iOS 16: ఐఓఎస్‌ 16 ఫీచర్లేంటి? ఎప్పుడొస్తుంది? ఎలా ఉంటుంది?

యాపిల్‌ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఓఎస్‌ 16 ఓఎస్‌ సెప్టెంబరు 12న విడుదల కానుంది. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో రాబోతున్న ఈ ఓఎస్‌ను ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలో చూద్దాం..

Updated : 12 Sep 2022 14:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ (apple) యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఓఎస్‌ 16 ఓఎస్‌ (iOS) ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 12న విడుదల కానుంది. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో రాబోతున్న ఈ ఓఎస్‌లో ఎలాంటి ఫీచర్లుంటాయి? భారత్‌ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఏయే ఐఫోన్ మోడల్స్‌కు ఈ ఓఎస్‌ సపోర్ట్ చేస్తుంది? ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలో చూద్దాం...

  1. యాపిల్‌ వరల్డ్‌వైడ్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ 2022 (WWDC 2022)లో ప్రకటించినట్లుగానే ఐఓఎస్‌ 16ను సెప్టెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుంది. ముందుగా యూఎస్‌ యూజర్లకు అప్‌డేట్‌ అవుతుంది. భారత్‌ యూజర్లుకు మాత్రం 12 తేదీ రాత్రికి లేదా 13 తేదీ ఉదయానికి అందుబాటులోకి వస్తుందని సమాచారం. 
  2. యాపిల్‌ కొత్త ఓఎస్‌ను ఐఫోన్‌ 8 సిరీస్‌ నుంచి ఆపై సిరీస్‌ మోడల్స్‌ సపోర్ట్‌ చేస్తాయి. అంటే, ఐఫోన్‌ 8‌, ఐఫోన్‌ ఎక్స్‌‌, ఐఫోన్‌ 11‌, ఐఫోన్ 12, ఐఫోన్ 13 సిరీస్‌లతోపాటు కొత్తగా విడుదలైన ఐఫోన్‌ 14 మోడల్స్‌లో పనిచేస్తుంది. ఎస్‌ఈ సిరీస్‌లో ఐఫోన్‌ ఎస్‌ఈ 2 (2020), ఐఫోన్‌ ఎస్‌ఈ 3 (2022) మోడల్స్‌లో కూడా ఐఓఎస్‌ 16 అప్‌డేట్ అవుతుంది. 
  3. ఐఫోన్ యూజర్లు ఓఎస్‌ అప్‌డేట్‌ గురించి యాపిల్ నోటిఫికేషన్‌ పంపుతుంది. యూజర్లు  ఓఎస్‌ అప్‌డేట్‌ గురించి తెలుసుకోవాలంటే ఫోన్‌ సెట్టింగ్స్‌ ఓపెన్ చేసి జనరల్‌ సెక్షన్‌లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌పై క్లిక్ చేస్తే ఓఎస్‌ డౌన్‌లోడ్‌ అండ్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఒకవేళ కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ రాకుంటే పాత ఓఎస్‌ వెర్షన్‌నే చూపిస్తుంది. 
  4. ఐఓఎస్‌ 16లో లాక్‌స్క్రీన్‌ కస్టమైజేషన్‌ ఆప్షన్‌ ఇస్తున్నారు. యూజర్లు తమకు నచ్చిన ఫొటోను లాక్‌స్క్రీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌గా సెట్ చేసుకోవచ్చు. లాక్‌స్క్రీన్‌పై ఉండే  క్లాక్‌, ఫాంట్‌, రంగులను తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు. యూజర్‌ ముఖ్యమైన లేదా తరచుగా ఉపయోగించే  నాలుగు విడ్జెట్స్‌ను కూడా సులువుగా యాక్సెస్‌ చేసేందుకు వీలుగా లాక్‌స్క్రీన్‌పై కనిపించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. 
  5. ఫోన్‌ లాక్‌ వేసినా.. యూజర్లు నోటిఫికేషన్లు సులువుగా చూడొచ్చు. ఇందులో ఎక్స్‌పాండ్‌ లిస్ట్‌ వ్యూ, స్టాక్డ్‌ వ్యూ, హిడెన్‌ వ్యూ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో యూజర్‌ తనకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకుని నోటిఫికేషన్లు చూడొచ్చు. ఫోన్‌ లాక్ పడినప్పుడు నోటిఫికేషన్లు డిస్‌ప్లే కింది భాగంలో  కనిపిస్తాయి. 
  6. లైవ్‌ యాక్టివిటీ ఫీచర్‌తో లాక్‌స్క్రీన్‌లో కూడా యూజర్‌ ఆన్‌లైన్‌ ఆర్డర్‌ స్టేటస్‌ తెలుసుకోవచ్చు. ఇందుకోసం వాలెట్‌ యాప్‌లో బిల్ట్‌-ఇన్‌ ఆర్డర్‌ ట్రాకింగ్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నారు. ఇందులో ప్యాకెజీ డెలివరీకి సిద్ధమయిందా? ఏ తేదీన డెలివరీ అవుతుంది? వంటి వివరాలను అంచనా వేసి యూజర్‌కు తెలియజేస్తుంది. 
  7. సైబర్‌ దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ఐఓఎస్‌ 16లో లాక్‌డౌన్‌ మోడ్‌ తీసుకొస్తున్నారు. యూజర్‌ ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసినప్పటి నుంచి ఫోన్‌ మెసేజింగ్‌, వెబ్‌ బ్రౌజింగ్‌తోపాటు ఇతర సేవల ద్వారా జరిగే సైబర్‌ దాడుల నుంచి పూర్తి రక్షణ ఉంటుందని యాపిల్ తెలిపింది. 
  8. ఫొటో ఎడిటింగ్‌కు సంబంధించి మరో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్‌ ఈ ఓఎస్‌లో యూజర్లకు అందుబాటులోకి రానుంది. యూజర్లు ఏదైనా స్క్రీన్‌షాట్‌, క్విక్‌ లుక్‌, సఫారీ బ్రౌజర్‌, గ్యాలరీలలో ఎక్కడి నుంచైనా ఫొటోను తీసుకుని దాని బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చుకోవచ్చు. వీడియోలలో ఫ్రేమ్‌ పాజ్‌ చేసి, దానిపై ఉన్న టెక్ట్స్‌ను కాపీ, ట్రాన్స్‌లేట్, లుక్‌అప్‌, షేర్‌ చేసుకునే వీలుంది. 
  9. ఐమెసేజ్‌లో పంపిన మెసేజ్‌లను ఎడిట్‌, అన్‌సెండ్ చేసుకోవచ్చు. మెసేజ్ పంపిన 15 నిమిషాల లోపు ఎడిట్‌, అన్‌సెండ్‌ చేసుకునే ఫీచర్‌ ఐఓఎస్‌ 16లో యూజర్లకు అందుబాటులోకి రానుంది. మెసేజ్‌ పంపిన తర్వాత దానిపై టాప్‌ చేస్తే ఎడిట్‌, అన్‌డూ సెండ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. 
  10. ఆండ్రాయిడ్‌లో డు నాట్ డిస్ట్రబ్‌ ఫీచర్‌ తరహాలోనే ఐఫోన్‌ 16లో ఫోకస్‌ మోడ్‌ ఇస్తున్నారు. ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత, యూజర్లు ఎంపిక చేసిన యాప్‌ నోటిఫికేషన్లు, కాంటాక్ట్స్‌ లిస్ట్‌ నుంచి వచ్చే కాల్స్‌, మెసేజ్‌ నోటిఫికేషన్లు సైలెంట్‌గా డెలివరీ అవుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని