Facebook: ఎఫ్‌బీ స్మార్ట్‌ వాచ్‌ వస్తోందట

రెండు కెమెరాలతో స్మార్ట్‌ వాచ్‌ తీసుకొస్తున్న ఫేస్‌బుక్‌

Updated : 11 Jun 2021 14:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ వాచ్‌ల రంగంలోకి ఫేస్‌బుక్‌ రాబోతోందా? కెమెరా ఆప్షన్లతో స్మార్ట్‌ వాచ్‌ను తీసుకురాబోతోందా? టెక్‌ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ. అత్యాధునిక ఆప్షన్లతో ఫేస్‌బుక్‌ ఓ స్మార్ట్‌వాచ్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందట. అన్నీ కుదిరితే వచ్చే వేసవిలో ఈ వాచ్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తుందని సమాచారం. ఈ వాచ్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు అంతర్జాలంలో షికార్లు చేస్తున్నాయి. వాటి ప్రకారం ఈ వాచ్‌ ఎలా ఉంటుందో చూద్దాం!

సాధారణ స్మార్ట్‌ వాచ్‌ల తరహాలోనే ఫేస్‌బుక్‌ స్మార్ట్‌ వాచ్‌ స్క్రీన్‌ ఉండబోతోంది. అయితే ఇందులో అదనంగా ఒక కెమెరా ఉంటుంది. దీంతో వీడియో కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. వాచ్‌ వెనుకవైపు మరో కెమెరా ఉంటుంది. ఇది 1080పీ ఆటో ఫోకస్‌ కెమెరా అంట. వీడియో రికార్డు చేయాలంటే వాచ్‌ను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫ్రేమ్‌ నుంచి తీసి వాడుకోవచ్చు. అంతేకాదు ఆ వీడియోలను ఫేస్‌బుక్‌ సంబంధించిన యాప్స్‌కు నేరుగా షేర్‌ చేయొచ్చట. 

ఈ వాచ్‌లో ఎల్‌టీఈ కనెక్టివిటీ ఏర్పాటు చేసేలా ఫేస్‌బుక్‌ ప్రయత్నాలు చేస్తోందట. తొలుతగా ఈ ఫీచర్‌ను అమెరికాలోనే తీసుకొస్తారట. ఆ తర్వాత మిగిలిన దేశాల్లో అందుబాటులోకి తెస్తారు. ఎల్‌టీఈ ఫీచర్‌ వల్ల స్మార్ట్‌వాచ్‌ను వేరే స్మార్ట్‌ఫోన్‌కు పెయిర్‌ చేయకుండానే వాడుకోవచ్చు. దీంతోపాటు అన్ని స్మార్ట్‌ వాచ్‌ల్లో ఉన్న కీలకమైన ఫీచర్లను ఫేస్‌బుక్‌ స్మార్ట్‌వాచ్‌లో కొనసాగిస్తారు. 2022 వేసవి కాలంలో అందుబాటులోకి వస్తుందంటున్న ఈ వాచ్‌ ధరను 400 డాలర్లుగా నిర్ణయించారని సమాచారం. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు ₹29 వేలు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని