6G Network: 6జీ సాంకేతికతతో మొబైల్‌ఫోన్లు ఉనికిని కోల్పోతాయా?

మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్రపంచంలో 5జీ సాంకేతికతను ఒక విప్లవంగా చెబుతుంటారు. భారత్‌లో ఈ నెట్‌వర్క్‌ సేవలు పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రాకముందే..6జీ సాంకేతికతపై చర్చ మొదలైంది...

Published : 02 Jun 2022 22:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్రపంచంలో 5జీ సాంకేతికతను ఒక విప్లవంగా చెబుతుంటారు. భారత్‌లో ఈ నెట్‌వర్క్‌ సేవలు పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రాకముందే.. 6జీ సాంకేతికతపై చర్చ మొదలైంది. 5జీ కన్నా 50 రెట్లు వేగంతో 6జీ నెట్‌వర్క్‌ ఉంటుందని టెక్‌ వర్గాలు తెలిపాయి. గత నెలలో జరిగిన ట్రాయ్‌ రజతోత్సవ కార్యక్రమంలో ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ టెలికాం నెట్‌వర్క్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో పలు టెలికాం నెట్‌వర్క్‌ కంపెనీలు 6జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో నోకియా కంపెనీ సీఈవో పెక్కా లుండ్‌బర్గ్ 6జీ నెట్‌వర్క్‌పై డబ్ల్యూఈఎఫ్‌ (వరల్డ్‌ ఎకానామిక్‌ ఫోరమ్‌)2022లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

6జీ సాంకేతికత మొబైల్‌పోన్లను యూజర్లకు అవసరంలేని వస్తువుగా మార్చేస్తుందని అన్నారు. అంతేకాకుండా 6జీ సేవలను ఉపయోగించుకునేందుకు ప్రత్యేకమైన ఇంటర్‌ఫేస్‌ అవసరంలేదని.. వాస్తవికత-డిజిటల్‌ సమ్మిళితంగా ఉండే ఈ సాంకేతికతలో మానవులే ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తారని తెలిపారు. అంటే ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌, గ్లాసెస్‌ వంటి డివైజ్‌లు మానవులు ధరించే దుస్తుల్లో లేదా చర్మానికి అతుక్కుని ఉండే బయో-ఇంప్లాట్‌ల రూపంలో అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. అలానే స్మార్ట్‌ డివైజ్‌లలోని సెన్సర్లు, మైక్రోఫోన్లు, కెమెరాల ద్వారా మనిషి భావోద్వేగాలను గుర్తించి తదనుగుణంగా అవి పనిచేస్తాయట.

ఈ ప్రక్రియలో ఎలాన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ ముందంజలో ఉంది. మనిషి బ్రెయిన్‌ను, మెషీన్‌ను అనుసంధానించే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా ఏఐ సాంకేతికతతో పనిచేసే కార్లు ఒకదానితో ఒకటి అనుసంధానమవడం, రహదారి పరిస్థితులకు అనుగుణంగా కార్లు స్వయంచాలిత నియంత్రణ వంటివి చూడొచ్చు. కార్యాలయాల్లో ఉద్యోగులు వేరే ప్రదేశంలో ఉండి హోలోగ్రాఫిక్‌ ప్రొజెక్షన్స్‌ ద్వారా బోర్డ్ రూమ్‌ సమావేశాల్లో పాల్గొనవచ్చు. మొత్తంగా 6జీ సాంకేతికత వాస్తవికతలో భ్రమింపజేసే డిజిటల్ ప్రపంచాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. 

భారత్‌లో మరి కొన్ని నెలల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మొబైల్‌ తయారీ కంపెనీలు తక్కువ ధరకే 5జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. భారత్‌ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మొబైల్‌ మార్కెట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మొబైల్‌ఫోన్‌ అవసరంలేని వస్తువుగా మారేందుకు మరింత సమయం పట్టే అవకాశం లేకపోలేదని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని