రివ్యూ: ‘ఫౌ-జీ’ గేమ్‌

‘ఫౌ-జీ’ మొబైల్‌ వార్‌ గేమ్‌ ఎలా డౌన్లోడ్‌ చేయాలి..ఎలా ఆడాలి.. ఎలాఉందంటే?

Updated : 14 Sep 2023 16:28 IST

ఓ మొబైల్‌ గేమ్‌ లాంచ్‌ అవుతోందంటే పెద్ద విషయం కాదు. కానీ ‘పబ్‌జీ’కీ పోటీగా ఓ గేమ్‌ తీసుకొస్తున్నారంటూ ప్రచారం జరిగిందంటే... ఆ గేమ్‌ విడుదల పెద్ద విషయమనే చెప్పాలి. పబ్‌జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించాక... చాలామంది సరైన యాక్షన్‌ గేమ్‌ లేక ఢీలా పడిపోయారు. అలాంటి సమయంలో మన దేశ సైన్యాన్ని ప్రతిబింబించేలా ఓ గేమ్‌ను రూపొందిస్తున్నారని తెలిసింది. అదే ‘ఫౌ-జీ’. బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నేతృత్వంలో రూపొందిన ఈ గేమ్‌ ఈ రోజు అందరికీ అందుబాటులోకి వచ్చింది. మరి గేమ్‌ ఎలా ఉంది? దాని సంగతేంటో చూద్దాం!

‘ఫౌ-జీ’ గేమ్‌లో మూడు రకాల మోడ్స్‌ ఉన్నాయి. క్యాంపెయిన్‌, టీమ్‌ డెత్‌ మ్యాచ్‌, ఫ్రీ ఫర్‌ ఆల్‌ అనే మూడు మోడ్స్‌ కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం క్యాంపెయిన్‌ మోడ్‌ ఒక్కటే అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన మోడ్స్‌ త్వరలో అప్‌డేట్స్‌ రూపంలో తీసుకొస్తారట. గేమ్‌ స్టార్ట్‌ చేసినప్పుడు గ్రాఫిక్స్‌ మీడియంలో ఉంటున్నాయి.అవసరమైతే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు. పబ్‌జీ స్టయిల్‌లో ఇతర ప్లేయర్స్‌ ఇందులో వ్యక్తులు కాదు. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ)తో పని చేసే కంప్యూటర్‌ బొమ్మలన్నమాట. మన సైనికుడిలా వాటిని ఎవరూ హ్యాండిల్‌ చేయరు. మెకానికల్‌గా పని చేస్తుంటాయి. 

తొలుత ఒకరిద్దరు...

గేమ్‌ స్టార్ట్‌ అయ్యేటప్పుడు పబ్‌జీ స్టయిల్‌లోనే ఇందులో కూడా చేతిలో ఎలాంటి ఆయుధాలు ఉండవు. ఏఐ శత్రుమూకల్ని హతమారుస్తూ వారి దగ్గరున్న ఆయుధాల్ని తీసుకోవాలి. తొలి రౌండ్స్‌లో శత్రుమూకల చేతులో కత్తులు మాత్రమే ఉంటున్నాయి. దీంతో మనకు అవే అందుబాటులో ఉంటాయి. అందులో ఒక కత్తి ‘సింహాద్రి’లో ఎన్టీఆర్‌ పట్టుకున్న కత్తిలా ఉంటుంది. తర్వాతి రౌండ్స్‌లో గన్స్‌లో ఉన్నాయేమో చూడాలి. గేమ్‌ స్టార్ట్‌ అయినప్పడు మొదటి రెండు రౌండ్లు చాలా సులభంగా ఉంటాయి.  ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌తో పని చేసే శత్రు సైనికులు ఒక్కొక్కరిగా ఎదురుపడి దాడి చేస్తుంటారు. దీంతో పెద్ద మజా అనిపించదు. అయితే స్టేజీలు పెరిగే కొద్దీ గేమ్‌లో కష్టం పెరుగుతూ వస్తుంది. ఏఐ మూకలు ఒకేసారి మీదపడతాయి. అయితే కొన్నిసార్లు దాడి చేసేటప్పుడు లాగ్‌ కనిపిస్తోంది. శత్రు సైనికులు చుట్టుముట్టినప్పుడు మన సైనికుడు సరిగా కనిపించడం లేదు. 

అప్పటివరకు పిడిగుద్దులే... 

పబ్‌జీ ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని పెంచుకొని... గేమ్‌లో కొనసాగడానికి డ్రింక్స్‌ లాంటివి ఉంటాయి. ఇందులో అలాంటి ఆప్షన్‌ లేదు. అక్కడక్కడ ఉన్న క్యాంప్‌ ఫైర్స్‌ దగ్గర కూర్చొని చలి కాచుకుంటే అప్పుడు ఎనర్జీ బూస్టింగ్‌ అవుతుంది. మరోవైపు ఆయుధాల పవర్‌ కూడా తక్కువగా ఉంటోంది. ఒక్కో కత్తి గరిష్ఠంగా 10-15 దెబ్బలకు మాత్రమే పని చేస్తోంది. దీంతో పిడిగుద్దులే దిక్కుగా మారుతాయి. దీంతో మూడో రౌండ్‌ దాటడం సాధారణ ప్లేయర్స్‌కు కష్టమవుతుంది. మరోవైపు ఆయుధాలు కేవలం శత్రు మూకల దగ్గరే ఉండటంతో ట్రెజర్‌ హంట్‌ చేసిన ఫీలింగ్‌ కూడా కలగదు. పబ్‌జీ, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ, ఫ్రీ ఫైర్‌ లాంటి గేమ్స్‌లో ఇదో ఎంటర్‌టైనింగ్‌ టాపిక్‌. తొలి రౌండ్‌లో 30 నిమిషాల టైమర్‌తో మొదలవుతుంది. ఇందులో నాలుగు స్టేజీలు ఉంటాయి. ఏ స్టేజీలో ఎంతవరకు వచ్చామనేది పైన బార్‌లో చూపిస్తుంటుంది.  

సినిమాటిక్‌ సీన్స్‌... 

వార్‌ గేమ్స్‌ అంటే.. ఒకసారి ప్లే బటన్‌ నొక్కాక... మళ్లీ పాజ్‌ ఉండదు. అలాంటప్పుడే లైవ్‌ గేమ్‌ ఆడిన అనుభూతి కలుగుతుంది. చాలా వార్‌ గేమ్స్‌ అలానే ఉన్నాయి. అయితే ఇందులో గేమ్‌ను పాజ్‌ చేసుకోవచ్చు. ఇది వార్‌ గేమ్‌ ప్లేయర్స్‌కు అంతగా రుచించదు. అలాగే శత్రు మూక సైన్యానికి ఎంత ఆయుష్షు ఉందనేది ఎక్కడా చూపించదు. అలా వరుసగా దెబ్బలు కొడితే ఓ క్షణంలో కుప్పకూలిపోతాడు. ఇక్కడ సినిమాటిక్ ఫైట్ సీన్స్‌ రిఫరెన్స్‌లు కనిపిస్తాయి. ప్రస్తుతానికైతే గేమ్‌... గల్వాన్‌ లోయ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో కేవలం పిడిగుద్దులు, కత్తులు తప్ప గన్స్‌ ఉండవు. దీంతో అంతగా ఆసక్తిగా అనిపించదు. మిగిలిన రెండు మోడ్స్‌ ఓపెన్‌ అయితే ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు. 

పబ్‌జీకి పోటీ అంటూ ప్రచారం జరిగింది కాబట్టి... ఈ గేమ్‌ మీద భారీ అంచనాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాంపెయిన్‌ మోడ్‌తో ఈ గేమ్‌ పబ్‌జీ ప్రేమికుల అంచనాలను అందుకోలేదు. మిగిలిన రెండు మోడ్స్‌ ఆన్‌ అయితే... ఏమైనా మార్పు ఉండొచ్చు. మొబైల్ గేమ్స్‌ ఆడే చిన్నారులతో ఈ గేమ్‌ ఆడించి... ‘గల్వాన్‌’ ఘటన గురించి, ఆ సందర్భంలో మన సైనికుల వీరోచిత పోరాటం గురించి చెప్పడానికి ఈ గేమ్‌ ఉపయుక్తంగా ఉంటుంది. మన సైనికుడు వీరమరణం పొందినప్పుడు ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ ప్రాణాలు విడవటం కనిపిస్తుంది. దేశభక్తిని పెంపొందిస్తూ, వార్‌ గేమ్స్‌ ఆడించాలంటే ‘ఫౌ-జీ’ ట్రై చేయొచ్చు. 

డౌన్‌లోడ్‌ ఇలా...

‘ఫౌ-జీ’ గేమ్‌కు సంబంధించి కొన్ని రోజుల క్రితమే ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌ కోసం ప్లేస్టోర్‌ స్టోర్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రారంభించారు. పెద్దఎత్తున నెటిజన్లు గేమ్‌ కోసం రిజిస్టర్‌ చేసుకున్నారు. ఈ రోజు ఉదయం అందరికీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని