Apple WWDC 2022: ఐప్యాడ్‌నే ల్యాప్‌టాప్‌గా.. కుదిరితే మొబైల్‌గానూ వాడుకోవచ్చు..!

టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఓఎస్‌ అప్‌డేట్‌ను విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఐప్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌లోనూ సరికొత్త ఫీచర్లను పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది...

Published : 05 Jun 2022 17:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ దిగ్గజం యాపిల్‌ కొత్త ఐఓఎస్‌ అప్‌డేట్‌ను విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఐఫోన్‌, మ్యాక్‌తోపాటు ఐప్యాడ్‌ ఓఎస్‌లోనూ సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. యాపిల్‌ కొత్తగా తీసుకొస్తున్న ఐప్యాడ్‌ ఓఎస్‌16 ఫీచర్లతో ఐప్యాడ్‌ను ల్యాప్‌టాప్‌లా మార్చుకోవడంతోపాటు, ఒకేసారి వేర్వేరు యాప్‌లను ఉపయోగించవచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అలానే ఐప్యాడ్‌ను స్మార్ట్‌ మొబైల్‌గా కూడా వినియోగించుకోవచ్చని సమాచారం. జూన్‌ 6న జరిగే వరల్డ్‌వైడ్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ 2022 (WWDC 2022)లో దీనిపై యాపిల్‌ ప్రకటన చేస్తుందని తెలుస్తోంది. 

మహిళల కోసం..

ఐఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌, టీవీల కోసం కూడా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను డబ్ల్యూడబ్ల్యూడీసీ 2022 కార్యక్రమంలో యాపిల్‌ ప్రకటించనుంది. ఐఫోన్‌లో తీసువచ్చే ఐఓఎస్‌16 అప్‌డేటెడ్‌తో.. స్లిప్‌ ట్రాక్‌ ఫంక్షనాలిటీ, మెడిసిన్‌ మెనేజ్‌మెంట్‌ టూల్స్‌ను యాపిల్‌ అందుబాటులోకి తేనుందని సమాచారం. ఇందులో మహిళల కోసం ప్రత్యేకంగా హెల్త్‌ ఫీచర్లను పరిచయం చేస్తుందట. అలాగే స్మార్ట్‌వాచ్‌ల పనితీరు మెరుగుపరచడానికి వాచ్‌ఓఎస్‌ 9ను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

‘మ్యాక్‌’లో కొత్తగా ఐదు!

వీటితోపాటు మ్యాక్‌ సిస్టమ్‌ యూజర్లకు కూడా యాపిల్‌ కొత్త ఓఎస్‌ను తీసుకురానుంది. ఇందులో ఐదు కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. వీటిలో విడ్జెట్స్‌ ఎనీవేర్‌, వెథర్‌ యాప్‌, యాప్‌ లైబ్రరీ, టైమ్‌ మిషన్‌ అండ్‌ ఐక్లౌడ్‌ బ్యాకప్స్‌, టీవీ ఓఎస్‌ స్క్రీన్‌ సేవర్స్‌ ఫర్‌ మ్యాక్‌ వంటి ఫీచర్లను అందుబాటులోకి తేనుందట. అయితే, ఏయే డివైజ్‌లకు ఈ కొత్త ఓఎస్‌ వెర్షన్లు సపోర్ట్ చేస్తాయనేది తెలియాల్సి ఉంది. 

‘సిరి’కి అర్థమయ్యేలా..

యాపిల్‌ టీవీ, హోంప్యాడ్‌ల కోసం కూడా టీవీఓఎస్‌ 16 పేరుతో యాపిల్‌ కొత్త ఓఎస్‌ను పరిచయం చేయనుందట. యాపిల్‌ టీవీ 4కే ఫస్ట్‌ జనరేషన్‌, సెకండ్‌ జనరేషన్‌తో పాటు యాపిల్‌ టీవీ ఫుల్‌ హెచ్‌డీ ఫోర్త్‌ జనరేషన్‌, హోంప్యాడ్‌ మినీ (2020), హోంప్యాడ్ (2018) మోడల్స్‌ను ఈ కొత్త ఓఎస్‌ సపోర్ట్ చేస్తుందని సమాచారం. అలానే ఈ అప్‌డేట్‌లో యూజర్లు చెప్పేది  ‘సిరి’కి సులభంగా అర్థం అయ్యేలా మరిన్ని భాషలను యాడ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని