Smart watches: అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌లు.. ధర, ప్రత్యేకతలివే!

భారత్‌లో రూ.15వేల లోపు అందుబాటులో ఉన్న స్మార్ట్‌వాచ్‌ వివరాలు మీ కోసం..

Updated : 12 Aug 2022 15:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌లకు విపరీతమైన గిరాకీ పెరిగింది. కొత్త కొత్త ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు పలు కంపెనీలు స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేస్తూనే ఉన్నాయి. దీంతో వినియోగదారులు ది బెస్ట్‌ ఏదీ అని తెలుసుకోలేక అయోమయంలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో రూ.15వేల లోపు అందుబాటులో ఉన్న స్మార్ట్‌వాచ్‌ వివరాలు మీ కోసం..


ఫిట్‌బిట్‌ వర్సా 2

వినియోగదారులు ఫిట్‌నెస్‌ గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫిట్‌బిట్‌ వర్సా 2 స్మార్ట్‌వాచ్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇది  చతురస్రాకారంగా.. తేలికపాటి బరువుతో ఉంటుంది. హార్ట్‌ బీట్‌, నిద్ర, మనం వేసే అడుగులు (స్టెప్స్‌) వంటి వాటిని ట్రాకింగ్‌ చేస్తూ కచ్చితమైన రీడింగ్‌ ఇస్తుంది. అంతేకాకుండా దీంతో స్పోటీఫై (Spotify) అందించే సంగీతాన్ని స్ట్రీమ్‌ చేసుకోవచ్చు. అమెజాన్‌కు చెందిన ఎకో పరికరాలను కూడా నియంత్రించవచ్చు. ఇందులో స్విమ్ ప్రూఫ్ డిజైన్‌తో ఉన్న మైక్రోఫోన్‌ ఉంటుంది. కాబట్టి, దీని సహాయంతో మనకు వచ్చే ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేయవచ్చు. లేదంటే రిజెక్ట్‌ చేసేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఐదు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. 

ఫిట్‌బిట్‌ స్మార్ట్‌వాచ్‌లో జీపీఎస్‌ సౌకర్యం లేదు. జీపీఎస్‌ ట్రాకింగ్‌ కోసం మన స్మార్ట్‌ఫోన్‌ మీద ఆధారపడుతుంది. కాబట్టి ఎటైన వెళ్లినపుడు కచ్చితంగా స్మార్ట్‌ఫోన్‌ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫిట్‌బిట్‌ వర్సా 2 తర్వాత ఫిట్‌బిట్‌ వర్సా 3ను కంపెనీ విడుదల చేసింది. అయితే, వర్సా 3 కంటే వర్సా 2 స్మార్ట్‌వాచ్‌ తక్కువ ఖరీదైంది. అంతేకాకుండా ఆకర్షణీయమైన డిజైన్‌తో తగినంత ఫీచర్లనూ కలిగి ఉంది. వర్సా 3 ధర రూ.17,499గా ఉండగా.. ఫిట్‌బిట్‌ వర్సా 2 ధర రూ. 13,799 మాత్రమే.


ఒప్పో స్మార్ట్‌వాచ్‌..

యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌లను పోలినట్టుగా అంతే ఆకర్షణీయమైన డిజైన్‌తో ఒప్పో స్మార్ట్‌వాచ్‌ను తయారుచేసింది. ఇది అమోలెడ్ డిస్‌ప్లేతో రెండు వేరియంట్లలో (1.6, 1.9 అంగుళాల) అందుబాటులో ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ వేర్‌ 3100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వేర్‌ ఓఎస్‌ 5తో ఈ వాచ్‌ పనిచేస్తుంది. 5ఏటీఏం వాటర్‌ ప్రూఫ్‌ డిజైన్‌తో తయారైంది. 1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్ మెమొరీ ఇస్తున్నారు. 430 ఎంఏహెచ్‌, 300 ఎంఏహెచ్‌ బ్యాటరీ వేరియంట్లలో లభిస్తాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే పవర్‌ సేవర్‌ మోడ్‌లో 21 రోజులు, 14 రోజులు పనిచేస్తాయి. ఈ వాచ్‌లో గైరోస్కోప్‌ సెన్సర్‌, జియో మాగ్నటిక్‌ సెన్సర్‌, హార్ట్‌బీట్ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్‌, ట్రై-యాక్సియల్‌ యాక్సిలరేషన్‌ సెన్సర్‌, స్లీప్‌ మానిటర్‌, ఫిట్‌నెస్‌ మానిటర్‌, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ గైడ్‌ ఉన్నాయి. జీపీఎస్‌ ట్రాకింగ్‌ కూడా ఉంది. ఈ వాచ్‌ను ఉపయోగించి మెసేజ్‌లకు రిప్లే, కాల్స్‌ అటెండ్‌ చేసుకోవచ్చు. దీనిలో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ ప్రారంభ ధర రూ. 14,990గా ఉంది.


అమేజ్‌ఫిట్‌ జీటీఎస్‌ 2..

గతంలో అమేజ్‌ఫిట్‌ ఇండియా జీటీఎస్ సిరీస్‌లో స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లలో విడుదల చేసింది. జీటీఎస్‌ 2 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌వాచ్‌లో పీఏఐ (పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్‌) సిస్టమ్‌ ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.65-అంగుళాల చతురస్రాకారపు అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. శరీరంలో బ్లడ్-ఆక్సిజన్‌ శాతాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆక్సిజన్‌బీట్స్‌ ఏఐ ఇంజిన్‌ అమర్చారు. అల్వేస్‌-ఆన్‌ డిస్‌ప్లే, వాచ్‌ ఫేస్ కస్టమైజేషన్‌, హార్ట్‌రేట్ ట్రాకింగ్, స్లీప్‌ మానిటర్‌, స్ట్రెస్‌ మానిటర్‌, 90+ బిల్ట్‌-ఇన్‌ స్పోర్ట్స్‌ మోడ్స్‌, 5 ఏటీఎం వాటర్‌ ప్రూఫ్‌, మ్యూజిక్‌ కంట్రోల్ వంటి ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. 3జీబీ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే వారం రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసే బ్యాటరీ సామర్థ్యం ఉంది. అంతేకాకుండా మొబైల్‌ ఫోన్‌ ద్వారా 300-600 పాటలను మ్యూజిక్‌ ప్లే లిస్ట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.  అమేజ్‌ఫిట్‌ జీటీఎస్‌ 2 స్మార్ట్‌వాచ్‌ ప్రారంభ ధర రూ.12,999గా ఉంది.


హువాయే వాచ్‌ జీటీ 2..

ఈ జాబితాలో హువాయే కంపెనీకి చెందిన జీటీ 2 వాచ్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ 1.39 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో ఉంటుంది. జీపీఎస్‌ సపోర్ట్‌ చేస్తుంది. 15 స్పోర్ట్స్‌ ట్రాకింగ్‌ ఫీచర్స్‌, 8 ఔట్‌ డోర్‌ ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. యాక్సిలరోమీటర్‌ సెన్సర్‌, యాంబియెంట్‌ లైట్‌, ఎయిర్‌ ప్రెషర్‌,  గైరోస్కోప్‌ సెన్సర్‌, జియోమాగ్నటిక్‌ సెన్సర్‌, ఆప్టికల్ హార్ట్‌రేట్ సెన్సర్‌ ఉన్నాయి. 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ సామర్థ్యం ఉంది. ఈ వాచ్‌ 5 ఏటిఎం వాటర్ ప్రూఫ్‌ రెసిస్టెంట్‌తో తయారైంది. మొబైల్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ వాచ్‌లో డిస్‌ప్లే అవుతాయి. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు వారాల పాటు వస్తుంది. వాచ్‌ ప్రారంభ ధర రూ.14,990గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని