ఈ యాప్‌ వాడు.. మొబైల్‌ తక్కువగా చూడు!

డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ యాప్స్‌ ప్రయత్నించండి. మొబైల్‌ వాడకాన్ని తగ్గించేయండి... 

Updated : 30 Apr 2022 17:11 IST

అర నిమిషం ఖాళీ దొరికితే అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్‌ ఆటోమేటిక్‌గా వచ్చేస్తోంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. అంతలా ఫోన్‌కి బానిసలయ్యాం. మొబైల్‌ ఎక్కువగా వినియోగిస్తే దీర్ఘ కాలంలో మానసిక, ఆరోగ్య సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నా, ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని నిపుణులు అంటున్నారు. మీ పరిస్థితి ఇలానే ఉన్నా, లేకపోతే మీకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నా...  సింపుల్‌గా ఈ డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ యాప్స్‌ని ప్రయత్నించండి. మొబైల్‌ వాడకాన్ని తగ్గించేయండి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


 

మీకు నచ్చిన సమయానికి రప్పిద్దాం...
నిమిషానికో వాట్సాప్‌ మెసేజ్‌, అరగంటకో ఫేస్‌బుక్‌ నోటిఫికేషన్‌, గంటకో యూట్యూబ్‌ అప్‌డేట్‌.. ఇలా నోటిఫికేషన్లు ఒకదాని తర్వాత ఒకటి వరుస కట్టి, మీ సమయాన్ని తినేస్తున్నాయా! అయితే నోటిఫికేషన్‌లన్నీ ఒకేసారి వచ్చేట్టుగా చేస్తే సరి. దాని కోసం Post Box యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. మీకు నచ్చే సమయాన్ని ఎంచుకుని, అప్పుడే నోటిఫికేషన్లు వచ్చేట్టుగా చేయొచ్చు. అంటే రోజులో మీకు అనుకూలమైన సమయానికే మొత్తం నోటిఫికేషన్లు వస్తాయి. టింగ్‌, టింగ్‌ మంటూ వరుస నోటిఫికేషన్లు రావు. దీంతో మీ పని ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఫోన్‌కి దూరంగా ఉండొచ్చు.


సమయం సమాప్తం...
రోజులో ఏ యాప్‌కి ఎంత సమయం కేటాయించారు? ఫోన్‌ని ఎన్నిసార్లు అన్‌లాక్‌ చేశారు? ఎన్ని నోటిఫికేషన్‌లు వచ్చాయి? మొత్తంగా రోజులో స్మార్ట్‌ఫోన్‌కి ఎంత సమయం కేటాయించారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే Digital Wellbeing యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందే. ఫోన్‌లోని ప్రతి యాప్‌కి నిడివిని సెట్‌ చేసి, అంతసేపే వాడేలా టైమర్‌ ఏర్పాటు చేయొచ్చు. ఉదాహరణకు యూట్యూబ్‌కి గంట కేటాయిస్తే, నిర్ణీత సమయం తర్వాత యాప్‌ పాజ్‌ అవుతుంది. ‘మీ సమయం పూర్తైంది. తిరిగి రేపు కలుద్దాం’ అనే పాప్‌అప్‌ నోటిఫికేషన్‌ ఇస్తుంది. ఇలా షెడ్యూల్‌ ఏర్పాటు చేసుకుని యాప్‌లకు కేటాయించే సమయాన్ని తగ్గించొచ్చు. ఫోన్‌ వాడకాన్ని నియంత్రించొచ్చు. 


ఎక్కడివి అక్కడే?
నిద్రపోతున్నప్పుడు వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది... ఏంటా అని ఫోన్ అన్‌లాక్‌ చేసి, ఓ గంట మొబైల్‌ వాడేసేవాళ్లు చాలామందే ఉన్నారు. ఆఫీసు, ఇంటి పని మధ్యలో ఇలా మీరూ యాప్స్‌ తెరుస్తున్నారా? అయితే ఈ యాప్‌ మీ కోసమే. పేరు Morph. ఇది మీ ఫోన్‌లో యాప్‌ల వాడకాన్ని నియంత్రిస్తుంది. మీ స్థలం, సమయానికి అనుగుణంగా మీకు అవసరమయ్యే యాప్స్‌ అందుబాటులో ఉంచుతుంది. దీంతో ఇంట్లో ఉండగా ఇంటి పని, ఆఫీసులో ఉండగా ఆఫీసు పనికి సంబంధించిన యాప్స్‌ మాత్రమే తెరిచే వీలుంటుంది. అవసరాన్ని బట్టి ఏ యాప్‌కి ఎంత సమయాన్ని కేటాయించాలో మీరే సెట్‌ చేసుకోవచ్చు. ఎక్కడ ఏ యాప్‌ వాడాలనేది మీరు ముందుగా యాప్‌లో సెట్‌ చేసుకోవాలి. 


ఎన్ని బుడగలో... 
నిద్ర లేచిన దగ్గరి నుంచి, తిరిగి రాత్రి నిద్రపోయేవరకు మీ ఫోన్‌ని ఎంతసేపు వాడారో తెలుసా. కచ్చితంగా చెప్పలేం అంటారా? అయితే Activity Bubbles యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. అదే మీ మొబైల్‌ వినియోగం ఎంతలా ఉందో చూపిస్తుంది. ఒక రోజులో మీ ఫోన్‌ ఎంతగా వాడారో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని, వాల్‌పేపర్‌ ఆప్షన్‌లోకి వాల్‌పేపర్‌గా సెట్‌ చేసుకుంటే చాలు. ఆ తర్వాత ఫోన్‌ అన్‌లాక్‌ చేయగానే ఓ బుడగ వస్తుంది. మీరెంత సమయం ఫోన్‌తో గడిపితే ఆ బుడగ పరిమాణం అంత పెద్దదిగా ఉంటుంది. ఆ తర్వాత అన్‌లాక్‌ చేసిన ప్రతిసారి బుడగలు వస్తుంటాయి. అలా ఎంత సమయం స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతున్నారో తెలుసుకోవచ్చు. రోజు రోజుకి ఆ సమయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఫోన్‌ వాడకాన్నీ తగ్గించొచ్చు.


అడవిని సృష్టించొచ్చు
పనిలో ఉండగా మాటిమాటికి ఫోన్‌ వైపు చూస్తున్నారా? అరగంటకోసారైనా ఫోన్‌ని తాకకుండా చేతులు ఊరుకోవడం లేదా? అయితే ఓ మొక్కనాటి ఈ సమస్యకి చెక్‌ పెట్టండి. అదేంటి ఫోన్‌కి మొక్కకి సంబంధం ఏంటంటారా? ఆ పని Forest యాప్‌తో సాధ్యమే. ఇందులో సమయాన్ని సెట్‌ చేసుకొని ఓ మొక్కను నాటి, మీ పని ప్రారంభించాలి. ఈ  క్రమంలో మీరు ఎంచుకున్న సమయం వరకూ ఫోన్‌ని తాకకూడదు. అలా చేస్తే మొక్క ఎదుగుతుంది. లేదంటే మొక్క చనిపోతుంది. అలా పనిని ప్రారంభించి సమయానుగుణంగా పూర్తి చేస్తూ అనేక మొక్కలు నాటొచ్చు. ఓ అడవిని సృష్టించొచ్చు. ఇలా పనిలో ఉండగా ఏకాగ్రత కోసం ఈ యాప్‌ని వాడొచ్చు.


స్టాప్‌వాచ్‌ ఆపేద్దాం..
పని సమయాల్లో, నిద్రించే ముందు, చదివేటప్పుడు ఇలా ఏ సమయంలో అయినా చూపులన్నీ ఫోన్‌ అన్‌లాక్‌పైనే, ఆలోచనలన్నీ మొబైల్‌ తెరపైనే. మరి మొబైల్‌ వినియోగంలో గడిపే సమయాన్ని తగ్గించాలంటే ఈ యాప్‌ ప్రయత్నించొచ్చు. పేరు Screen Stopwatch. రోజూ మీరెంత సమయం మొబైల్‌ తెరపై గడుపుతున్నారో ఈ యాప్‌‌ చెబుతుంది. ఫోన్‌ అన్‌లాక్‌ చేయగానే, స్క్రీన్‌పై కనిపించే వాచ్‌ తన పని మొదలెడుతుంది. లాక్‌ చేస్తే ఆగిపోతుంది. ఇలా వాచ్‌ నడిచే సమయం తగ్గించడమే మీ పని. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని రోజువారీగా ఫోన్‌వాడే సమయాన్ని తెలుసుకుంటూ తగ్గించుకుంటే సరి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని