Web Browsers: బ్రౌజర్‌లో పాస్‌వర్డ్‌లు సేవ్ చేస్తున్నారా?సైబర్‌ నిపుణులేమంటున్నారు?

ఆన్‌లైన్‌ ఖాతాలకు సంబంధించిన లాగిన్‌ వివరాలను చాలా మంది యూజర్స్ బ్రౌజర్లలో సేవ్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలేంటో చూద్దాం.

Published : 04 Jan 2022 12:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌, సామాజిక మాధ్యమాల పుణ్యమా అని.. యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లతో మన జీవితాలు ముడిపడిపోయాయి. ఫోన్‌కొకటి, ఫేస్‌బుక్‌కు ఇంకొకటి, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌కు మరొకటి.. ఇలా ప్రతిదానికీ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తోనే పని. అలాగని ఎన్నని మనం గుర్తు పెట్టుకుంటాం? అందుకే చాలా మంది వెబ్‌ బ్రౌజర్లలో యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లు సేవ్ చేసేస్తుంటారు. ఇలా మనం బ్రౌజర్లో యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌లను సేవ్‌ చేయడం ఎంతవరకు శ్రేయస్కరం? దీనిపై బ్రౌజర్‌ కంపెనీలు ఏం చెబుతున్నాయి? టెక్‌ నిపుణులు ఎలాంటి సూచనలు చేస్తున్నారో చూద్దాం.. 


క్రోమ్‌లో ఇలా: మీ డివైజ్‌లోని క్రోమ్‌ బ్రౌజర్‌లో యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లు సీక్రెట్ కీతో సేవ్‌ అవుతాయని గూగుల్ చెబుతోంది. ఈ ప్రాసెస్‌ గూగుల్ సర్వర్‌లలో స్టోర్‌ అయ్యే ముందు జరుగుతుందని తెలిపింది. వీటిని గూగుల్‌ సహా బయటి వారు యాక్సెస్ చేయలేరంటోంది. ఒకవేళ పాస్‌వర్డ్ మేనేజర్‌లోకి వెళ్లినా వాటిని చూడలేరు. అలానే ఒకేసారి అన్ని ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను చూసేందుకు అనుమతించదు. ఎందుకంటే మీరు సేవ్‌ చేసిన పాస్‌వర్డ్‌లను యాక్సెస్ చేసే ముందు గూగుల్ మీ జీమెయిల్ పాస్‌వర్డ్ ఎంటర్‌ చేయాలని అడుగుతుంది. పాస్‌వర్డ్ టైప్‌ చేస్తేనే మీ లాగిన్ వివరాలు కనిపిస్తాయి. 


ఫైర్‌ఫాక్స్‌లో ఇంకోలా: మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌లో పాస్‌వర్డ్ మేనేజర్‌ ఫీచర్‌లేదు. ఈ బ్రౌజర్‌లో యూజర్‌ సేవ్‌ చేసే వివరాలు సెక్యూర్‌గా ఉంటాయని మొజిల్లా చెబుతోంది. అలానే గూగుల్ తరహాలో యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్ సేవ్‌ చేసినప్పుడు సెక్యూరిటీ కీ లాంటివి ఉండవు. మొజిల్లాలో లాగిన్ వివరాలు సేవ్‌ చేయాలంటే బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీపై క్లిక్‌ చేయాలి. అందులో లాగిన్స్ అండ్ పాస్‌వర్డ్స్ సెక్షన్‌లోకి వెళ్లి మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్ వివరాలు సేవ్‌ చేయాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోవచ్చు. అందులోని సెక్యూరిటీ ఆప్షన్లను సెలెక్ట్ చేస్తే మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ను ఇతరులు హ్యాక్‌ చేసినా మీకు అలర్ట్‌ మెసేజ్ వస్తుంది. 


సైబర్‌ నిపుణుల సూచన ఇదీ: యూజర్స్ సాధ్యమైనంతవరకు తమ లాగిన్ వివరాలు గుర్తుంచుకోవడమే మంచిదని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. బ్రౌజర్లలో వాటిని సేవ్‌ చేయకపోవడం ఉత్తమం అని చెబుతున్నారు. ఎందుకంటే బ్రౌజర్లలో పూర్తిస్థాయి భద్రత ఉండదనేది సైబర్‌ నిపుణుల వాదన. ఇప్పటికే మీ బ్రౌజర్లలో మెయిల్‌, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు సంబంధించి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లను సేవ్‌ చేసుంటే వెంటనే వాటిని డిలీట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా రోజూ ఉపయోగించే పీసీలోని బ్రౌజర్‌లో లాగిన్‌ వివరాలు సేవ్ చేస్తే.. సదరు పీసీ సైబర్‌ దాడులకు గురైనప్పుడు మీ గూగుల్ ఖాతా వివరాలు హ్యాకర్స్‌కు చిక్కుతాయి. అలా హ్యాకర్‌ మీ జీమెయిల్ ఖాతా వివరాలతో గూగుల్ సర్వీసుల్లో ఏదో ఒక దానిలో లాగిన్ అయితే మిగిలిన గూగుల్ సేవలకు సంబంధించిన ఖాతాలను సులువుగా యాక్సెస్ చేయొచ్చని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు.


2ఎఫ్‌ఏతో పాటు ఇవి కూడా..: అందుకే లాగిన్‌ వివరాలు బ్రౌజర్లలో సేవ్ చేయవద్దని, వాటికి బదులుగా టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్ (2ఎఫ్‌ఏ) ప్రాసెస్‌ను ఉపయోగించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ప్రైమరీ పాస్‌వర్డ్‌తోపాటు పిన్‌, ఓటీపీ వంటి సెకండరీ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తేనే ఖాతా ఓపెన్ అవుతుంది. అయితే 2ఎఫ్‌ఏ కూడా పూర్తిస్థాయి భద్రత కలిగినది కాదని మరికొందరు సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకుల వాదన. మ్యాన్‌-ఇన్‌-ది-మిడిల్‌ (ఎమ్‌ఐటీఎమ్‌) వంటి ఫిషింగ్ టూల్‌కిట్‌ల ద్వారా 2 ఎఫ్‌ఏను కూడా హ్యాక్ చేయొచ్చంటున్నారు. ఖాతాల లాగిన్ వివరాలు హ్యాకర్స్ చేతికి చిక్కకుండా ఉండేందుకు యూజర్స్ ప్రతి ఆన్‌లైన్ ఖాతాకు 2ఎఫ్‌ఏను ఉపయోగించడంతోపాటు స్పెషల్ క్యారెక్టర్స్, అల్ఫాబెట్స్‌, నంబర్లతో కూడిన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం, తరచుగా వాటిని మారుస్తూ ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని