WhatsApp: ఈ ‘పింక్‌’ లింక్‌ మీకూ వచ్చిందా?

పొరపాటున పింక్‌ వాట్సాప్‌ లింక్‌ను క్లిక్‌ చేస్తే ఏం చేయాలి?

Updated : 17 Apr 2021 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వాట్సాప్‌ ఏం రంగులో ఉంటుంది అంటే... ఆకుపచ్చ రంగులో ఠక్కున సమాధానం వచ్చేస్తుంది.  అయితే కొన్నిసార్లు కొత్త రంగులో వాట్సాప్‌ వస్తోంది, వచ్చేసింది అంటూ కొన్ని లింక్‌లు కనిపిస్తూ ఉంటాయి. అవి నిజం కావు, వాట్సాప్‌కి వాటికీ సంబంధం లేదని గతంలో చాలామంది టెక్‌ నిపుణులు హెచ్చరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... మరో ఫేక్‌ లింక్‌ ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్‌ అవుతోంది కాబట్టి. అసలు ఏంటా లింక్‌.. ఎందుకు వస్తోంది?

ఫేక్‌ వాట్సాప్‌ లింక్‌లు మీకు కూడా గతంలో వచ్చుంటాయి. వాటిని క్లిక్‌ చేసి కొంతమంది ఇబ్బందులు పడి ఉంటారు. అలా ‘పింక్‌ వాట్సాప్‌’ (Pink Whatsapp) అంటూ ఓ లింక్‌ ఇటీవల వైరల్‌ అవుతోంది. అది అచ్చంగా వాట్సాప్‌ లింక్‌లానే ఉంటుంది  కానీ, వాట్సాప్‌కీ, దీనికీ సంబంధం ఏమీ ఉండదు. ఈ లింక్‌ను క్లిక్‌ చేస్తే మీ పేరు, మొబైల్‌ నెంబరు తదితర వివరాలు అడుగుతుంది. ఆ తర్వాత ఆ పేజీ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ ఉండదు. అయితే మీ సమాచారం మొత్తం అగంతుకుల చేతికి చేరిపోతుంది. 

పైన ఫొటోల్లో కనిపిస్తున్న తరహా లింకులే ఇప్పుడు వాట్సాప్‌లో సర్క్యులేట్‌ అవుతున్నాయి. ఈ లింకులు క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు మీకు అందుబాటులోకి వస్తాయని ఆ మెసేజ్‌లో రాశారు. మీకు కూడా అలాంటి లింక్‌ వచ్చి ఉంటే పొరపాటున కూడా క్లిక్‌ చేయొద్దు. ఈ లింక్‌ క్లిక్‌ చేశాక మీ ఫోన్‌ కాంటాక్ట్స్‌లో అందరికీ ఈ లింక్‌ సెండ్‌ అయిపోతుంది. ఆ వ్యక్తి ఆ లింక్‌ను క్లిక్‌ చేసేవరకు తరచుగా ఆ లింక్‌ వెళ్తూ ఉంటుంది. గ్రూపుల్లో కూడా మీకు తెలియకుండానే లింక్‌ తరచుగా పోస్ట్‌ అవుతూ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు డిలీట్‌ చేసినా మళ్లీ మళ్లీ వస్తుంటాయి.

కొత్త ఫీచర్లు ఎలా వస్తాయంటే...

కొత్త వాట్సాప్‌, సరికొత్త ఫీచర్లు అంటూ ఏవైనా వాట్సాప్‌ అందుబాటులోకి తెస్తే బహిరంగంగా ప్రకటిస్తుంది. సోషల్‌ మీడియా వేదికల ద్వారా, యాప్‌లో నోటిఫికేషన్‌ ద్వారా చెబుతుంది. అలాంటప్పుడు కూడా ప్లే స్టోర్‌/ యాప్‌ స్టోర్‌ ద్వారానే వినియోగదారులకు అప్‌డేట్‌ అందిస్తుంది. అప్పుడు యాప్‌ అప్‌డేట్‌ చేసుకుంటే మీకు వాట్సాప్‌ అందించే కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకానీ ఇలా లింక్‌ల ద్వారా, ఏపీకే ఫైల్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా అప్‌డేట్‌లు అందుబాటులోకి రావు.

ఇప్పటికే క్లిక్‌ చేసి ఉంటే...

ఫేక్‌ లింక్‌ను ఇప్పటికే క్లిక్‌ చేసి ఉంటే... వెంటనే మీ ఫోన్‌ను రీసెట్‌ చేయండి. దాని కోసం మొబైల్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో సిస్టమ్‌ ఆప్షన్‌లోకి వెళ్తే  రిసెట్‌ (Reset) అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే ఎరేజ్‌ ఆల్ డేటా  (Erase All Data) ఆప్షన్‌ వస్తుంది. దీన్ని క్లిక్‌ చేసి మొబైల్‌ను రీసెట్‌ చేయొచ్చు. దీంతోపాటు మీ మెయిల్‌ ఐడీ, బ్యాంకు ఖాతాలు, సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని