iPhone 14: ఐఫోన్‌ 14లో 48 ఎంపీ కెమెరా.. సెల్ఫీ కెమెరాకు కొత్త డిజైన్‌!

యాపిల్‌ కంపెనీ త్వరలో విడుదల చేయనున్న ఐఫోన్‌ 14లో 48 ఎంపీ కెమెరా ఇవ్వనుంది. దీంతో హై-రిజల్యూషన్‌ వీడియోలను రికార్డు చేయొచ్చు. 

Updated : 12 Aug 2022 15:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐఫోన్ సిరీస్‌లో ఏటా కొత్త మోడల్‌ను తీసుకొస్తున్న యాపిల్‌..ఈ ఏడాది కూడా ఐఫోన్‌ 14ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఐఫోన్‌ 14కు సంబంధించిన వివరాలు లీకయ్యాయి. తాజాగా యాపిల్‌ టిప్‌స్టర్‌ మింగ్ చి కూ ఐఫోన్‌ 14కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్‌లో వెనుకవైపు ప్రధాన కెమెరా 48 ఎంపీ ఉంటుందని, దీని డయాగ్నల్‌ లెంగ్త్‌ను 25 నుంచి 35 శాతం పెంచినట్లు తెలిపారు. అలానే 7పీ లెన్స్‌ పొడవు కూడా 5 నుంచి 10 శాతం పెంచారట. దీంతోపాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇవ్వనున్నారని తెలుస్తోంది. వీటితో 8K హై-రిజల్యూషన్‌ వీడియోలు రికార్డు చేయొచ్చు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్‌ 13 సిరీస్‌లో 4K వీడియోలను మాత్రమే రికార్డు అవుతాయి. అలానే సెల్ఫీ కెమెరా కోసం నాచ్ స్టైల్‌కు బదులుగా పంచ్‌ హోల్‌ డిజైన్‌ ఉంటుందని సమాచారం. ఐఫోన్ 14లో సిమ్‌కార్డ్‌ బదులు ఈ-సిమ్‌ ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు. అయితే డ్యూయల్ సిమ్‌ ఆప్షన్‌ ఇస్తారా..లేదా అనే దానిపై స్పష్టతలేదు. ఐఫోన్ 14లో 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో ప్రో మోషన్‌ నాచ్‌లెస్‌ డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది.

ఐఫోన్ 13 తరహాలోనే ఐఫోన్ 14లో కూడా శాటిలైట్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ ఫీచర్‌ ఇస్తున్నారట. ఈ ఫోన్లలో 5ఎన్‌ఎమ్‌ ఏ 16 బయోనిక్‌ చిప్‌ ఉపయోగించారని సమాచారం. ఐఫోన్ 14, ఐఫోన్‌ 14 ప్రో మోడల్స్‌లో 6.1 అంగుళాల డిస్‌ప్లే, మాక్స్‌, ప్రో మాక్స్ మోడల్స్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారట. 2022 సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 14 సిరీస్‌ను విడుదల చేయాలని యాపిల్‌ భావిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని