Smartphone Battery: ఫోన్‌ బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలా..? యాపిల్ కంపెనీ టిప్స్‌ ఇవే!

ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్‌ ఎక్కువ సేపు ఉండేందుకు యాపిల్ కంపెనీ కొన్ని సూచనలు చేసింది. కేవలం ఐఫోన్లకు మాత్రమే కాకుండా ఇతర డివైజ్‌లకు ఇవి వర్తిస్తాయి. ఇంతరీ యాపిల్ చెప్పిన టిప్స్‌ ఏంటో ఓసారి చూద్దాం.

Updated : 17 Feb 2022 13:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాలం మారింది.. అవసరాల కోసం క్యూలైన్లో నిలబడే రోజుల నుంచి కావాల్సిన వస్తువుని కూర్చున్న చోటుకే తెప్పించుకోగలుగుతున్నాం. చేతిలో మొబైల్‌ ఉంటే చాలు..సమస్తం మన ముందున్నట్లే. బాతాఖానీ నుంచి చిట్‌చాట్, వీడియో కాలింగ్, గేమింగ్, ఆన్‌లైన్‌ షాపింగ్, ఆఫీస్‌ మీటింగ్ అంటూ రోజంతా స్మార్ట్‌ఫోన్ బిజీగా ఉంటుంది. మరి అంత బిజీగా ఉండే ఫోన్‌ బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉంటేనే ఇవన్నీ చేయగలం. బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్‌ పెట్టుకుంటూ, బ్యాటరీ బ్యాకప్‌లను వెంటపెట్టుకోని వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచుకునేందుకు యాపిల్‌ కంపెనీ కొన్ని సూచనలు చేస్తుంది. అయితే ఇది కేవలం ఐఫోన్లకు మాత్రమే కాదు.. ఇతర కంపెనీల ఫోన్లకు వర్తిస్తుంది. ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండేందుకు యాపిల్ కంపెనీ చేసిన సూచనలపై ఓ లుక్కేద్దామా మరి! 


వాటికి దూరంగా ఉంచాలి

బ్యాటరీ ఛార్జింగ్‌ ఎక్కువసేపు ఉండేందుకు యాపిల్ చేసే మొదటి సూచన, మీ ఫోన్‌ను వేడి వస్తువులు, అధిక ఉష్ణోగ్రతలకు దూరంగా ఉంచడం. సాధారణంగా 16 డిగ్రీల సెల్సియస్‌ నంచి 22 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు డివైజ్‌ పనితీరుకు అనుకూలమైనవి చెబుతోంది. అందుకే 35 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉంచమని సూచిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా బ్యాటరీ సామర్థ్యం దెబ్బతిని, ఛార్జింగ్ ఎక్కువ కాలం ఉండదని యాపిల్ చెబుతోంది. 

అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీ ఛార్జ్‌ చేయడం వల్ల డివైజ్‌ దెబ్బతినే ప్రమాదం ఉంటుందట. ఉదాహరణకు కంపెనీ సూచించిన దాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఛార్జ్‌ చేస్తున్నారనుకుంటే, డివైజ్‌ సాఫ్ట్‌వేర్‌ దాన్ని 80 శాతం ఛార్జింగ్ వద్ద అడ్డుకుని, కంపెనీ సూచించిన ఉష్ణోగ్రతకు పరిమితం చేస్తుంది. అలానే చల్లని ప్రదేశాల్లో ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందట. అయితే ఇది కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంటుందని, బ్యాటరీ ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే ఎప్పటిలానే పనిచేస్తుందని యాపిల్ కంపెనీ పేర్కొంది.


ఛార్జింగ్ చేసేప్పుడు వద్దు

ఫోన్‌ ఆకర్షణీయంగా కనిపించడం కోసమో, ఫోన్‌కు రక్షణ ఉంటుందనే కారణంతో ఎక్కువ మంది వేర్వేరు ఫోన్‌ కేస్‌లను ఉపయోగిస్తుంటారు. ఫోన్‌ను పౌచ్‌ లేదా కేస్‌లో ఉంచి ఛార్జింగ్ చేయడం వల్ల ఎక్కువ వేడి ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదని, దానివల్ల బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుదని యాపిల్ చెబుతోంది. అందుకే ఫోన్ లేదా స్మార్ట్‌ వాచ్‌ ఛార్జ్‌ చేసేప్పుడు వాటిని సంబంధిత పౌచ్‌ లేదా కేస్‌ల నుంచి బయటకుతీసి ఛార్జింగ్ చేయడం ఉత్తమం. 


ఎక్కువ కాలం పక్కకు పెడుతున్నారా!

ఒకవేళ ఫోన్‌/స్మార్ట్‌వాచ్‌ లేదా ఇతర డివైజ్‌లను ఉపయోగించకుండా ఎక్కువ కాలం ఉంచాలనుకుంటే వాటి పనితీరు, బ్యాటరీ రెండు రకాల పరిస్థితులు ప్రభావితం చేస్తాయట. వాటిలో మొదటిది డివైజ్‌ ఉంచే పరిసరాల ఉష్ణోగ్రతలు, రెండోది డివైజ్‌ బ్యాటరీ శాతం. ఇందుకు యాపిల్ కొన్ని సూచనలు చేస్తోంది. 

📱 మీరు ఉపయోగించకుండా పక్కకు పెట్టాలనుకంటున్న డివైజ్‌ను ఫుల్ ఛార్జ్‌ లేదా జీరో ఛార్జ్‌ చేయకూడదు. ఆరునెలలకు మించి ఎక్కువ రోజులు డివైజ్‌ను ఉపయోగించకుండా పక్కకు ఉంచేట్లయితే 50 శాతం ఛార్జింగ్‌తో స్టోర్ చేయడం ఉత్తమం. 

📱 ఒకవేళ డివైజ్‌ బ్యాటరీ జీరో చేస్తే బ్యాటరీ పూర్తిగా డీప్ డిస్‌ఛార్జ్‌ స్టేట్‌లోకి వెళిపోతుందట. దానివల్ల తిరిగి బ్యాటరీ ఛార్జ్‌ కాకపోవచ్చు. అలానే ఫుల్‌ ఛార్జ్‌తో స్టోర్‌ చేస్తే ఎక్కువ కాలం ఉపయోగించకపోవడం వల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. 

📱 చాలా కాలం తర్వాత  డివైజ్‌ను తిరిగి ఉపయోగించాలనుకంటే ఒరిజినల్‌ అడాప్టర్‌తో కనీసం బ్యాటరీని 20 నిమిషాలు ఛార్జ్‌ చేయమని యాపిల్ సూచిస్తుంది. 

📱 ఈ సూచనలు పాటించడం వల్ల బ్యాటరీ సామర్థ్యం మెరుగవడంతోపాటు బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంటుందని యాపిల్‌ చెబుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని