Updated : 22 Jul 2022 10:47 IST

iOS 16: ఏడు ఫీచర్లతో యాపిల్‌ కొత్త ఓఎస్‌.. విడుదల ఎప్పుడంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్ కంపెనీ సెప్టెంబరులో ఐఓఎస్‌ 16ను విడుదల చేయనుంది. తాజాగా ఐఓఎస్‌ 16 బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఎప్పటిలానే గత ఓఎస్‌లకు భిన్నంగా కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా యూజర్‌ తనకు నచ్చినట్లుగా స్క్రీన్‌, విడ్జెట్స్‌, నోటిఫికేషన్‌ బార్‌ సెక్షన్స్‌లో ఆండ్రాయిడ్ తరహాలో కస్టమైజబుల్ ఫీచర్స్‌ను పరిచయం చేయనుంది. మరింకెందుకు ఆలస్యం ఐఓఎస్‌ 16లో యూజర్లకు కొత్తగా అందుబాటులోకి రాబోతున్న ఏడు ఫీచర్లపై ఓ లుక్కేద్దాం...


లాక్‌స్క్రీన్‌ కస్టమైజేషన్‌ 

ఎట్టకేలకు యాపిల్ యూజర్లు తమకు నచ్చిన రంగులోకి లాక్‌స్క్రీన్‌ను మార్చుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. లాక్‌స్క్రీన్‌ కస్టమైజేషన్‌లో భాగంగా యాపిల్ ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. యూజర్స్‌ లాక్‌స్క్రీన్‌ మీద క్లాక్‌ను వివిధ ఫాంట్‌లు, రంగులు ఉపయోగించి తమకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. దాంతోపాటు లాక్‌స్క్రీన్‌లో నాలుగు విడ్జెట్స్‌ పెట్టుకోవచ్చు. వాటిలో క్లాక్ పైన ఒకటి, కింద మూడు పెట్టుకోవచ్చు. వీటిలో బ్యాటరీ స్టేటస్‌, క్యాలెండర్‌ క్లాక్‌, ఫిట్‌నెస్‌ స్టేటస్‌, వార్తలు, వాతావరణం, స్టాక్స్‌కు సంబంధించిన సమాచారం అందించే వాటిని ఉంచవచ్చు. లాక్‌స్క్రీన్‌కు సంబంధించి ఐఓఎస్‌ 16లో మరో కొత్త ఫీచర్‌ రానుంది. దీంతో ఐఫోన్‌ యూజర్లు ఆండ్రాయిడ్ తరహాలో హోం స్క్రీన్‌, లాక్‌స్క్రీన్‌కు వేర్వేరు వాల్‌పేపర్లు పెట్టుకోవచ్చు.


ఐమెసేజ్‌ ఎడిట్

ఐఓఎస్‌ 16లో యూజర్లు ఐమెసేజ్‌లో పంపిన మెసేజ్‌లను ఎడిట్‌, అన్‌సెండ్ చేసుకోవచ్చు. మెసేజ్ పంపిన తర్వాత 15 నిమిషాల లోపు మెసేజ్‌లో మార్పులు చేయడంతోపాటు, దాన్ని అన్‌సెండ్‌ చేసుకునే ఫీచర్‌ ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. మెసేజ్‌ పంపిన తర్వాత దానిపై టాప్‌ చేస్తే ఎడిట్‌, అన్‌డూ సెండ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. ఐఓఎస్‌ 15లో ఒకసారి పంపిన మెసేజ్‌లో మార్పులు చేస్తే అవతలి వారికి ఎడిటెడ్‌ టూ అని కనిపిస్తుంది. ఐఓఎస్‌ 16లో మెసేజ్‌ ఎడిట్ చేసినట్లు అవతలి వారికి తెలియదు.


ఫుల్ స్క్రీన్‌ మ్యూజిక్ ప్లేయర్

ఐఓఎస్‌ 16లో మ్యూజిక్ ప్లేయర్‌ ఆన్‌ చేసిన వెంటనే ఫోన్‌ లాక్‌ పడినా, ఫుల్‌ స్క్రీన్‌లో మ్యూజిక్ ప్లేయర్ కనిపిస్తుంది. దానికి తగినట్లుగా లాక్‌ స్క్రీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ కలర్‌ కూడా మారుతుంది. ఒకవేళ యూజర్‌ ఫుల్‌ స్క్రీన్‌లో ప్లేయర్ వద్దనుకుంటే డిస్‌ప్లే కింది భాగంలో టచ్‌ చేస్తే మినిమైజ్‌ అయిపోతుంది. గతంలో ఐఓఎస్‌ 10లో కూడా ఫుల్‌ స్క్రీన్‌ మ్యూజిక్ ప్లేయర్‌ను తీసుకొచ్చారు. అందులో బ్యాక్‌గ్రౌండ్‌ కలర్స్ మాత్రం మారేవి కావు. మినిమైజ్ ఆప్షన్‌ కూడా లేదు.


ఐక్లౌడ్ ఫొటో లైబ్రరీ

ఐఓఎస్‌ 16లో యూజర్లకు ఉపయోగపడే ముఖ్యమైన ఫీచర్లలో ఇది ఒకటి. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు ఫొటోస్ యాప్‌లో తనతో పాటు మరో ఐదుగురితో కలిసి ఐక్లౌడ్‌లోని ఫొటోలను షేర్, ఎడిట్‌, డిలీట్‌ చేసుకునేందుకు యాడ్‌ చేసుకోవచ్చు. దీంతో స్నేహితులు, కుటుంబసభ్యులతో ఫొటో షేరింగ్ మరింత సులభతరం కానుంది. 


గేమింగ్ కోసం

గేమింగ్ ప్రియుల కోసం యాపిల్ కంపెనీ ఐఓఎస్‌ 16లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీంతో మరిన్ని బ్లూటూత్ గేమింగ్ కంట్రోల్స్‌ యూజర్లు ఉపయోగించవచ్చు. వీటిలో నిన్‌టెండో జాయ్-కాన్స్‌ అండ్‌ ప్రో కంట్రోలర్‌ ఉన్నాయి. 


యాపిల్ పే ఆర్డర్‌ ట్రాకింగ్‌ 

వాలెట్‌ యాప్‌లో యాపిల్ పే ద్వారా ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేస్తే దాని స్టేటస్‌ తెలుసుకునేందుకు వీలుగా ఐఓఎస్‌ 16లో బిల్ట్‌-ఇన్‌ ఆర్డర్‌ ట్రాకింగ్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నారు. ఇందులో ప్యాకెజీ డెలివరీకి సిద్ధమయిందా? ఏ తేదీన డెలివరీ అవుతుంది? వంటి వివరాలను అంచనా వేసి యూజర్‌కు తెలియజేస్తుంది. 


ఫిట్‌నెస్‌ ప్రియులకో ఫీచర్‌

ఐఓఎస్‌ 16 ఓఎస్‌తో ఫిట్‌నెస్‌ యాప్‌ను అన్ని ఐఫోన్ మోడల్స్‌ యూజర్లకు పరిచయం చేస్తున్నారు. గతంలో యాపిల్‌ వాచ్‌ ఉపయోగించే యూజర్లకు మాత్రమే ఈ యాప్‌ అందుబాటులో ఉండేది. ఇందులో యూజర్‌ రోజువారీ యాక్టివిటీ రింగ్ ఉంటుంది. ఐఫోన్‌లోని మోషన్‌ సెన్సర్‌ ఆధారంగా రోజులో యూజర్‌ ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశారనే సమాచారం యాప్‌లో స్టోర్‌ చేస్తుంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని