Facebook: ఫ్రెండ్స్‌ పోస్ట్‌లు మిస్‌ అవ్వకుండా ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్లు

ఫేస్‌బుక్‌లో స్నేహితులు పోస్ట్ చేసే కంటెంట్ మిస్‌ అవ్వకుండా మెటా సంస్థ రెండు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఈ ఫీచర్లతో యూజర్లకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో చూద్దాం. 

Published : 23 Jul 2022 11:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో రోజూ ఎంతో సమాచారం అప్‌లోడ్‌ అవుతుంటుంది. అలా అప్‌లోడ్‌ అయ్యే కంటెంట్‌ మొత్తం చూడటం లేదా చదవడం సాధ్యంకాదు. కొన్నిసార్లు మన స్నేహితులు పోస్ట్‌ చేసే కంటెంట్‌ను సైతం మిస్ అవుతుంటాం. ఇకపై ముఖ్యమైన పోస్ట్‌లు మిస్‌ అవ్వకుండా ఫేస్‌బుక్‌ రెండు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. హోమ్‌, ఫీడ్‌ అనే రెండు ఫీచర్లతో యూజర్లు తమకు నచ్చిన కంటెంట్‌ను ముందుగా చూడొచ్చు.

గతంలో ఫేస్‌బుక్‌ ( Facebook) యాప్‌ ఓపెన్‌ చేసి హోమ్‌ (Home) బటన్‌ క్లిక్ చేసి పోస్ట్‌లను కిందకు స్క్రోల్‌ చేస్తూ వెళితే మధ్యలో రీల్స్‌ (Reels) కనిపించేవి. దీంతో ఫేస్‌బుక్‌ తమను బలవంతంగా వాటిని చూసేట్లు చేస్తుందని పలువురు యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోస్ట్‌ల మధ్యలో రీల్స్ ఫీచర్‌ వల్ల కంటెంట్ మిస్‌ అవుతున్నామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఫేస్‌బుక్‌లోని అల్గారిథమ్‌ ఆధారంగా జరిగే ప్రక్రియని ఫేస్‌బుక్ తెలిపింది. తాజాగా ఇందులో మార్పులు చేసింది.

ఫేస్‌బుక్ హోమ్‌లోనే స్టోరీస్‌ (Stories), రీల్స్‌ (Reels) కోసం ప్రత్యేకంగా ట్యాబ్స్‌ను పరిచయం చేసింది. దీంతో రీల్స్‌ చూడాలనుకున్న యూజర్‌ ఆ సెక్షన్‌పై క్లిక్ చేస్తే పూర్తిగా అవే కనిపిస్తాయి. అలానే స్టోరీస్‌ను కూడా చూడొచ్చు. ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ పోస్ట్‌ చేసే కంటెంట్‌ను ప్రత్యేకంగా చూసేందుకు ఫీడ్‌ (Feed) అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాప్‌ ఓపెన్‌ చేసిన వెంటనే నోటిఫికేషన్‌ సెక్షన్‌ పక్కనే ఫీడ్‌ అనే సెక్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆల్, ఫేవరెట్స్‌, ఫ్రెండ్స్‌, గ్రూప్స్‌, పేజెస్‌ అనే సెక్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా సెక్షన్‌పై క్లిక్ చేసి యూజర్‌ తనకు నచ్చిన కంటెంట్‌ను చూడొచ్చు. 

‘‘ఫేస్‌బుక్‌ యూజర్ల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి వారి ఇష్టాలకనుగుణంగా కొత్త ఫీచర్లను పరిచయం చేశాం. ఈ మార్పులతో యూజర్లు ఇకపై తమ స్నేహితుల పోస్ట్‌లను మిస్‌ కాకుండా చూడగలరు’’ అని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఇటీవలి కాలంలో టిక్‌టాక్‌ (TikTok) నుంచి ఫేస్‌బుక్‌కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. షార్ట్‌ వీడియోలు చేసేందుకు టిక్‌టాక్‌ అనుకూలంగా ఉండటంతో యువత దానివైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)ను యువతకు మరింత చేరువ చేయాలని మెటా (Meta) సంస్థ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. త్వరలోనే ఫేస్‌బుక్‌ ఒకే ఖాతాతో ఐదు ప్రొఫైల్స్‌ ఏర్పాటు చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇన్‌స్టాగ్రామ్‌ కూడా మ్యాప్స్‌తోపాటు వీడియోలను రీల్స్‌గా మార్చే ఫీచర్‌ను తీసుకొచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని