iPhone SE 4: ఎస్‌ఈ సిరీస్‌లో యాపిల్ కొత్త ఫోన్‌.. ఫీచర్లివేనా!

యాపిల్ ఎస్‌ఈ సిరీస్‌లో నాలుగో జనరేషన్‌ మోడల్‌ను విడుదల చేయనుంది. మరి ఐఫోన్ ఎస్‌ఈ 4లో ఎలాంటి పీచర్లు ఇస్తున్నారో చూద్దాం...

Published : 04 Sep 2022 11:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖరీదైన ఐఫోన్‌ను సామ్యానులకు కూడా చేరువ చేసింది ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌. ఇప్పటివరకు ఎస్‌ఈ సిరీస్‌లో మూడు జనరేషన్ల మోడల్స్‌ వచ్చాయి. కొత్తగా నాలుగో జనరేషన్‌ ఐఫోన్ ఎస్‌ఈ 4ను తీసుకురానుంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను యాపిల్ టిప్‌స్టర్‌ జాన్‌ ప్రొస్సెర్‌ వెల్లడించారు. ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ మోడల్‌ ఆధారంగా ఐఫోన్ ఎస్‌ఈ 4ను తయారుచేస్తున్నారట. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ ఎస్‌ఈ3 కూడా ఐఫోన్‌ 8 మోడల్‌ స్ఫూర్తితో రూపుదిద్దుకుందే. మరి, ఐఫోన్ ఎస్‌ఈ 4లో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారో చూద్దాం.

ఇందులో 6.1 అంగుళాల ఎడ్జ్‌-టు-ఎడ్జ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఇప్పటివరకు విడుదలైన ఎస్‌ఈ మోడల్స్‌తో పోలిస్తే ఈ ఫోన్‌ డిస్‌ప్లే పెద్దది. ఫేస్‌ఐడీ, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ ఫీచర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఐపీ67 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్ రేటింగ్‌తోపాటు, వైర్‌లైస్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఇస్తున్నారట. ఈ ఫోన్‌లో ఏ17 బయోనిక్‌ చిప్‌ను ఉపయోగించనున్నారు. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌లో మాదిరే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఫోన్ వెనుకవైపు 12 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు, ముందుభాగంలో 7 ఎంపీ కెమెరా ఇస్తున్నట్లు సమాచారం. 64 జీబీ, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లో తీసుకొస్తారట.

ఐఫోన్ ఎస్‌ఈ 4 ధర ₹ 30 వేల నుంచి ₹ 40 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇప్పటివరకు విడుదలైన ఐఫోన్ ఎస్‌ఈ మోడల్స్‌ పాత ఐఫోన్‌ మోడల్స్‌ ఆధారంగా రూపుదిద్దుకున్నవే కావడం గమనార్హం. 2013లో విడుదలైన తొలితరం ఎస్‌ఈ మోడల్ ఐఫోన్‌ 5ఎస్‌, రెండో జనరేషన్‌ ఎస్‌ఈ మోడల్‌ ఐఫోన్ 6ఎస్‌, ఈ ఏడాది విడుదలైన మూడో జనరేషన్ మోడల్‌ ఐఫోన్ 8, రాబోతున్న నాలుగో జనరేషన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ఆధారంగా డిజైన్‌ చేస్తున్నారని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని