Facebook: ఇకపై యూజర్‌ ప్రొఫైల్‌లో ఆ వివరాలకు ఫేస్‌బుక్‌ గుడ్‌బై!

ఫేస్‌బుక్‌ ఖాతా నిబంధనలకు సంబంధించి మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాటి గురించి యూజర్లు తెలియజేయాల్సిన అవసంరలేదని తెలిపింది. ఇంతకీ ఏంటా వివరాలు? ఎప్పట్నుంచి అమలు కానున్నాయో చూద్దాం. 

Updated : 19 Nov 2022 12:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచేందుకు కొన్ని వివరాలు సమర్పించాలి. ఇందులో పేరు, వయసు, చిరునామా, మతం వంటి వాటితోపాటు అభిరుచులు, ఇష్టమైన ప్రాంతాలు, వంటకాలు, పుస్తకాలు, సినిమాలు అంటూ చాలా పెద్ద జాబితా ఉంటుంది. దీంతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచేప్పుడు యూజర్లు వాటిని నింపేందుకు గంటలకొద్దీ సమయం వృథా అవడంతోపాటు, విసుగు తెప్పిస్తోందట. దీంతో కొన్ని కాలమ్స్‌ను తొలగించాలని ఫేస్‌బుక్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా యూజర్‌ ప్రొఫైల్‌లో మతపరమైన, రాజకీయపరమైన అభిప్రాయాలతోపాటు చిరునామా, జెండర్‌ వంటి వివరాలను ఇకపై తెలియజేయాల్సిన అవసరంలేదు. ఇప్పటికే ఈ వివరాలను సమర్పించిన యూజర్లకు ఫేస్‌బుక్‌ ప్రత్యేకంగా నోటిఫికేషన్లు పంపుతోంది. ఇకపై ఈ నాలుగు వివరాలు కనిపించవని, కొత్తగా ఖాతా తెరిచేవారు వీటి గురించి తెలియజేయాల్సిన అవసరంలేదని చెబుతోంది. 

‘‘ఫేస్‌బుక్‌ను యూజర్‌  ఫ్రెండ్లీగా మార్చేందుకు కొన్ని కాలమ్స్‌ను తొలగించాలని నిర్ణయించాం. యూజర్‌ ఇకపై మతపరమైన, రాజకీయపరమైన అభిప్రాయాలతోపాటు, అడ్రస్‌, జెండర్‌ వివరాలను పూర్తి చేయాల్సిన అవసరంలేదు. దీనివల్ల యూజర్లు తమ సమాచారాన్ని ఇతరులతో షేర్‌ చేసేటప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు. ఈ నిబంధన డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది’’ అని మెటా అధికార ప్రతినిధి వెల్లడించారు. కానీ, ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయం వెనుక వేరే కారణం ఉందని తెలుస్తోంది.  కొంతమంది మత, రాజకీయ వివరాల ఆధారంగా ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారనే ఫిర్యాదులతో వీటిని తొలగిస్తున్నారని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు