ఆన్‌లైన్‌ మాంసం.. భలే

మాంసాహారం ఇష్టపడే వాళ్లు వారంలో కనీసం మూడు,నాలుగుసార్లు అలాంటి భోజనమే చేస్తుంటారు. చికెన్‌ ఫ్రై, మటన్‌ కర్రీ, చేపల పులుసు, రొయ్యల కూర అంటూ ఎన్ని రకాల వంటకాలు ఉంటాయో అన్నింటిని తరచూ ఆస్వాదిస్తుంటారు. కానీ కరోనా మహమ్మారి మాంసాహార ప్రియులకు

Updated : 28 Sep 2022 16:08 IST

మాంసాహారం ఇష్టపడే వాళ్లు వారంలో కనీసం మూడు, నాలుగుసార్లు అయినా అలాంటి భోజనమే చేస్తుంటారు. చికెన్‌ ఫ్రై, మటన్‌ కర్రీ, చేపల పులుసు, రొయ్యల కూర అంటూ ఎన్ని రకాల వంటకాలు ఉంటాయో అన్నింటిని తరచూ ఆస్వాదిస్తుంటారు. కానీ కరోనా మహమ్మారి మాంసాహార ప్రియులకు కాస్త గడ్డుకాలమే తెచ్చిపెట్టింది. ఇది వరకు మాంసం తినాలనిపించడమే లేటు.. వెంటనే మాంసం విక్రేయ దుకాణాలకు వెళ్లిపోయేవారు. కానీ ఈ కరోనా కాలంలో అక్కడికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ‘మాంసం విక్రేయ దుకాణంలో శుభ్రత ఉండదు, అక్కడికి ఎంతో మంది వస్తూపోతూ ఉంటారు. వారిలో ఎవరికైనా కరోనా వస్తే?.. దుకాణాదారుకే  కరోనా ఉంటే? తద్వారా మాకూ రావొచ్చు. అయ్యా బాబోయ్‌.. అంత రిస్క్‌ చేయలేం’’అని చాలా మంది మాంసాహారం తినడం మానేస్తున్నారు. అయితే ఇలాంటి వారి భయాన్ని పొగొట్టి ఇంటి వద్దకే సురక్షితమైన, తాజా మాంసాన్ని తెచ్చి ఇచ్చేందుకు కొన్ని యాప్స్‌ ఉన్నాయి. కొన్నాళ్ల కిందటే ఈ యాప్స్‌ పలు పట్టణాల్లో అందుబాటులోకి వచ్చినా కరోనా కాలంలో బాగా పాపులర్‌ అయ్యాయి. మరి ఆ యాప్స్‌ ఏవో ఓ సారి చూద్దాం..


లీషియస్‌

ప్లేస్టోర్‌.. యాపిల్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌.. తాజా మాంసాన్ని ఆర్డర్‌ చేసిన రెండు గంటల్లోగా మీకు డెలవరీ చేస్తోంది. మాంసం కట్‌ చేసి, ప్యాక్‌ చేసి డెలవరీ ఇచ్చే క్రమంలో ఎక్కడా మనిషి చేతులు తగలవట. డబ్ల్యూహెచ్‌వో నిబంధనలను అనుసరించి ‘లీషియస్‌’ కార్యాకలాపాలను కొనసాగిస్తోంది. మీరు కొనుగోలు చేసిన మాంసం ధరకే చెల్లింపులు చేస్తే సరిపోతుంది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా హోం డెలవరీ చేస్తారట. ప్రస్తుతం ఈ యాప్‌ సేవలు హైదరాబాద్‌ సహా బెంగళూరు, ఎన్‌సీఆర్‌, ఛండీగఢ్‌, పంచకుల, మోహాలి, ముంబయి, పుణె, చెన్నై నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ను బెంగళూరు కేంద్రంగా 2015లో ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఎక్కువ ప్రాచూర్యంలోకి వచ్చింది. లీషియస్‌కు బ్లాగ్ కూడా ఉంది. దీంట్లో మాంసంతో చేసే వంటకాల రెసిపీలు ఉన్నాయి. 


ఫ్రెష్‌ టు హోం

ఈ యాప్‌ కూడా బెంగళూరు కేంద్రంగా 2015లో అందుబాటులోకి వచ్చింది. అతి తక్కువ సమయంలోనే రూ. 200 కోట్లకు పైగా టర్నోవర్‌తో ఈ యాప్‌ సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. చికెన్‌, మటన్‌, ఫిష్‌ తదితర మాంసాలను సరసమైన ధరలకే హోం డెలవరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘ఫ్రెష్‌ టు హోం’యాప్‌ సేవలు బెంగళూరు, హైదరాబాద్‌సహా పలు ముఖ్య పట్టణాలు.. అరబ్‌ దేశాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. కొవిడ్‌ కారణంగా ఈ యాప్‌ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శుభ్రమైన, తాజా మాంసాన్ని అందిస్తోంది.


టెండర్‌ కట్స్‌

చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘టెండర్‌ కట్స్‌’ యాప్‌ను 2015 ప్రారంభంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌ ద్వారా నాణ్యమైన, పరిశుభ్రమైన, తాజా మాంసాన్ని కస్టమర్లకు అందిస్తున్నారు. అంతేకాదు.. కోరుకుంటే మాంసానికి మసాలా దట్టించి రెడీ టు కుక్‌గా కూడా డెలవరీ చేస్తారట. అలాగే మీరు మాంసాన్ని ఏలా వండాలనుకుంటారో తెలియజేస్తే ఆ వంటకానికి తగ్గట్టుగా కట్‌ చేసి ఇస్తారట. వారాంతంలో మాంసంపై ఆఫర్లు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ యాప్‌ సేవలు చెన్నై.. హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉన్నాయి. 


మస్తాన్‌

హైదరాబాద్‌ కేంద్రంగా ‘మస్తాన్‌’ యాప్‌ పరిశుభ్రమైన, నాణ్యమైన, తాజా మాంసం డెలవరీ చేస్తోంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ సహా విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లోనూ ఈ యాప్‌ తమ సేవలను అందిస్తోంది. విశేషమేమిటంటే.. ‘మస్తాన్‌’ యాప్ ద్వారా తెప్పించుకున్న మాంసంతో చేసిన వంటను యాప్‌లో లేదా వాట్సాప్‌లో పంపిస్తే ఆ వంటకాన్ని ‘మస్తాన్‌’ తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేస్తోంది. కేవలం రెండు నగరాల్లో సేవలందిస్తోన్న ఈ యాప్‌ను లక్ష మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకోవడం మరో విశేషం.


బిగ్‌ బాస్కెట్‌, డుంజో, స్విగ్గీ‌

నిత్యవసర సరకులు, ఔషధాలు, కురగాయలు వంటి అన్ని రకాల వస్తువులను హోం డెలవరీ చేస్తోన్న బిగ్‌ బాస్కెట్‌.. డుంజోతోపాటు, ఫుడ్‌ డెలవరీ యాప్‌ స్విగ్గీ కూడా మాంసాన్ని డెలవరీ చేస్తోంది. యాప్స్‌లో వీటికి ప్రత్యేక కేటగిరి ఉంటుంది. వాటిలో మీకు ఏ మాంసం కావాలో ఎంచుకుంటే వాటిని వెంటనే హోం డెలవరీ చేసేస్తున్నాయి. డుంజో యాప్‌ 24/7 సేవలు అందించడం విశేషం. ఈ యాప్స్‌తోపాటు.. కరోనా సంక్షోభంలో అవకాశాన్ని అందిపుచ్చుకొని మరికొన్ని మాంసం హోం డెలవరీ చేసే యాప్స్‌, వెబ్‌సైట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. 


ఎవ్రీడే మీట్‌

హైదరాబాద్‌లో ఎక్కడ ఆర్డర్‌ చేసినా 45 నిమిషాల్లో మాంసాన్ని హోం డెలవరీ చేస్తోంది ఎవ్రీడే యాప్‌. చికెన్‌, మటన్‌, సీఫుడ్‌, బీఫ్‌ ఎలాంటి మాంసమైనా తాజాగా అందిస్తోంది. మాంసాన్ని ఏ విధంగా కట్‌ చేయాలో తెలిపే ఫొటోలు యాప్‌లో ఉంటాయి. కావాల్సినట్టుగా మనం వాటిలోంచి సెలెక్ట్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ యాప్‌ కార్యాకలాపాలు జరుపుతోంది.


హిబాచి

హిబాచి.. కేవలం మాంసాన్ని మాత్రమే డెలవరీ చేసే మరో యాప్‌. ఆర్డర్‌ చేసిన 90 నిమిషాల్లో కస్టమర్‌కి అందజేస్తారట. యాప్‌తోపాటు వెబ్‌సైట్‌లోకూడా ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఇందులో రోజు వారీ ఆఫర్లు ఉండటం విశేషం. ఎప్పుటికప్పుడు వినూత్న ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఓన్లీ మీట్‌.ఇన్‌

మాంసం డెలవరీ చేసే ఓన్లీ మీట్‌‌... యాప్, వెబ్‌సైట్‌ రూపంలో అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లోని కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీలో మాత్రమే ప్రస్తుతం ఓన్లీ మీట్‌ సేవలందిస్తోంది. త్వరలో హైదరాబాద్‌ మొత్తం విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌ కాకుండా బెంగళూరు, చెన్నై, వంటి పలు నగరాల్లోనూ ఓన్లీ మీట్‌ యాప్‌‌ సేవలున్నాయి. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని చేసే తొలి ఆర్డర్‌కు ఆరు గుడ్లు ఉచితంగా ఇస్తోంది.


హలాల్‌ జిబా

హలాల్‌ జిబా కూడా యాప్‌, వెబ్‌సైట్‌ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. దీనిలో పచ్చి మాంసమే కాదు.. కోరుకుంటే మసాలా దట్టించి రెడీ టు కుక్‌గా కూడా మాంసాన్ని డెలవరీ చేస్తారు. ఈ వెబ్‌సైట్‌లో మాంసంతో చేసే వంటకాల రెసిపీలు కూడా ఉన్నాయి. 


మీట్‌ సర్కిల్‌

మీట్‌ సర్కిల్‌ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేసిన 40 నిమిషాల్లో మాంసాన్ని డెలవరీ చేస్తారు. అయితే ఆర్డర్‌ చేసినవారిలో ప్రతి ఐదో కస్టమర్‌కి రూ. 300 తగ్గింపు ఇస్తున్నారు. ఈ ఆఫర్‌ కేవలం రూ.1500 విలువ చేసే మాంసం కొనుగోలు చేసిన వారికే వర్తిస్తుంది. అలాగే ఆఫర్‌ కోడ్స్‌ వాడితే ధర 50 శాతం తగ్గే అవకాశం పొందొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ సంస్థ సేవలు అందుబాటులో ఉన్నాయి.


లజీజ్‌ ఈట్స్‌

లజీజ్‌ ఈట్స్‌.. ఈ సంస్థ కూడా అన్ని రకాల మాంసాన్ని డెలవరీ చేయడమే కాదు.. క్యాటరింగ్‌ ఆర్డర్స్‌ కూడా తీసుకుంటుంది. 40 మంది, 100 మందికి సరిపడ చికెన్‌, మటన్‌ బిర్యానీ వండి హోం డెలవరీ చేస్తుందట. వీటితోపాటు వంటింటి నిత్యావసర సరకులు డెలవరీ చేస్తోంది. యాప్‌/ వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ చేసుకోవచ్చు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని