బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్లు..ఎప్పుడంటే?

దేశంలో మెట్రో నగరాలు మొదలుకొని, పట్టణాల వరకు 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ సేవల నాణ్యత ఎలా ఉన్నాయనేది పక్కకు పెడితే టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందించేదుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.....

Updated : 05 Aug 2022 16:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో మెట్రో నగరాలు మొదలుకొని, పట్టణాల వరకు 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ సేవల నాణ్యత ఎలా ఉన్నాయనేది పక్కకు పెడితే టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందించేదుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దానికనుగుణంగానే స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు సైతం 5జీ ఫోన్లను తయారు చేయనున్నాయి. అయితే 5జీ టెక్నాలజీ ధర ఎక్కువ కావడంతో ఫోన్ల తయారీ ఖర్చు పెరుగుతుంది. దాంతో 5జీ ఫోన్ల ధరలు కూడా పెరుగుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు ఫోన్‌ తయారీ కంపెనీలు తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు ముఖ్య కారణం క్వాల్‌కోమ్‌ కంపెనీ. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సాన్‌డియాగో పట్టణం కేంద్రంగా ఈ కంపెనీ పనిచేస్తుంది.

2021నాటికి ఈ కంపెనీ 5జీ టెక్నాలజీతో స్నాప్‌డ్రాగన్‌ 400 సిరీస్‌లో ప్రాసెసర్లను తీసుకురావాలని భావిస్తోంది. అదే జరిగే 5జీ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ల ధరలు చాలా వరకు తగ్గుతాయని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా తర్వాతి తరం టెక్నాలజీని తొలిసారిగా బడ్జెట్ ఫోన్లో పొందవచ్చు. ఇప్పటికే క్వాల్‌కోమ్ 5జీ టెక్నాలజీతో వివిధ రకాల మొబైల్ ప్రాసెసర్లను తయారుచేస్తోంది. ప్రస్తుతానికి 5జీ సేవలు 35 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది కూడా. దీన్ని దృష్టిలో ఉంచుకునే షావోమీ, మోటోరోలా, వన్‌ప్లస్‌ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు స్నాప్‌డ్రాగన్‌ 400 ప్రాసెసర్లతో ఫోన్లు విడుదల చేయాలని భావిస్తున్నాయి.

ప్రణాళిక ప్రకారం జరిగితే 2021 మొదటి త్రైమాసికంలో తొలి బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ఉంటుంది. ఐదో తరం మొబైల్ కమ్యూనికేషన్ సిస్టంగా పేరొందిన 5జీ టెక్నాలజీతో డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగం మరింత పెరుగుతుంది. సినిమాలు సెకన్లలో డౌన్‌లోడ్ అవుతాయి. అలానే వీడియోకాల్స్‌ నాణ్యత పెరుగుతుంది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ అయిన భారత్‌లో ఇప్పటికే 5జీ స్పెక్ట్రంకు సంబంధించిన వేలం ప్రక్రియ ఆలస్యం అయింది. 5జీ సేవలకు తక్కవ శ్రేణి సాంకేతికత ఏమాత్రం సరిపోదు. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున టవర్ల నిర్మాణం చేపట్టడంతో పాటు సాంకేతికతను అభివృద్ధి చేయాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక వేళ 5జీ సాంకేతికత ఏర్పాటు చేసినా మొబైల్ టారీఫ్‌లు పెరుతాయనడంలో సందేహం లేదు. అందుకే 5జీ సేవలపై టెలికాం కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని