ChatGPT: యూఎస్‌ లా పరీక్షలు పాసైన చాట్‌జీపీటీ!

చాట్‌జీపీటీతో విద్యార్థులు సులువుగా పరీక్షల్లో మోసం చేయగలుగుతారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ అమెరికాలోని ఓ యూనివర్శిటీ న్యాయశాస్త్రం పరీక్షలను విజయవంతంగా పాసైంది. 

Published : 25 Jan 2023 21:57 IST

వాషింగ్టన్‌: గత కొంత కాలంగా సాంకేతిక రంగంలో చాట్‌జీపీటీ (ChatGPT) అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. కృత్రిమమేధ (AI) సాయంతో పనిచేసే ఈ చాట్‌బోట్‌ యూజర్‌కు అవసరమైన సమాచారాన్ని కచ్చితత్వంతో చూపిస్తుంది. అందుకే చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయింది. తాజాగా  చాట్‌జీపీటీ అమెరికాలోని ఓ యూనివర్శిటీ న్యాయశాస్త్రం పరీక్షలను విజయవంతంగా పాసైంది. 

అమెరికాలోని మిన్నేసోటా యూనివర్శిటీ లా స్కూల్‌లో విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను జొనాదన్‌ చోయ్ అనే ప్రొఫెసర్‌ చాట్‌జీపీటీలో టైప్‌ చేశారు. ఈ ప్రశ్నపత్రంలో 95 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు, 12 వ్యాసరూప ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో అన్ని ప్రశ్నలకు చాట్‌జీపీటీ సమాధానాలను ఇచ్చినట్లు జొనాదన్‌ తెలిపారు. చాట్‌జీపీటీ సమాధానాల ఆధారంగా సీ ప్లస్‌ గ్రేడ్‌ ఇచ్చినట్లు తెలిపారు. యూనివర్శిటీ లా పరీక్షలో పాసయ్యేందుకు ఈ గ్రేడ్ సరిపోతుందని ఆయన అన్నారు. వ్యాసరూప ప్రశ్నల్లో సమాధానాలు మాత్రమే రాసిన చాట్‌జీపీటీ వాటికి ఉదాహరణలను మాత్రం చూపించలేదని వెల్లడించారు. న్యాయ విద్యార్థులు పరీక్షలకు సంబంధించి సాధన కోసం ఈ చాట్‌జీపీటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని  ట్వీట్‌ చేశారు. 

మరోవైపు చాట్‌జీపీటీ వినియోగంతో సృజనాత్మకత ఆధారిత రంగాలకు ముప్పు వాటిల్లుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల పరీక్షల్లో విద్యార్థులు సులువుగా మోసం చేయవచ్చని ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా క్లాస్‌ రూమ్‌ టీచింగ్‌కు చాట్‌జీపీటీ ప్రమాదకారిగా అభిప్రాయపడుతున్నారు. గతేడాది సెప్టెంబరులో అమెరికాకు చెందిన ఓపెన్‌ఏఐ అనే సంస్థ చాట్‌జీపీటీని అభివృద్ధి చేసింది. పరీక్షల నిమిత్తం ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు తొలుత ప్రకటించింది. తర్వాత సాంకేతికత సమస్యలు తలెత్తడంతో కొన్ని ప్రాంతాల్లో చాట్‌జీపీటీ సేవలు నిలిచిపోయాయి. దీంతో త్వరలోనే చాట్‌జీపీటీ ప్రొఫెషనల్‌ పేరుతో సబ్‌స్క్రిప్షన్‌ వెర్షన్‌ తీసుకురానున్నట్లు సమాచారం. దీనికి యూజర్లు 42 డాలర్ల నెలవారీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ ఓపెన్‌ఏఐలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. దీనిద్వారా చాట్‌జీపీటీ సేవలు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు