Mozilla Firefox: ఫైర్‌ఫాక్స్‌లో బగ్‌.. బ్రౌజర్‌ను అప్‌డేట్ చేశారా..?

మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌లో బగ్‌ను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సైబర్‌ దాడులను అరికట్టేందుకు కృషి చేసే కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ తెలిపింది... 

Updated : 25 Sep 2022 19:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్ మోసాలపై యూజర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు, టెక్‌ కంపెనీలు కొన్ని సూచనలు చేస్తుంటాయి. కంపెనీలు అందించే సేవల్లో ఏవైనా లోపాలుంటే వాటిని  సరిచేసుకోమని ప్రభుత్వ సంస్థలు సైతం హెచ్చరిస్తుంటాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సైబర్‌ దాడులను అరికట్టేందుకు కృషి చేసే కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ ఉపయోగించే వారికి  అడ్వైజరీ జారీ చేసింది. ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌లో లోపం కారణంగా సైబర్‌ నేరగాళ్లు యూజర్లను ఏమార్చి వారి డేటాను దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది. బ్రౌజర్‌ ఇంజిన్‌లోని మెమొరీ సేఫ్టీ బగ్‌ల ద్వారా హ్యాకర్స్‌ సెక్యూరిటీ గేట్‌వేను దాటుకుని ఆర్బిటరీ కోడ్‌ను యూజర్‌ కంప్యూటర్‌/పీసీలలోకి ప్రవేశపెడతారని హెచ్చిరించింది. వాటి సాయంతో యూజర్‌ వ్యక్తిగత సమాచారంతోపాటు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను సేకరించే ప్రమాదం ఉందని వెల్లడించింది. 

సీఈఆర్‌టీ-ఇన్‌ లోపాలను గుర్తించిన నేపథ్యంలో యూజర్లు బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని మొజిల్లా సూచించింది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ వెర్షన్‌ 105, ఈఎస్‌ఆర్‌ వెర్షన్‌ యూజర్లు తమ బ్రౌజర్‌ను 102.3 వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. ప్రస్తుతం పైన పేర్కొన్న వెర్షన్లను ఉపయోగిస్తున్న యూజర్లు సీఈఆర్‌టీ-ఇన్‌ వెబ్‌సైట్‌ లేదా ఫైర్‌ఫాక్స్‌ సెక్యూరిటీ పేజ్‌ నుంచి బ్రౌజర్‌ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఫైర్‌ఫాక్స్‌ సెక్యూరిటీ పేజ్‌ కోసం క్లిక్ చేయండి. మీరు ఉపయోగిస్తున్న బ్రౌజర్‌ వెర్షన్‌ తెలుసుకునేందుకు మీ కంప్యూటర్‌/పీసీలో ఫైర్‌ఫాక్స్‌ ఓపెన్ చేసి కుడివైపున ఉన్న మూడు గీతలపై క్లిక్ చేస్తే సెట్టింగ్స్‌ సెక్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే జనరల్ సెక్షన్‌ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి కిందకు స్క్రోల్ చేస్తుంటే ఫైర్‌ఫాక్స్‌ అప్‌డేట్స్‌ అనే చోట బ్రౌజర్‌ వెర్షన్‌ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వెర్షన్‌ 105, ఈఎస్‌ఆర్‌లను ఉపయోగిస్తుంటే 102.3కి అప్‌డేట్ చేసుకోమని సీఈఆర్‌టీ-ఇన్‌ సూచిస్తోంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts