Starlink: డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్న మస్క్‌ కంపెనీ

భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల కోసం ముందస్తు బుకింగ్ చేసుకున్న యూజర్స్‌కు కంపెనీ డబ్బును తిరిగి చెల్లించనుంది. ఈ మేరకు మెయిల్ ద్వారా యూజర్స్‌కు సమాచారం అందించింది.

Updated : 05 Jan 2022 19:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఇంటర్నెట్‌ సేవల సంస్థ స్టార్‌లింక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్‌ సేవల కోసం ముందస్తు బుకింగ్ చేసుకున్న యూజర్స్‌కు డబ్బు వాపసు చేయనుంది. ఈ మేరకు ప్రీ-ఆర్డర్ చేసిన యూజర్లకు మెయిల్‌ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నట్లు పలువురు యూజర్స్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలకు సంబంధించి టెలికాం విభాగం (డీఓటీ) నుంచి ఇంకా అనుమతులు రాని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

గతేడాది నవంబరులో స్టార్‌లింక్‌ సేవలు భారత్‌లో పది లోక్‌సభ నియోజకవర్గాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు గతంలో ప్రకటించింది. ఇందుకోసం ప్రీ-ఆర్డర్స్‌ను కూడా ప్రారంభించింది. అయితే యూజర్స్ ప్రీ-ఆర్డర్స్‌కు సబ్‌స్క్రైబ్‌ చేస్తుండటంతో డీఓటీ ప్రకటన చేసింది. భారత్‌లో ఇంటర్నెట్‌ సేవల కోసం స్టార్‌లింక్‌ లైసెన్సులు పొందలేదని, యూజర్స్ ముందస్తు బుకింగ్స్‌ చేయొద్దని సూచించింది. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్‌ మెయిల్‌ చర్చనీయాంశమైంది. డీవోటీ నుంచి వచ్చే అనుమతులపై స్పష్టత లేకపోవడంతోపాటు, ఇతరత్రా కారణాల వల్ల ప్రీ-ఆర్డర్స్‌ చేసిన యూజర్స్‌కు డబ్బు తిరిగి చెల్లిస్తున్నట్లు స్టార్‌లింక్‌ మెయిల్‌లో పేర్కొంది. గతంలో జనవరి 31 కల్లా లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తామని స్టార్‌లింక్‌ ఇండియా డైరెక్టర్ సంజయ్‌ భార్గవ్ తెలిపారు. అలానే డిసెంబరు 2022 కల్లా భారత్‌లో 2లక్షల కనెక్షలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 5,000పైగా ప్రీ-ఆర్డర్స్‌ వచ్చినట్లు సమాచారం. ముందస్తు బుకింగ్ ధర 99 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 8,000. ఇప్పుడు ఈ మొత్తాన్నే స్టార్‌లింక్‌ యూజర్లకు తిరిగి చెల్లించనుంది. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని