ఇంకా షేరిట్‌ వాడుతున్నారా..జాగ్రత్త! 

మీరు షేరిట్ యాప్ వాడుతున్నారా..అయితే వెంటనే యాప్‌ని డిలీట్ చేయండి. ఎందుకంటే ఈ యాప్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసి యూజర్‌ డేటా తస్కరిస్తున్నారని ట్రెండ్ మైక్రో అనే ఐటీ సెక్యూరిటీ కంపెనీ తెలిపింది.... 

Published : 18 Feb 2021 21:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఫైల్‌ షేరింగ్‌కు ఉపయోగించే షేరిట్ యాప్‌ను ఇంకా వాడుతున్నారా? అయితే వెంటనే యాప్‌ని డిలీట్ చేయండి. ఎందుకంటే ఈ యాప్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసి యూజర్‌ డేటాను తస్కరిస్తున్నారని ట్రెండ్ మైక్రో అనే ఐటీ సెక్యూరిటీ కంపెనీ తెలిపింది. షేరిట్ యాప్‌లోని పర్మిషన్ ఫీచర్ ద్వారా రిమోట్ కోడ్ ఎక్సిక్యూషన్ అనే మాల్‌వేర్ కోడ్‌ను ఫోన్లలోకి పంపి వాటిని హ్యాకర్స్ తమ అధీనంలోకి తీసుకుంటున్నారట. తర్వాత వారికి అవసరమైన కమాండ్ రన్ చేసి డేటా చోరీ చేస్తున్నారని ట్రెండ్ మైక్రో వెల్లడించింది. గతంలో పలుమార్లు షేరిట్ యాప్‌పై ఇలానే హ్యాకర్స్‌ దాడి చేసి యూజర్స్ డేటా దొంగిలించినట్లు సదరు సంస్థ తెలిపింది. 

ప్రస్తుతం ఈ సమస్య ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో మాత్రమే గుర్తించారట. ఐఓఎస్‌ యూజర్స్‌కి ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా షేరిట్ కొత్త అప్‌డేట్‌ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. టెక్‌ నిపుణులు మాత్రం యూజర్స్‌ తమ ఫోన్లలో షేరిట్ యాప్‌ను డిలీట్ చేసి ప్రత్యామ్నాయ యాప్‌లను వాడుకోవాలని సూచిస్తున్నారు. అయితే, గతేడాది చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా షేరిట్‌ సహా ఆ దేశానికి చెందిన 100కు పైగా యాప్‌లను కేంద్రం నిషేధించింది. నిషేధం కంటే ముందే ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్స్‌ తక్షణం షేరిట్ యాప్‌ను తమ ఫోన్లలోంచి తొలగించాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని