Passwords: పాస్‌వర్డ్‌కు ప్రత్యామ్నాయంగా దిగ్గజ కంపెనీల కొత్త సాంకేతికత

ఆన్‌లైన్‌ డేటా భద్రత ఉపయోగించే పాస్‌వర్డ్‌కు ప్రత్యామ్నాయంగా యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నాయి. 

Published : 10 May 2022 02:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటా భద్రత కోసం ప్రతి ఒక్కరికి పాస్‌వర్డ్‌ తప్పనిసరి. అయితే స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ ఉన్నప్పటికీ మనలో కొంతమంది సైబర్‌ దాడులకు గురవుతూనే ఉంటాం. అందుకే గూగుల్, మైక్రోసాఫ్ట్‌, యాపిల్ కంపెనీలు పాస్‌వర్డ్‌ ఫీచర్‌కు స్వస్తి పలకాలని నిర్ణయించాయి. ఇందుకోసం మూడు దిగ్గజ కంపెనీలు చేతులు కలిపాయి. భవిష్యత్తులో యూజర్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌గా పనిచేసేలా మల్టీ-డివైజ్‌ ఫిడో క్రెడెన్షియల్స్ (Multi-Device FIDO Credential) పేరుతో సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నాయి.

ఇందుకోసం యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఫిడో అలియన్స్‌తో కలిసి పనిచేయనున్నాయి. ఫిడో అలయన్స్‌ అనేది పాస్‌వర్డ్‌కు ప్రత్యామ్నాయంగా యూజర్‌ అథెంటికేషన్‌ సేవలను అందించే సులువైన, సురక్షితమైన ఓపెన్‌ సోర్స్‌ అసోసియేషన్‌. ‘‘ప్రస్తుత డిజిటల్ యుగంలో వెబ్‌కు పాస్‌వర్డ్ అనేది అతి పెద్ద భద్రతపరమైన లోపం. అంతేకాకుండా వేర్వేరు ఖాతాలకు పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేసుకుని వాటిని గుర్తుపెట్టుకోవడం యూజర్లకు కష్టతరమైన పని. దీని వల్ల సులువుగా గుర్తుంచుకునేందుకు యూజర్లు ఒకే పాస్‌వర్డ్‌ను వేర్వేరు ఖాతాలకు ఉపయోగిస్తుంటారు. దీంతో హ్యాకర్స్‌ సులువుగా యూజర్‌ డేటాను దొంగలించగలుగుతారు. కొత్తగా తీసుకొస్తున్న సాంకేతికతతో యూజర్లు ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ రికగ్నిషన్‌, డివైజ్‌ పిన్‌ వంటి వాటి ద్వారా ఎన్నిసార్లయినా తమ ఖాతాలలో లాగిన్ కావచ్చు. మల్టీ-ఫ్యాక్టర్‌ సాంకేతికత, వన్‌-టైమ్‌ పాస్‌కోడ్‌ ఎస్సెమ్మెస్‌లతో పోలిస్తే ఇది ఎంతో సురక్షితమైనది’’ అని ఫిడో అలయన్స్‌ తెలిపింది.

ఈ సాంకేతికత బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తూ.. డివైజ్‌ ఫిజికల్‌ ప్రాక్సిమిటీ అంచనా వేస్తూ ఇతరులెవరూ ఖాతాలను హ్యాక్‌ చేయకుండా అడ్డుకుంటుందని ఫిడో అలయన్స్ వెల్లడించింది. పాస్‌వర్డ్‌కు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త సాంకేతికత యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని