Apple iOS 15: ఐఫోన్‌ బ్యాటరీ త్వరగా అయిపోతోందా..? అయితే ఐఓఎస్‌ అప్‌డేట్‌ చేయాల్సిందే!

యాపిల్ కంపెనీ ఐఓఎస్‌ 15.4.1 పేరుతో కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఐఫోన్‌, ఐపాడ్ యూజర్లు తప్పనిసరిగా ఈ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని యాపిల్ సూచించింది. 

Published : 02 Apr 2022 01:59 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్‌ కంపెనీ గతేడాది సెప్టెంబరులో విడుదల చేసిన ఐఓఎస్‌ 15తో యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఆ తర్వాత గత నెలలో ఐఓఎస్‌ 15కు అప్‌డేట్‌గా ఐఓఎస్‌ 15.4 వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఇందులో నోట్స్‌ యాప్‌లో స్కాన్‌ టెక్ట్స్‌, ట్యాప్‌ టు పే, కొత్త ఎమోజీలు, యూనివర్సల్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లతోపాటు ఫేస్‌ మాస్క్‌ ధరించినా ఫోన్‌ అన్‌లాక్‌ అయ్యేలా ఫేస్‌ఐడీ అండ్‌ పాస్‌కోడ్ సెక్షన్‌లో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. 

అయితే ఐఓఎస్‌ 15.4 వెర్షన్‌ను అప్‌డేట్ చేసినప్పటి నుంచి ఐఫోన్‌, ఐపాడ్‌లలో బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటంలేదని ఎక్కువ మంది యూజర్స్‌ యాపిల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో యాపిల్ కంపెనీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ సమస్యకు పరిష్కారంగా ఐఓఎస్‌ 15.4.1 వెర్షన్‌ను విడుదల చేసింది. గత నెలలో విడుదల చేసిన ఐఓఎస్‌ 15.4 వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకున్న యూజర్లు తప్పనిసరిగా ఐఓఎస్‌ 15.4.1 వెర్షన్‌ను కూడా అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఇందులో బ్యాటరీ సమస్యకు చెక్‌ పెట్టడంతోపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను విడుదల చేసినట్లు యాపిల్ పేర్కొంది. 

* ఈ అప్‌డేట్ కోసం ఐఫోన్ సెట్టింట్స్‌లోకి వెళ్లి జనరల్ సెక్షన్‌ ఓపెన్ చేయాలి. అందులో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 

* దానిపై క్లిక్‌ చేస్తే ఓఎస్‌ అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోమని సూచిస్తుంది. తర్వాత డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసి పాస్‌కోడ్ ఎంటర్‌ చేసి, ఐఓఎస్‌ 15.4.1 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేస్తే మీ ఐఫోన్, ఐపాడ్ బ్యాటరీ సమస్యకు చెక్ చెప్పినట్లే. 

ఐఓఎస్‌ 15.4 అప్‌డేట్‌ తర్వాత కొన్ని రకాల హియరింగ్‌ డివైజ్‌లు థర్డ్‌పార్టీ యాప్స్‌ సరిగా స్పందించడంలేదనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యకు ఐఓఎస్‌ 15.4.1లో పరిష్కారం చూపారు. అలానే యాపిల్ ఏవీడీ మీడియా డీకోడర్‌ ద్వారా హ్యాకర్స్‌ ఐఫోన్‌ 6ఎస్‌, ఐపాడ్ ప్రో, ఐపాడ్‌ ఎయిర్‌2, ఐపాడ్‌ 5 జనరేషన్‌, ఐపాడ్‌ మినీ 4, ఐపోడ్‌ టచ్‌ 7 జనరేషన్‌ డివైజ్‌లలో వైరస్‌ను పంపి యూజర్ డేటా సేకరించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ సమస్యను కూడా సరిచేస్తూ ఐఓఎస్‌ 15.4.1లో సెక్యూరిటీని అప్‌డేట్‌ చేసినట్లు  పేర్కొంది. యాపిల్‌ కంపెనీ ఈ అప్‌డేట్‌ను ఐఫోన్‌, ఐపాడ్‌తోపాటు టీవీఓఎస్‌ 15.4.1, హోమ్‌పాడ్‌ 15.4.1, వాచ్‌ ఓఎస్‌ 15.4.1 వెర్షన్లలో కూడా విడుదల చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని