CES 2022: విశ్వవేడుకలో మెరిసిన ఐదు అద్భుతాలు..!

సీఈఎస్‌-2022 వేదికగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అద్భుత ఆవిష్కరణల జాబితా మీ కోసం.. 

Published : 07 Jan 2022 22:03 IST

ప్రపంచ అతిపెద్ద టెక్‌ పండుగ (CES-2022) ఎప్పటిలాగే మరో సరికొత్త టెక్నాలజీ యుగానికి నాంది పలికింది. అమెరికాలోని లాస్‌ వెగాస్‌ వేదికగా జనవరి 5 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు దిగ్గజ కంపెనీలు ప్రదర్శించిన అత్యాధునిక ఆవిష్కరణలు ఔరా అనిపించాయి. ఈ నేపథ్యంలో సీఈఎస్‌-2022 వేదికగా ఇప్పటివరకు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఐదు క్రేజీ ఆవిష్కరణలెంటో ఇప్పుడు చూద్దాం.. రండి..!

రంగులు మార్చే కారు

ఊసరవెల్లిలా రంగులు మార్చే కారు గురించి ఎప్పుడైనా విన్నారా..?జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అటువంటి కారును అభివృద్ధి చేసింది. సీఈఎస్‌-2022లో దీన్ని ప్రదర్శనకు పెడితే ప్రపంచం ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. బటన్‌ నొక్కితే రంగులు మారేలా ‘BMW iX Flow’ కారు తీసుకొచ్చింది. పైగా పూర్తి ఎలక్ట్రోఫోరెటిక్ టెక్నాలజీతో ఈ కారు పనిచేస్తుంది. దీని ఫీచర్లను బీఎండబ్ల్యూ పూర్తిగా వెల్లడించలేదు. అయితే, ఈ మోడల్‌కు సంబంధించిన కారు వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 


స్టీరింగ్ ముందు 3డీ ప్రపంచం

సరికొత్త కార్ల ప్రపంచంలో ఇది మరో ఆవిష్కరణ. Imuzak కంపెనీ 3-D స్టీరింగ్ వీల్ డిస్‌ప్లేను సీఈఎస్‌-2022లో ప్రదర్శించింది. తద్వారా కారు డాష్‌బోర్డు ముందు 3డీ ప్రపంచాన్ని సృష్టించింది. కారు డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో సమీపంలోని ఏటీఎంలు, రెస్టారెంట్ల వంటివి 3డీ రూపంలో చూసేలా 2.8-అంగుళాల స్క్రీన్‌ అమర్చింది. ఇది మైక్రోలెన్స్‌ సాయంతో పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. 


ఏఐ ఆధారంగా ఇయర్‌బడ్‌లు

వైర్లు కనుమరుగై ఇప్పుడు వైర్‌లెస్‌ ఇయర్‌బడ్‌లు వచ్చాయి. అయినప్పటికీ వాల్యూమ్‌, ప్లేబ్యాక్‌ పాటలను మార్చడానికి డివైజ్‌లను నొక్కుతూ ఉండాలి. Wisear సంస్థ దాన్ని మార్చడానికి నడుం బిగించింది. చేతులతో పనిలేకుండా కృత్రిమ మేధస్సు (ఏఐ)తో పనిచేసే ఇయర్‌బడ్‌ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రోడ్‌ల ఆధారంగా మెదడు, ముఖ కవలికలను రికార్డ్‌ చేసి పనిచేసే ఇయర్‌బడ్‌ల తయారీలో పడింది. అలాగే నోవెటో (Noveto) ఇటువంటి హెడ్‌సెట్‌నే ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మేరకు సీఈఎస్‌లో ఈ కంపెనీలు వాటి ఆలోచనలు పంచుకున్నాయి.


డ్రైవర్‌ లేకుండానే పొలం పని..

డ్రైవర్‌ లేకుండా పనిచేసే వాహనాల ఆవిష్కరణలు ఈసారి సీఈస్‌-2022లో సందడి చేశాయి. ఇందులో జాన్ డీరే అటానమస్ ట్రాక్టర్ ఒకటి. దీనిలో కెమెరాలు, ఇతర సాంకేతికతను అమర్చారు. తద్వారా పొలంలో స్వయంగా దానంతట అదే పని చేసుకుంటుంది. అలాగే స్మార్ట్‌ మొబైల్‌ సాయంతో రైతులు దీన్ని నియంత్రించవచ్చు. దీంతో పాటే హుందాయ్‌ కంపెనీ హెవీ ఇండస్ట్రీస్‌ అటానమస్‌ లగ్జరీ బోట్‌ను పరిచయం చేసింది. దీనికి కూడా డ్రైవర్‌తో పనిలేదు. సముద్రంలో అడ్డంకులను నియంత్రించుకోగలదు. అయితే, ఈ సాంకేతికతను మరింత పరీక్షించాలని హుందాయ్‌ తెలిపింది. 


బ్యాటరీ లేని రిమోట్‌

ఇ-వేస్టేజీని తగ్గించడంలో భాగంగా శాంసంగ్‌ ఓ చిన్న ప్రయత్నం చేసింది. బ్యాటరీలు అవసరం లేకుండా పనిచేసే రిమోట్‌ను అభివృద్ధి చేసింది. సౌరశక్తితో పనిచేసేలా తయారు చేసింది. ఇందుకోసం ప్రత్యేక సాంకేతికను ఉపయోగించింది. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని