Apple: యాపిల్‌లోనూ యాడ్స్‌.. ఆ కంపెనీల బాటలోనే!

యాపిల్‌ కంపెనీ కూడా ఆండ్రాయిడ్ తరహాలో యాప్‌లలో ప్రకటనలను తీసుకురానున్నట్లు సమాచారం. కంపెనీ రెవెన్యూ పెంచడంలో భాగంగా యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో పేర్కొంది... 

Updated : 18 Aug 2022 15:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్ కంపెనీ ఉత్పత్తుల ఖరీదు ఎక్కువైనప్పటికీ, కొనుగోలుకు ఆసక్తికనబరచటానికి ముఖ్యకారణం బ్లాట్‌వేర్‌-ఫ్రీ ఇంటర్‌ఫేస్‌, డిజైన్‌, ఫీచర్లు‌. బ్లాట్‌వేర్‌-ఫ్రీ వల్ల ఫోన్‌లోని యాప్స్‌లో ఎలాంటి ప్రకటనలు రావు. దాంతో యూజర్‌ డేటా సురక్షితంగా ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం యాపిల్‌ కంపెనీ కూడా ఆండ్రాయిడ్ తరహాలో యాప్‌లలో ప్రకటనలను తీసుకురానున్నట్లు సమాచారం. కంపెనీ రెవెన్యూ పెంచడంలో భాగంగా యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో పేర్కొంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను యాపిల్‌ కంపెనీ పరీక్షిస్తోందని, త్వరలోనే ఐఫోన్, ఐపాడ్, మ్యాక్‌ యూజర్లకు పాడ్‌కాస్ట్‌, మ్యాప్స్‌, న్యూస్‌, మ్యూజిక్‌, మెసేజెస్‌తోపాటు ఇతర యాప్‌లలో ప్రకటనలు కనిపిస్తాయని తెలిపింది. థర్డ్‌-పార్ట్‌ యాప్‌ డెవలపర్స్‌ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు యాపిల్ యాప్‌ స్టోర్‌లో యాడ్స్‌ను పోస్ట్ చేయొచ్చు. కొత్తగా తీసుకురానున్న ఫీచర్‌తో యాప్స్‌లో కూడా ప్రకటనలు కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో థర్డ్‌-పార్టీ యాప్‌ డెవలపర్స్‌కు యాప్స్‌లో ప్రకటనలు పోస్ట్‌ చేసుకునే సౌకర్యం ఉంది. ఇన్‌-యాప్‌ యాడ్స్‌ విషయంలో యాపిల్‌ ఎలాంటి నిబంధనలు పాటిస్తుందనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

స్టాండర్డ్‌ యాడ్స్‌కు అనుమతిస్తుందా? లేదా వ్యక్తిగత సమాచారాన్ని విశ్లేషించే టెయిలర్డ్‌ యాడ్స్‌ అనుమతిస్తుందా? అనేది వేచి చూడాలి. మరోవైపు యాపిల్‌ తన యాప్స్‌ ద్వారా యూజర్‌ డేటా సేకరించవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ యాపిల్ డేటా సేకరించేట్లయితే యూజర్లు తమ ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌లో పర్సనలైజ్డ్‌ యాడ్స్‌పై క్లిక్ చేసి యాడ్స్‌ను నియంత్రించవచ్చు.

యాపిల్ థర్డ్‌-పార్టీ యాప్స్‌ నుంచి ఎలాంటి సమాచారాన్ని పొందదు. అలానే యాప్స్‌ కూడా యూజర్ల నుంచి డేటా సేకరించకుండా గతేడాది యాప్‌ ట్రాకింగ్ ట్రాన్సపరెన్సీ (ఏటీటీ)ని పరిచయం చేసింది. యాపిల్‌ తీసుకొచ్చిన ఏటీటీ వల్ల తమ రెవెన్యూ తగ్గిందని ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా పేర్కొనడం గమనార్హం. ఏదైమైనప్పటికీ యాపిల్‌ తాజా నిర్ణయం మెటా, స్నాప్‌ వంటి సంస్థలతోపాటు యాప్‌ డెవలపర్స్‌కు మేలు చేయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని