Asus Folding Laptop: ₹ 3 లక్షల ల్యాప్‌టాప్‌.. ప్రత్యేకతలు ఏంటంటే?

ఇప్పటిదాకా మడతఫోన్ల గురించి విన్నాం, చూశాం.  కానీ, మడతబెట్టే ల్యాప్‌టాప్‌ గురించి విన్నారా? తాజాగా ఆసుస్‌ కంపెనీ ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఆ ల్యాప్‌టాప్‌ వివరాలివే. 

Updated : 22 Nov 2022 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఫీచర్‌ ఫోన్‌ నుంచి స్మార్ట్‌ఫోన్లు.. ఆ తర్వాత మడత ఫోన్లు వచ్చాయి. తాజాగా ఆసుస్ కంపెనీ మడత ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆసుస్‌ జెన్‌బుక్‌ 17 ఫోల్డ్‌ ఓఎల్‌ఈడీ (Asus Zenbook 17 Fold OLED) పేరుతో ఈ ల్యాపీని తీసుకొచ్చింది.  ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్‌ ఇదేనని ఆసుస్‌ కంపెనీ చెబుతోంది. మరి, ఈ ల్యాప్‌టాప్‌ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేద్దాం.

మడతల్యాపీ వివరాలు..

ఈ ల్యాప్‌టాప్‌లో 17.3 అంగుళాల థండర్‌బోల్ట్ 4k డిస్‌ప్లే ఇస్తున్నారు. దీన్ని మడబెట్టినప్పుడు 12.5 అంగుళాల స్క్రీన్‌గా మారుతుంది. మిగిలిన స్క్రీన్‌ను వర్చువల్‌ కీ బోర్డుగా వాడుకోవచ్చు. దీంతోపాటు, అదనంగా బ్లూటూత్‌ కనెక్టివిటీతో సాధారణ కీ బోర్డు ఇస్తున్నారు. యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ట్యాబ్‌, డిస్‌ప్లేలా రెండు రకాలుగా వాడుకోవచ్చు. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇంటెల్‌ ఐరిస్‌ ఎక్స్‌ఈ గ్రాఫిక్‌ కార్డ్‌ ఇస్తున్నారు. 5 ఎంపీ ఏఐ కెమెరా, డాల్బీ అట్‌మోస్‌ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్స్, నాలుగు యూఎస్‌బీ-సీ పోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ల్యాప్‌టాప్‌తోపాటు 500 జీబీ ఎస్‌ఎస్‌డీ ఎక్స్‌టర్నల్‌ స్టోరేజ్‌ ఉచితంగా ఇస్తున్నారు. ఇందులో ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌, ట్యాబ్లెట్‌, రీడర్‌, ఎక్స్‌టెండెడ్‌ అని ఐదు స్క్రీన్‌ మోడ్స్‌ ఉన్నాయి. మల్టీ స్క్రీన్ ఫీచర్‌తో డిస్‌ప్లేని ఒకేసారి మూడు స్క్రీన్లుగా వాడుకోవచ్చు. ఈ ల్యాపీ ధర ₹ 3,29,000గా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద ₹ 2,84,290కే అందిస్తోంది. ఈ ఆఫర్ నవంబరు 10 వరకు మాత్రమేనని ఆసుస్‌ తెలిపింది. అక్టోబరు14 నుంచి ముందస్తు ప్రారంభంకానున్నాయి.  ముందుగా బుక్‌ చేసుకున్న వారికి  ₹ 27,100 విలువైన ఉచిత వారెంటీని కంపెనీ అందిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని