Published : 23 May 2022 01:46 IST

Bill Gates: బిల్‌గేట్స్‌ ఏ మొబైల్‌ వాడుతారో తెలుసా..?

ఇంటర్నెట్‌ డెస్స్‌: టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఏ మొబైల్‌ వాడుతారో తెలుసా?ఆ ఏముంటుందిలే ఆయనే ఓ పెద్ద కంపెనీని శాసిస్తున్నాడు.. అదే కంపెనీ తన కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మొబైలే వాడుతుంటారులే అనుకుంటున్నారా? లేదా ఆయనో పెద్ద బిలీనియర్‌, బిజినెస్‌ మేన్‌ కాబట్టి.. యాపిల్‌కు చెందిన అత్యంత ఖరీదైన ఐఫోన్‌ ఏదో తీసు‘కొని’ ఉంటారులే అని ఆలోచిస్తున్నారా? ఇవేవి కావు... బిల్‌ గేట్స్‌ చేతిలో ఉన్నది శాంసంగ్‌ మడతపెట్టే మొబైల్‌.

అందుకే ఆ మొబైల్‌..!

ఈ వారం రెడిట్‌ ‘Ask Me Anything’ సెషన్‌లో బిల్‌గేట్స్‌ తన మొబైల్‌ గురించి సమాధానం ఇచ్చారు. తన దగ్గర ఉన్నది ‘శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3’ అని ప్రకటించారు. ‘‘నేను భిన్నంగా ఉన్నదాన్ని ప్రయత్నిస్తా.. ఈ స్క్రీన్‌తో నేను పోర్టబుల్‌ పీసీ, మొబైల్‌ను పొందగలను తప్ప మరేమీ లేదని’’ గేట్స్‌ వివరణ ఇచ్చాడు. అయితే, యాపిల్‌ ఐఫోన్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ మొబైల్‌ను ఉపయోగిస్తున్నట్లు బిల్‌ గేట్స్‌ గతంలో వెల్లడించారు. ఆ తర్వాత తన మొబైల్‌ పేరును ప్రత్యేకంగా వెల్లడించడం ఇదే తొలిసారి. మరోవైపు మైక్రోసాఫ్ట్‌తో శాంసంగ్‌కు కొన్ని విషయాల్లో భాగస్వామ్యం ఉండటం వల్ల గేట్స్‌ ఈ మొబైల్‌ వాడటానికి ఓ కారణం కావచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, రెండు హై ఎండ్‌ స్క్రీన్‌లతో ఉండే మైక్రోసాఫ్ట్‌ ‘Surface Duo’ స్మార్ట్‌ఫోన్‌లో దాదాపు ‘శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3’లో ఉన్న ఫీచర్లే ఉన్నాయి. రెండు తెరల్లో ఆండ్రాయిడ్‌ ఫీచర్లను మరింత సమర్థంగా వాడుకునేలా మైక్రోసాఫ్ట్‌ ఆ ఫోన్‌ని రూపకల్పన చేసింది. 

జెడ్ ఫోల్డ్ 3 ధరెంతంటే..?

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 విషయానికొస్తే.. 12GB ర్యామ్‌/ 256 GB స్టోరేజ్‌తో వచ్చే ఈ మోడల్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ.1,49,999గా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌ యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 7.6-అంగుళాల డిస్‌ప్లే.. ఫోన్‌ని మూసినప్పుడు 6.2-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుకవైపు మూడు 12 ఎంపీ కెమెరాలు.. ఫోన్ తెరిచినప్పుడు 4 ఎంపీ, మూసినప్పుడు 10ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 4,400 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్‌ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్స్ వైర్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts