Apple Update: యాపిల్‌ యూజర్లు.. మీ ఓఎస్‌ను అప్‌డేట్ చేశారా?లేదంటే వెంటనే!

యాపిల్ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్‌టీ-ఇన్‌ కీలక సూచన చేసింది. యూజర్లు వెంటనే తమ డివైజ్‌లలోని ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

Published : 20 May 2022 01:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్‌ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరిక జారీ చేసింది. యాపిల్ టీవీఓఎస్‌, ఐపాడ్‌ఓఎస్‌ 15.5 కంటే ముందు వెర్షన్ ఓఎస్‌లలో లోపాలున్నాయని.. వాటి వల్ల యూజర్‌ డేటా హ్యాకర్స్‌కు చేరిపోయే అవకాశం ఉందని సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది. ఈ మేరకు యూజర్లు వెంటనే తమ ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఇవేకాకుండా యాపిల్ సఫారీ బ్రౌజర్ 15.4 కంటే ముందు వెర్షన్ ఉపయోగిస్తున్న యూజర్లు తమ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. 

ఇటీవలే యాపిల్‌ మ్యాక్‌ కంప్యూటర్లకు మ్యాక్ఓఎస్‌ మానేటరీ 12.4 వెర్షన్‌, ఐఫోన్‌/ఐపాడ్‌లకు ఐఓఎస్‌ 15.5 అప్‌డేట్‌ను విడుదల చేసింది. వీటిలో సుమారు 50కిపైగా బగ్స్‌ను సరిచేసినట్లు వెల్లడించింది. ఇప్పటికీ ఎవరైనా యూజర్లు పాత్‌ వెర్షన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ‘‘యాపిల్‌ ఏవీడీ, కెర్నెల్‌, వెబ్‌కిట్ వంటివి ఉపయోగించిన తర్వాత అందులోని లోపాల కారణంగా హ్యాకర్స్‌ యూజర్‌ డివైజ్‌లలోకి మాల్‌వేర్‌ను పంపుతారు. అవి యూజర్‌ నకిలీ వెబ్‌సైట్లను చూసే విధంగా ప్రేరేపిస్తాయి. వాటి సాయంతో యూజర్‌ డివైజ్‌లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు’’ అని సీఈఆర్‌టీ-ఇన్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

సెక్యూరిటీ అప్‌డేట్‌తోపాటు యాపిల్ ఈ ఓఎస్‌ వెర్షన్లలో మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేసింది. యాపిల్‌ వాలెట్‌కు యాపిల్‌ క్యాష్ కార్డ్‌ సపోర్ట్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్లకు నగదు బదిలీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. అలానే పాడ్‌కాస్ట్‌ యాప్‌లో ఎన్ని ఎపిసోడ్‌లు ఫోన్ మెమొరీలో స్టోర్ చేసుకోవాలనే దానిపై పరిమితులు విధించింది. దీంతో యూజర్లు కొత్త ఎపిసోడ్‌లను స్టోర్ చేసిన తర్వాత మెమొరీ సరిపోకపోతే పాతవి ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని