BGMI: యూజర్లకు షాక్‌.. 47వేల ఖాతాలపై బీజీఎమ్‌ఐ నిషేధం

బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (BGMI) భారత్‌లో సుమారు 47,624 నకిలీ ఖాతాలపై నిషేధం విధించింది. బీజీఎమ్‌ఐ యూజర్లకు ఆహ్లాదకరమైన గేమింగ్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రాఫ్టన్‌ (Krafton) సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 12 Jul 2022 02:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (BGMI) నకిలీదారులకు షాకిచ్చింది. భారత్‌లో సుమారు 47,624 నకిలీ ఖాతాలపై నిషేధం విధించింది. బీజీఎమ్‌ఐ యూజర్లకు ఆహ్లాదకరమైన గేమింగ్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రాఫ్టన్‌ (Krafton) సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కొంతమంది ఖాతాదారులు థర్డపార్టీ ప్రోగ్రామ్‌ల ద్వారా ఇతర యూజర్ల డేటా మార్చడంతోపాటు, నకిలీ ఐడీలను ఉపయోగించడం, గేమ్‌లో టీమ్‌ సభ్యులను మోసగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని క్రాఫ్టన్‌ సంస్థ తెలిపింది.

గేమ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అలాంటి వారిని గుర్తించేందుకు క్రాఫ్టన్‌ కంపెనీ బ్యాన్‌పాన్‌ 2.0 అనే కొత్త వెర్షన్‌ సాంకేతికతను పరిచయం చేసింది. దీంతో గేమ్‌లో మోసాలకు పాల్పడుతున్న వారిని సులువుగా గుర్తించవచ్చని సంస్థ తెలిపింది. అలా 2022 జులై 27 - 2022 జూన్‌ 03 వరకు 47, 624 ఖాతాలను గుర్తించి నిషేధం విధించినట్లు ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో పబ్‌జీ నిషేధం తర్వాత క్రాఫ్టన్‌ సంస్థ బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియాగా పేరు మార్చి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. క్రాఫ్టన్‌ సంస్థ నిషేధించిన ఖాతాల ఐడీలను చూసేందుకు క్లిక్ చేయండి. 

ఏయే ఖాతాలపై ఎందుకు నిషేధం అంటే? 

* గేమ్‌లో చీటింగ్‌ టూల్స్‌ ఉపయోగించేవారు. థర్డ్‌ పార్టీ ప్రోగ్రామ్‌లతో గేమ్‌ రిజల్ట్‌ను యాక్సెస్‌ చేసి యూజర్‌ డేటా, గేమ్‌లో గ్రాస్‌ మోడల్స్‌లో మార్పులు చేసే ఖాతాదారులపై నిషేధం విధించింది. 

* టీమ్‌ గేమ్‌లో ఎక్కువసార్లు సొంత టీమ్‌ సభ్యులు లేదా ఇతర టీమ్‌ మెంబర్స్‌ మోసం చేసినట్లు గుర్తించిన ఖాతాలను నిషేధించింది.  

* గేమ్‌లో భాగంగా నకిలీ వెబ్‌సైట్లు, సమాచారం ప్రచారం చేసి యూజర్లకు ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా, ఖాతాలను కోల్పోయేట్లు చేసిన వ్యక్తుల ఖాతాలను బ్యాన్‌ చేసింది. 

* గేమ్‌లో యూసీ (Unknown Cash)లను రీఛార్జ్‌ చేసేందుకు అనధికార నగదు చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించేవారి ఖాతాలను తొలగించింది. 

* అధీకృత యాప్‌ స్టోర్ల నుంచి కాకుండా, నకిలీ లింక్‌లు, క్రాక్‌డ్‌ వెర్షన్‌ల ద్వారా గేమ్‌ డౌన్‌లోడ్ చేసుకోవద్దని, అలా చేసిన ఖాతాలపై కూడా నిషేధం విధిస్తామని క్రాఫ్టన్‌ సంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని