క్రోమ్‌ బ్రౌజర్‌... ఇలా వాడి చూడండి

అత్యధికమంది వినియోగించే బ్రౌజర్లలో గూగుల్‌ క్రోమ్‌ ఒకటి. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ట్యాబ్స్‌ ఓపెన్‌ చేసుకుని బ్రౌజింగ్‌ చేయడం కొంతమందికి తేలికగా...

Updated : 30 Apr 2022 17:07 IST

క్రోమ్‌ బ్రౌజర్‌లో ఒకేసారి ఎక్కువ ట్యాబ్స్‌ ఓపెన్‌ చేసుకుని వాడుతుంటారు. అయితే దీని వల్ల బ్రౌజర్‌ స్లో అయిపోతుంది. అలా అని ప్రతిసారి అవసరమైన వెబ్‌సైట్‌/పేజీ ఓపెన్‌ చేయడం అంత సౌకర్యవంతంగా ఉండదు. క్రోమ్‌ బ్రౌజర్‌లో ట్యాబ్స్‌ను మేనేజ్‌ చేయడానికి కొన్ని ఎక్స్‌టెన్షన్స్‌ ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందామా..?


వాడని ట్యాబ్స్‌ను సస్పెండ్‌ చేస్తుంది... 


 

వరుసగా ట్యాబ్‌లు ఓపెన్‌ చేసుకుంటూ వెళ్లిపోయారు. కాసేపటికి ఓపెన్‌ చేసిన ట్యాబ్స్‌ వాడాల్సిన అవసరం ఉండదు. అవి ఆటోమేటిగ్గా పని చేయకుండా ఉండేలా చూడొచ్చు. దీని కోసం The Great Suspender ఎక్స్‌టెన్షన్‌ ఉంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే నిర్ణీత సమయం తర్వాత వినియోగంలో లేని ట్యాబ్స్‌‌ సస్పెండ్‌ అయిపోతాయి. దీని వల్ల బ్రౌజింగ్‌ వేగంగా సాగుతుంది. మళ్లీ కావాల్సినప్పుడు రిఫ్రెష్‌ చేసుకుంటే తిరిగి ఆ సైట్‌/పేజీ రిఫ్రెష్‌ అయ్యి కనిపిస్తుంది. అన్ని ట్యాబ్‌లను సస్పెండ్‌ చేయకుండా ఉండేందుకు ఎక్స్‌టెన్షన్‌ సెట్టింగ్స్‌లో మనకు కావాల్సిన వెబ్‌సైట్ల యూఆర్‌ఎల్స్‌ యాడ్‌ చేసుకోవచ్చు. అప్పుడు ఆ ట్యాబ్స్‌ రన్నింగ్‌లోనే ఉంటాయి. ఎంతసేపటికి పేజీ సస్పెండ్‌ అవ్వాలనేది యూజర్‌ సెట్‌ చేసుకోవచ్చు.  ఎక్స్‌టెన్షన్‌ యాడ్‌ చేసుకోవాలంటే.. THE GREAT SUSENDER క్లిక్‌ చేయండి


ఒకే జాబితాలో చూసుకోవచ్చు.. 

ఒక బ్రౌజర్‌ విండోలో పది ట్యాబ్స్‌ ఓపెన్‌ చేశారనుకుందాం. మరొక విండోలో ఇంకో పది ట్యాబ్స్‌ తెరిచారు. వీటన్నింటినీ ఒకేసారి మేనేజ్‌ చేయడం చాలా కష్టమైన పనే. దానికి మంచి పరిష్కారం TABLI. ఎన్ని విండోలైనా, ట్యాబ్స్‌ అయినా సరే ఒకే జాబితాలో చూపిస్తుంది. దాని వల్ల ఏదైనా ట్యాబ్‌ క్లోజ్‌ చేయాలనుకుంటే సులభంగా చేసేయొచ్చు. దీని వల్ల సమయంతోపాటు, అనవసర వెతుకులాట ఉండదు. అలానే ట్యాబ్‌ సేవ్‌ చేసుకోవడంతోపాటు రెస్టోర్‌ చేసుకునే ఫీచర్స్‌ ఎలానూ ఉన్నాయి. డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే TABLI క్లిక్‌ చేయండి


క్లోజ్‌ చేసిన ట్యాబ్స్ సులభంగా ఓపెన్‌


 

TABLI ఎక్స్‌టెన్షన్‌కు అడ్వాన్స్‌ ఫీచర్స్‌తో పనిచేసే ‘TABS OUTLINER’ ఎక్స్‌టెన్షన్‌ పనితీరు బాగుంటుంది. వేర్వేరు విండోస్‌లో ఎక్కువ సంఖ్యలో ట్యాబ్స్‌ను ఓపెన్‌ చేసి అప్పటికప్పుడు అవసరం లేకపోయిన వాటిని డిలీట్‌ చేసేయవచ్చు. ఎప్పుడో మళ్లీ దాని అవసరం వచ్చినప్పుడు ట్యాబ్‌ను మళ్లీ రెస్టోర్‌‌ చేసుకునే సౌలభ్యం ఈ ఎక్స్‌టెన్షన్‌లో ఉండటం విశేషం. ట్యాబ్‌ డిలీట్‌ అయినా సరే TABS OUTLINER ఎక్స్‌టెన్షన్‌ పాప్‌అప్‌లో ట్యాబ్‌ యూఆర్‌ఎల్‌ పోకుండా అలానే ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు ఓపెన్‌ చేసుకోవచ్చు. ఇక దానితో అవసరం లేదనుకుంటే అప్పుడు డిలీట్‌ చేసుకునే వెసులుబాటూ ఉంటుంది. డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే TABS OUTLINER క్లిక్‌ చేయండి


ఓవర్‌ ఫ్లో అడ్డుకునేలా.. 

బ్రౌజర్‌లో ఓ పాతిక ట్యాబ్స్‌ ఓపెన్‌ చేస్తే ఐకాన్ కూడా కనిపించదు. వాటిలో ఒకటి క్లోజ్‌ చేయాలంటే వెతకడం సులభం కాదు. దాని కోసం TooManyTabs ఎక్స్‌టెన్షన్‌ చక్కగా సరిపోతుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌లో ఓపెన్‌ చేసిన ట్యాబ్స్‌ అన్నీ ఒకదాని కింద మరొకటి ఉండి.. క్లోజ్‌‌ చేసేందుకు సులభంగా ఉంటుంది. ఎక్స్‌టెన్షన్‌ ఉపయోగించుకుని ట్యాబ్స్‌ను సరైన పద్ధతిలో నిర్వహించుకోవడంతోపాటు బ్రౌజింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. Quick Tab ఎక్స్‌టెన్షన్‌ కూడా ఇదే విధంగా పని చేస్తుంది. కాకపోతే అక్కడ పక్కపక్కన వచ్చే ట్యాబ్స్‌ ఇందులో హెడర్‌ పేరుతో ఒకదానికింద మరొకటి వస్తాయి. డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే TooManyTabs క్లిక్‌ చేయండి & Quick Tab క్లిక్‌ చేయండి


ట్యాబ్‌లు కనిపించకుండా...

బ్రౌజర్‌లో రకరకాల ట్యాబ్స్‌ ఓపెన్‌ చేశారు. వాటిని అందరూ చూడకుండా చేయాలంటే Tabs Hide Button ఎక్స్‌టెన్షన్‌ ఉపయోగపడుతుంది. రహస్యంగా ఉంచుకోవాల్సిన ట్యాబ్‌ను హైడ్‌ చేసి మళ్లీ కావాల్సినప్పుడు ఓపెన్‌ చేసుకోవచ్చు. దానికి పాస్‌వర్డ్‌ భద్రత పెట్టుకునే అవకాశం ఉంది. పొరపాటున హైడ్‌ చేసిన తర్వాత బ్రౌజర్‌ను క్లోజ్‌ చేస్తే ఎలా అనేగా అనుమానం..? అటువంటి పరిస్థితిలో ఈ ఎక్స్‌టెన్షన్‌తో క్లోజ్‌చేసిన ట్యాబ్స్‌ను కూడా తిరిగి వచ్చేలా చేయవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే Tabs Hide Button క్లిక్‌ చేయండి


డిలీట్‌ చేసిన ట్యాబ్స్‌ ఏంటో తెలుసుకోవచ్చు.. 

డిలీట్‌ చేసిన ట్యాబ్స్‌ను, యూజ్‌ చేస్తున్న ట్యాప్స్‌ను ఒకే విండోలో చూడగలగటం TabJump ఎక్స్‌టెన్షన్‌ ప్రత్యేకత. ఈ ఎక్స్‌టెన్షన్‌లో మూడు వరుసలు ఉంటాయి. అన్‌డూ, రిలేటెడ్‌, జంప్‌. Undo జాబితాలో తొలగించిన ట్యాబ్స్‌ ఉంటాయి. Related జాబితాలో ఒకే సైట్‌ను వేర్వేరు ట్యాబ్స్‌లో ఓపెన్ చేసి ఉంటే అక్కడ కనిపిస్తుంది. Jump లిస్ట్‌లో తరచూ ఉపయోగించిన ట్యాబ్స్‌ ఉంటాయి. Undo లిస్ట్‌లో మళ్లీ కావాల్సిన ట్యాబ్‌ను తిరిగి ఓపెన్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే TabJump క్లిక్‌ చేయండి


వేరే కంప్యూటర్‌లోనూ ఓపెన్‌ చేసుకోవచ్చు.. 

ఇంట్లో సిస్టమ్‌లో కాసేపు వర్క్‌ చేసుకున్నారు. అదే వర్క్‌ ఆఫీసులో చేయాలంటే ఇంటి సిస్టమ్‌లో ఓపెన్‌ చేసిన వెబ్‌సైట్లు గుర్తుంచుకోవాలి. లేదంటే ఆ లింక్స్‌ సేవ్‌ చేసి పెట్టుకోవాలి. ఈ ఇబ్బంది లేకుండా TabCloud ఎక్స్‌టెన్షన్ సహకరిస్తుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ను బ్రౌజర్‌లో యాడ్‌ చేసుకుని గూగుల్‌ ఖాతాతో లాగిన్‌ అవ్వాలి. అదే ఐడీతో వేరే సిస్టమ్‌ బ్రౌజర్‌లో లాగిన్‌ అయ్యి ఆ ట్యాబ్స్‌ను  గత సిస్టమ్‌లో బ్రౌజ్‌ చేసిన వెబ్‌సైట్ల వివరాలు పొందొచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే TabCloud క్లిక్‌ చేయండి


-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని