Apple Watch: యాపిల్ వాచ్‌ యూజర్లకు కేంద్రం వార్నింగ్‌.. ఎందుకో తెలుసా?

భారత్‌లో యాపిల్‌ వాచ్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. యాపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 8.7 కన్నా తక్కువ వెర్షన్‌ ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ వాచ్‌ ఓఎస్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది...

Updated : 13 Aug 2022 12:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ వాచ్‌ (Apple Watch) ప్రాణాలు కాపాడింది అనే కథనాలు ఎన్నో సందర్భాల్లో విన్నాం.. చదివాం. ఇందుకు ముఖ్యకారణం వాచ్‌లోని సెన్సర్లు. అవి ఎప్పటికప్పుడు యూజర్‌ హెల్త్‌ను మానిటర్ చేస్తూ ఏవైనా హెచ్చుతగ్గులుంటే వెంటనే అలర్ట్ చేస్తుంది. అందుకే ఎక్కువ మంది ఖరీదైన యాపిల్‌ వాచ్‌ను ఉపయోగించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం భారత్‌లో యాపిల్‌ వాచ్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.

యాపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 8.7 కన్నా తక్కువ వెర్షన్‌ ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ వాచ్‌ ఓఎస్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. వాచ్‌ ఓఎస్‌ 8.7లో ఎన్నో లోపాలున్నాయని, వాటివల్ల యాపిల్‌ సెక్యూరిటీ కోడ్‌లను ఉల్లంఘించి హ్యాకర్స్‌ దాడులు చేసే అవకాశం ఉందని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరించింది. 

యాపిల్ ఏవీడీ కాంపోనెంట్‌లో బఫర్‌ ఓవర్‌ఫ్లో కారణంగా ఆడియో, ఐసీయూ, వెబ్‌కిట్‌ వంటి ఫీచర్లలోకి మాల్‌వేర్‌ను పంపి టైపింగ్‌, జీపీయూ డ్రైవర్స్‌, కెర్నెల్‌ కాంపొనెంట్స్‌లో యూజర్‌ను కన్ఫ్యూజ్‌ చేసి డేటా దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది. యాపిల్‌ కూడా తన సపోర్ట్ పేజీలో ఈ లోపం గురించి ప్రస్తావించింది. కెర్నెల్‌ కోడ్‌ ఎగ్జిక్యూషన్‌లో యాపిల్‌ ఏవీడీని ఇది ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఈ సైబర్‌ దాడి నుంచి తప్పించుకునేందుకు యూజర్లు తమ వాచ్‌ ఓఎస్‌ను వెంటనే లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని