Apple App Store: 2021లో యాపిల్ అడ్డుకున్న మోసపూరిత లావాదేవీల విలువ ఎంతో తెలుసా?

యాపిల్‌ కంపెనీ 2021లో సుమారు 1.5 బిలియన్‌ డాలర్ల మోసపూరిత లావాదేవీలు జరగకుండా అడ్డకున్నట్లు తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. 

Published : 03 Jun 2022 00:12 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్లకు మెరుగైన సేవలు అందించడంతోపాటు.. వారి డేటాకు భద్రత కల్పించడం టెక్‌ కంపెనీలకు సవాల్‌తో కూడుకున్న అంశం. యూజర్‌ డేటా లక్ష్యంగా జరిగే సైబర్‌ దాడులను ముందుగానే పసిగట్టి వాటిని అడ్డుకునే ప్రయత్నంలో చాలా వరకు టెక్‌ కంపెనీలు సఫలీకృతమవుతున్నాయి. యాపిల్‌ కంపెనీ 2021లో సుమారు 1.5 బిలియన్‌ డాలర్ల మోసపూరిత లావాదేవీలు జరగకుండా అడ్డుకున్నట్లు తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది.

యాప్‌ల ముసుగులో యూజర్ల ఆర్థికపరమైన లావాదేవీల వివరాలతోపాటు, వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న సుమారు 1.6 మిలియన్ల యాప్‌లపై చర్యలు తీసుకున్నట్లు యాపిల్ కంపెనీ వెల్లడించింది. అలానే మోసపూరిత కార్యకలాపాలతో సంబంధమున్న సుమారు 170 మిలియన్ల యూజర్‌ ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. యూజర్ల వ్యక్తిగత గోప్యతకు, డేటా భద్రతకు, మోసపూరిత లావాదేవీలను అడ్డుకునేందుకు, యాప్‌ స్టోర్‌ను అత్యుత్తమ సేవలు అందించే వేదికగా మార్చేందుకు తమ సైబర్‌ నిపుణులు నిరంతరం కృషి చేస్తుంటారని యాపిల్‌ స్పష్టచేసింది.

యాప్‌ రివ్యూ

యాప్‌ స్టోర్‌ నుంచి యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునే యాప్‌లో భద్రతాపరమైన లోపాలను గుర్తించి డెవలపర్స్‌కు నేరుగా తెలియజేసేందుకు మల్టీలేయర్‌ (కంప్యూటర్‌ ఆటోమేషన్‌, మానవ లిఖిత సమీక్ష) రివ్యూ ఇస్తున్నట్లు యాపిల్ వెల్లడించింది. ‘‘యాప్‌ రివ్యూ వల్ల యాప్‌లలోని భద్రతాపరమైన లోపాలు, పనితీరుకు సంబంధించి యూజర్లు అందించే సమాచారాన్ని డెవలపర్స్ నేరుగా తెలుసుకోవచ్చు. డెవలపర్స్‌ సదరు యాప్‌ను యాప్‌ స్టోర్‌ నిబంధనల ప్రకారం డిజైన్‌ చేశారా? లేదా? అనే దానిపై యాప్‌ రివ్యూ బృందం సమీక్ష నిర్వహిస్తుంది. మల్టీలేయర్‌ రివ్యూ ద్వారా 2021లో సుమారు పది లక్షల మంది కొత్త యాప్‌ డెవలపర్స్‌ తమ యాప్‌లలోని లోపాలను మెరుగుపరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యూజర్ల నుంచి అదనపు సమాచారాన్ని సేకరిస్తున్న సుమారు 3,43,000 యాప్‌లను రివ్యూ బృందం తిరస్కరించింది. యూజర్లు రిపోర్ట్ ఏ ప్రాబ్లమ్‌ ఫీచర్‌ ద్వారా తమకు అనుమానం కలిగిన యాప్‌పై ఫిర్యాదు చేస్తే.. దానిపై సమీక్ష నిర్వహించి సకాలంలో చర్యలు తీసుకుంటాం’’ అని యాపిల్ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

నకిలీ రివ్యూలు, రేటింగ్‌లు కలిగిన యాప్‌లపై కూడా చర్యలు తీసుకున్నట్లు యాపిల్‌ తెలిపింది. 2021లో సుమారు 94 మిలియన్ల నకిలీ రివ్యూలు, 170 మిలియన్ల నకిలీ రేటింగ్‌లను తొలగించినట్లు చెప్పింది. దానితోపాటు మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించి 8,02,000 డెవలపర్స్‌ ఖాతాలను తొలగించడంతో పాటు, 1,53,000 డెవలపర్‌ నమోదు ప్రక్రియలను తిరస్కరించినట్లు కంపెనీ పేర్కొంది. 

యాపిల్ పే, స్టోర్‌కిట్ వంటి ఆర్థికపరమైన లావాదేవీలు జరిపే యాప్‌లలో యూజర్‌ డేటా హ్యాకర్స్‌ చేతికి చిక్కకుండా మెరుగైన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు యాపిల్ వెల్లడించింది. అలానే యాపిల్‌ పే ద్వారా లావాదేవీలు జరిపే యూజర్లకు సంబంధించిన క్రెడిట్, డెబిట్‌ కార్డుల సమాచారాన్ని వ్యాపార సంస్థలతో పంచుకోబోమని సంస్థ పేర్కొంది. సుమారు 9,05,000 యాప్స్‌ ఈ సాంకేతికత ద్వారా ఉత్పత్తులను విక్రయించడంతోపాటు, ఆర్థికపరమైన సేవలను అందిస్తున్నాయని తెలిపింది. యాప్‌ స్టోర్‌ను యూజర్లకు సురక్షితమైన, నమ్మకమైన, మోసపూరిత లావాదేవీలు, ఆర్థికపరమైన నేరాలు జరగకుండా అడ్డకునే వేదికగా మార్చేందుకు నిరంతం కృషి చేస్తామని యాపిల్ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని