
Apple iOS 15: యాపిల్ కీలక సూచన.. మరి ఐఓఎస్ 15కు అప్డేట్ చేశారా?
ఇంటర్నెట్‌డెస్క్: గతేడాది యాపిల్ కంపెనీ ఐఫోన్13, వాచ్ 7 సిరీస్, కొత్త ఐపాడ్లను విడుదల చేసింది. వాటికి అనుగుణంగా అప్డేటెడ్ ఓఎస్ ఐఓఎస్ 15ను కూడా తీసుకొచ్చింది. అయితే ఐఓస్ 15 కొన్ని పాతతరం డివైజ్‌లలో అప్డేట్ కాదని యాపిల్ తెలిపింది. అలానే ఐఓఎస్ 14 వెర్షన్ యూజర్స్ కోసం కొత్త సెక్యూరిటీ అప్డేట్ను విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఐఓఎస్ 14 యూజర్లు తమ డివైజ్‌లలో సెక్యూరిటీ అప్డేట్ కావాలనుకుంటే తప్పనిసరిగా ఐఓఎస్ 15ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందేనని యాపిల్ సూచించింది.
గతంలో ఐఓఎస్ 14ను సపోర్ట్ చేసే కొన్ని డివైజ్‌లలో ఐఓఎస్ 15 ఇన్స్టాల్ చేస్తే వాటి పనితీరు నెమ్మదిస్తుందని యాపిల్ వెల్లడించింది. తాజాగా ఐఫోన్ 15 అప్డేటెడ్ వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించడం యూజర్లను సందిగ్ధంలో పడేసింది. ‘‘మీరు ఐఓఎస్/ఐపాడ్ ఓఎస్ 14.5 తర్వాతి వెర్షన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే మీ ఫోన్లో కొత్త ఓఎస్ అప్డేట్ను చూపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్లో ఐఓఎస్/ఐపాడ్ ఓఎస్ 15ను పొందుతారు. ఒకవేళ మీరు ఐఓఎస్ 14ను ఉపయోగించాలనుకుంటే కంపెనీ విడుదల చేసే సెక్యూరిటీ అప్డేట్లను మీరు పొందలేరు’’ అని యాపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
అలానే ఐఓఎస్ 15 విడుదల సమయంలో కొత్త ఓఎస్‌ను అప్డేట్ చేసుకోవాలా? వద్దా? అనేది యూజర్లు నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ ఐఓఎస్ 15కు అప్డేట్ చేసుకోకుండా ఐఓఎస్ 14ను ఉపయోగించాలనుకుంటే దానికి తగినట్లుగా భవిష్యత్తులో సెక్యూరిటీ అప్డేట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఐఓఎస్15ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని సూచించడంపై పలువురు యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాపిల్ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 72 శాతం మంది ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ 15ను అప్డేట్ చేసినట్లు తెలిపింది. కేవలం 26 శాతం డివైజ్‌లు మాత్రమే ఐఓఎస్ 14తో పనిచేస్తున్నాయని వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.