
Apple iCloud: యాపిల్ ఐక్లౌడ్ డేటా.. ఖాతా ఉన్న వ్యక్తి మరణిస్తే ఎలా?
ఇంటర్నెట్‌డెస్క్: సాంకేతికత అందుబాటులోకి వచ్చాక వ్యక్తిగత సమాచారం చాలా వరకు క్లౌడ్‌లోనే స్టోర్ చేస్తున్నాం. ఇందులో సేవ్ చేసిన సమాచారాన్ని యూజర్ మినహా ఇతరులెవరూ ఉపయోగించలేరు. అయితే ఈ డేటా సేవ్ చేసిన వ్యక్తి మరణిస్తే? డేటాకు రక్షణగా పెట్టుకున్న పాస్వర్డ్ ఎవరికీ తెలియదు కాబట్టి అందులోని సమాచారం ఎవరికీ తెలిసే అవకాశంలేదు. మరి అందులోని డేటాను ఇతరులు యాక్సెస్ చేయడం సాధ్యపడదా? ఇదే ఆలోచన యాపిల్‌కు వచ్చింది. వెంటనే దానికి పరిష్కారం కూడా కనుగొంది. యూజర్ మరణాంతరం ఐక్లౌడ్‌లోని డేటాను చూసేందుకు ఎవరికి అనుమతివ్వాలనేది యూజర్ ముందుగానే యాపిల్‌కు చెప్పొచ్చు. ఇందుకోసం లెగసీ కాంటాక్ట్స్ అనే ఆప్షన్‌ను యాపిల్ తీసుకురానుంది. దీని ద్వారా యూజర్ మరణించిన తర్వాత అందులో పేర్కొన్న వ్యక్తులు ఐక్లౌడ్ డేటాను యాక్సెస్ చేయెచ్చు.
ఈ సౌలభ్యాన్ని యాపిల్ త్వరలో విడుదల చేయనున్న ఐఓఎస్ 15.2 అప్డేట్లో పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం డిజిటల్ లెగసీ ప్రోగామ్ కింద లెగసీ కాంటాక్ట్ పేరుతో కొత్త ఆప్షన్ తీసుకురానుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉందని, త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. లెగసీ కాంటాక్ట్ ద్వారా ఐక్లౌడ్ ఖాతా ఉన్న యూజర్ తనకు నచ్చిన ఐదుగురు వ్యక్తులకు తన తదనంతరం ఖాతాను యాక్సెస్ చేసేందుకు అనుమతించవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించేందుకు అనుమతి పొందిన యూజర్స్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఐక్లౌడ్ ఖాతా ఉన్న యూజర్ మరణ ధ్రువీకరణ పత్రం యాపిల్‌కు సమర్పించాలి.
ప్రస్తుతం యాపిల్ అనుసరిస్తున్న విధానం కంటే కొత్తగా రానున్న లెగసీ కాంటాక్ట్ ఎంతో సులువైందని టెక్ వర్గాల సమాచారం. సాధారణంగా యాపిల్ క్లౌడ్ ఖాతా ఉన్న వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన ఖాతాను యాక్సెస్ చేసేందుకు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలో రానున్న అప్డేట్లో లెగసీ కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తులు ఐక్లౌడ్ ఖాతాదారుని మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. ఇప్పటికే గూగుల్, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఎవరైనా ఖాతాదారులు మరణిస్తే.. మరణించిన అనంతరం వారి ఖాతాలు యాక్సెస్ చేసేందుకు ముందుగానే ఐదుగురు వ్యక్తుల పేర్లను యాడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాయి. ఒకవేళ యూజర్ తన తదనంతరం క్లౌడ్‌లోని సమాచారాన్ని ఎవరూ చూడకూడదనుకుంటే వాటంతటవే డిలీట్ అయ్యేలా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు.
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.