Microsoft Windows: విండోస్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!

విండోస్‌ ఓఎస్‌ యూజర్లు కేంద్రం కీలక సూచన చేసింది. యూజర్లు వెంటనే ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. 

Updated : 26 Aug 2022 21:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విండోస్‌ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (సీఈఆర్‌టీ-ఇన్‌) కీలక సూచన చేసింది. విండోస్ యూజర్లు తమ ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్‌ విండోస్ ఓఎస్‌లో లోపాలను గుర్తించినట్లు తెలిపింది. వీటి సాయంతో హ్యాకర్లు, సైబర్‌ నేరగాళ్లు ఓఎస్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ విండోస్ డిఫెండర్‌ పనిచేయకుండా చేసి, యూజర్‌ కంప్యూటర్‌/పీసీపై సైబర్‌ దాడికి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో యూజర్‌కు సంబంధించిన సమాచారం సులువుగా సైబర్‌ నేరగాళ్ల చేతికి చేరడంతోపాటు, యూజర్‌ ప్రమేయం లేకుండా కంప్యూటర్‌/పీసీని తమ ఆధీనంలోకి తీసుకోగలరని తెలిపింది. విండోస్‌ డిఫెండర్‌లోని క్రెడెన్షియల్‌ గార్డ్‌లోని బగ్‌ కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ బగ్‌ వల్ల 43 మైక్రోసాఫ్ట్‌ వెర్షన్లలో సమస్య తలెత్తినట్లు ఇతర సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 బిలియన్‌ యూజర్లు విండోస్‌ ఓఎస్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లోని విండోస్‌ యూజర్లు వెంటనే తమ ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్‌టీ-ఇన్‌ తమ రిపోర్టులో సూచించింది. ఓఎస్‌ అప్‌డేట్ కోసం స్టార్ట్‌ మెనూపై క్లిక్ చేసి కంట్రోల్ ప్యానల్‌లోకి వెళితే విండోస్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చివరిగా మీ ఓఎస్‌ ఎప్పుడు అప్‌డేట్ అయిందనేది చూపిస్తుంది. ఒకవేళ మీ కంప్యూటర్‌/పీసీలో ఆటో అప్‌డేట్‌ ఫీచర్‌ ఎనేబుల్ చేసుకుంటే మీ విండోస్‌ ఓఎస్‌ ఆటోమేటిగ్గా అప్‌డేట్ అవుతుంది. అలానే క్రెడెన్షియల్‌ గార్డ్‌ బగ్‌ కారణంగా ప్రభావితమైన విండోస్‌ ఓఎస్‌ వెర్షన్‌ల జాబితాను విడుదల చేసింది. వీటిలో విండోస్‌ 11, విండోస్‌ 10, విండోస్‌ సర్వర్‌ 2022, 2019, 2016లు ఉన్నాయి. ఓఎస్‌ జాబితా కోసం క్లిక్ చేయండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని