Twitter: యూజర్లందరికీ ట్వీట్ ఎడిట్‌ బటన్‌.. మస్క్‌ కొత్త ఆలోచన!

ట్విటర్‌ బ్లూ టిక్‌తోపాటు ఇతర ప్రయోజనాల కోసం యూజర్లు నెలవారీ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు మస్క్ స్పష్టం చేశారు. దీనిపై యూజర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక ఫీచర్‌ను యూజర్లు అందరికీ ఇవ్వాలని మస్క్ భావిస్తున్నారట. 

Published : 03 Nov 2022 22:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ (Twitter) యూజర్ల ఎదురుచూపులకు తెరదించుతూ ట్వీట్‌ ఎడిట్‌ బటన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ గత నెలలో ప్రకటించింది. కానీ, ఈ ఫీచర్‌ బ్లూ యూజర్లు (సబ్‌స్క్రిప్షన్‌) మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. తాజాగా యాజమాన్యంలో మార్పులు జరగడంతో మరోసారి ట్వీట్ ఎడిట్‌ బటన్‌ గురించి నెట్టింట చర్చ మొదలైంది. మరోవైపు, ట్విటర్‌ ఖాతాకు బ్లూటిక్‌తోపాటు, ఇతర ప్రయోజనాలు పొందాలంటే యూజర్లు నెలకు 8 డాలర్లు చెల్లించాలని ట్విటర్‌ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇప్పటికే  స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్వీట్ ఎడిట్‌ బటన్‌ను సబ్‌స్క్రైబర్స్‌తోపాటు సాధారణ యూజర్లకు కూడా ఇవ్వాలని మస్క్‌ భావిస్తున్నారట.

ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ట్వీట్‌ ఎడిట్‌ బటన్‌ కొన్ని దేశాల్లోని బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్‌ ట్వీట్ చేసిన 30 నిమిషాలకు వరకు ఎడిట్‌ చేయొచ్చు. ట్వీట్‌ను ఎడిట్‌ చేసిన తర్వాత ఎడిటెడ్‌ అనే లేబుల్‌ కూడా కనిపిస్తుంది. అయితే, ట్వీట్‌కు కేటాయించిన ఐడీ నెంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. యూజర్‌ ట్వీట్‌ను ఎడిట్‌ చేస్తే.. అది ట్వీట్‌ వాల్‌పై ముందు కనిపిస్తుంది.

ట్విటర్‌ నెలవారీ ఛార్జీల విషయంలో వెనక్కి తగ్గేదిలేదని ఎలాన్‌ మస్క్‌ స్పష్టం చేశారు. నెలవారీ రుసుము విషయంలో ప్రాంతాల వారీగా మార్పులు జరగొచ్చని ట్వీట్‌లో పేర్కొన్నారు. అదనపు ప్రయోజనాల్లో భాగంగా  రిప్లై, మెన్షన్‌, సెర్చ్‌ వంటి ఆప్షన్లను యూజర్లు ప్రాధాన్యక్రమంలో ఎంచుకోవచ్చు. ట్విటర్‌తో కలిసి పనిచేసే పబ్లిషర్స్‌కు పేవాల్‌ బైపాస్‌ ఉంటుందని తెలిపారు. దీనివల్ల ట్విటర్‌కు అదనపు ఆదాయం సమకూరుతుందని మస్క్‌ భావిస్తున్నారు.  పాపులర్‌ వ్యక్తులు, రాజకీయ నాయకుల పేర్ల కింద సెకండరీ ట్యాగ్ ఉంటుందని మస్క్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని