇవి ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌. ఈ మోడల్స్‌లో కొత్తగా పర్పుల్‌ షేడ్‌తో కొత్త కలర్‌ ఆప్షన్‌ను పరిచయం చేస్తున్నారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫ్రేమ్‌లకు బదులు టైటానియమ్‌ ఫ్రేమ్‌లతో డిజైన్‌ చేశారు. ఫోన్‌ స్పీకర్‌, మైక్రోఫోన్‌లో కూడా మార్పులు చేసినట్లు సమాచారం.


డిస్‌ప్లే

ఐఫోన్‌ 14, 14 ప్రో మోడల్స్‌లో 6.1 అంగుళాలు, ఐఫోన్‌ 14 మాక్స్‌, 14 ప్రో మాక్స్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. యాపిల్‌ తొలిసారిగా ఈ సిరీస్‌లో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను పరిచయం చేయనుంది. ఇప్పటిదాకా ప్రో మోడల్స్‌కు మాత్రమే పరిచయం అయిన ఫేస్‌ఐడీ ఫీచర్‌ను ఐఫోన్‌ 14 సిరీస్‌లో అన్ని వేరియంట్లలో తీసుకొస్తున్నారు. 


ప్రాసెసర్‌

ఈ మోడల్‌లో యాపిల్‌ కొత్తగా అభివృద్ధి చేసిన ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్‌ వినియోగం పెరిగినప్పుడు వేడెక్కకుండా వేపర్‌ ఛాంబర్‌ థర్మల్‌ సిస్టమ్‌ ఇస్తున్నారు. దీనివల్ల ఫోన్‌ ప్రాసెసర్‌ వేగంగా పనిచేస్తూ, 5జీ కనెక్టివిటీ మెరుగ్గా ఉంటుంది. శాటిలైట్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ కోసం స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌65 5జీ మోడెమ్‌ను ఉపయోగిస్తున్నారు. 6జీబీ, 8జీబీ ర్యామ్‌లతో పనిచేస్తాయి. 


కెమెరా 

ప్రో మోడల్స్‌లో వెనుకవైపు 8K రికార్డింగ్‌ ఫీచర్‌తో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ కెమెరాలను ఇస్తున్నారు. ముందుభాగంలో 12 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇతర వేరియంట్లలో 8K రికార్డింగ్‌ క్వాలిటీ ఉండదని టెక్‌ వర్గాలు తెలిపాయి. గత ఐఫోన్‌ కెమెరాలతో పోలిస్తే వీటిలో పిక్సెల్ బిన్నింగ్‌ కెమెరా టెక్నాలజీ ఉపయోగించినట్లు సమాచారం. తక్కువ లైట్ ఉన్నప్పుడు కూడా అత్యుత్తమ క్వాలిటీ ఫొటోలను అందించడం ఈ సాంకేతికత ప్రత్యేకత.   


బ్యాటరీ & ధర

ఐఫోన్ 14 ప్రోలో 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫోన్ 14లో 3,279 ఎంఏహెచ్‌, ఐఫోన్‌ 14 ప్రో మాక్స్‌లో 4,323 ఎంఏహెచ్‌, ఐఫోన్ 14 మాక్స్‌లో 4,325 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఐఫోన్‌ 14 సిరీస్‌ ప్రారంభ ధర 799 డాలర్లు (సుమారు ₹ 63,500) కాగా, ప్రో మోడల్స్‌ ప్రారంభ ధర 1,099 (సుమారు ₹87,400) డాలర్లుగా ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 


యాపిల్ వాచ్‌ 8 సిరీస్‌

డిజైన్‌ పరంగా వాచ్‌ 7 సిరీస్‌లో తరహాలోనే వాచ్‌ 8 కూడా ఉంటుందని సమాచారం. 2 అంగుళాల డయాగ్నల్‌ స్క్రీన్‌ ఇస్తున్నారు. ఎస్‌8 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. లో పవర్‌ మోడ్‌తోపాటు, కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో బ్యాటరీ ఛార్జింగ్‌ ఎక్కువసేపు ఉంటుందని సమాచారం. టెంపరేచర్‌ సెన్సర్‌, ఫ్రెర్టిలిటీ ట్రాకింగ్, కారు క్రాష్‌ డిటెక్షన్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని