Smartphones: వాటి విషయంలో ఆండ్రాయిడ్ కంపెనీలు ఐఫోన్‌ను అనుకరిస్తున్నాయా..?

స్మార్ట్‌ఫోన్‌లలో ముఖ్యమైన ఫీచర్లకు ప్రేరణ యాపిల్ ఐఫోన్‌ అనే చెప్పుకోవాలి. మరి, ఐఫోన్‌ను ఇతర స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఏయే ఫీచర్లు, ఉత్పత్తుల్లో అందివ్వడంలో అనుకరిస్తున్నాయో చూద్దామా...

Published : 27 Sep 2022 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనుకరణ, ప్రేరణ పదం ఏదైనా ఒకరిని మరొకరు ఫాలో కావడం సర్వసాధారణం. కంపెనీలు సైతం వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా సేవలు అందించేందుకు  కాస్త భిన్నంగా ఒకే రకమైన ఉత్పత్తులను తీసుకొస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ముఖ్యమైన ఫీచర్లకు ప్రేరణ యాపిల్ ఐఫోన్‌ అనే చెప్పుకోవాలి. పనితీరు పరంగా కాస్త తేడా ఉన్నప్పటికీ దాదాపు అన్నింటిలో ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్‌ను బట్టి వాటిలో తేడా ఉంటుంది. అలా.. ఐఫోన్‌ను ఇతర స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఏయే ఫీచర్లు, ఉత్పత్తుల్లో అందివ్వడంలో అనుకరిస్తున్నాయో చూద్దామా...


ఛార్జింగ్ అడాప్టర్‌

యూజర్‌ కొత్తగా కొనుగోలు చేసే ఫోన్‌తోపాటు  ఛార్జింగ్‌ అడాప్టర్‌ ఇవ్వకూడదనే నిర్ణయాన్ని కొన్ని దేశాలు స్వాగతిస్తుండగా.. మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఫోన్‌తోపాటు ఛార్జింగ్ అడాప్టర్‌ ఇవ్వనందుకు బ్రెజిల్ యాపిల్‌కు జరిమానా కూడా విధించింది. దీంతో ఫోన్‌తోపాటు ఛార్జింగ్ అడాప్టర్‌ ఇవ్వకూడదనే నిర్ణయాన్ని కంపెనీలు ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు సమాచారం. భవిష్యత్తులో ఛార్జింగ్‌ అడాప్టర్‌ ఇవ్వకూడదని కంపెనీలు భావిస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుడిపై భారం పడుతున్నా, కంపెనీల వాదన భిన్నంగా ఉంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడంలో భాగంగానే అడాప్టర్‌ ఇవ్వకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నాయి. 


నాచ్‌ డిస్‌ప్లే

యాపిల్ కంపెనీ ఐఫోన్‌ ఎక్స్‌ సిరీస్‌లో టాప్‌నాచ్‌ డిస్‌ప్లేను పరిచయం చేసింది. అప్పటి వరకు ఫోన్‌ పైభాగంలో స్పీకర్‌, కెమెరా కోసం స్క్రీన్‌ సైజ్‌ను కొన్ని అంగుళాలు తగ్గించేవారు. యాపిల్ పరిచయం చేసిన టాప్‌నాచ్‌ డిస్లేతో ఫోన్‌లో డిస్‌ప్లే సైజ్‌ పెరిగింది. దీంతో మిగిలిన కంపెనీలు సైతం టాప్‌నాచ్‌ డిస్‌ప్లేతో ఫోన్లను తీసుకురావడం ప్రారంభించాయి. ఐఫోన్ ఇదే డిజైన్‌ను కొనసాగిస్తున్నప్పటికీ, ఇతర కంపెనీలు నాచ్‌లెస్‌ డిస్‌ప్లేను తీసుకొచ్చాయి. నాచ్ స్థానంలో పంచ్‌హోల్‌ డిస్‌ప్లేను ఇస్తున్నాయి. 


ఓఎస్‌

యూజర్ ఇంటర్‌ఫేస్‌, ఫోన్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) ప్రాధాన్యంగా యాపిల్ కంపెనీ ఐఫోను డిజైన్ చేసింది. వీటినే ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సైతం అనుకరించాయి. ఐఫోన్ కోసం ఐఓఎస్‌ మాదిరే.. షావోమి ఎమ్‌ఐయూఐ, వివో ఫన్‌టచ్‌, ఒప్పో కలర్స్‌, శాంసంగ్ వన్‌యూఐ ఓఎస్‌లను అభివృద్ధి చేశాయి. ఇవన్నీ కూడా గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ ఆధారంగా పనిచేస్తాయి. ఈ ఓఎస్‌లలోని యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ఫీచర్లలో చాలా వరకు ఐఓఎస్‌ ప్రేరణగా రూపుదిద్దుకున్నవే. అలానే, యాపిల్‌ కూడా ఆండ్రాయిడ్‌లో ముందుగా పరిచయమైన కొన్ని ఫీచర్లను ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. 


ఇయర్‌ఫోన్ పోర్ట్‌

యాపిల్ కంపెనీ 2016లో విడుదల చేసిన ఐఫోన్ 7 సిరీస్‌లో 3.5 ఇయర్‌ఫోన్‌ పోర్ట్‌ను తొలగించింది. వాటికి బదులు బ్లూటూత్ కనెక్టివిటీతో ఇయర్‌బడ్స్‌ను పరిచయం చేసింది. తర్వాత విడుదలైన అన్ని ఐఫోన్‌ మోడల్స్‌లో ఇయర్‌ఫోన్‌ పోర్ట్ లేదు. ఇదే పంథాను ఇతర కంపెనీలు అనుసరించినప్పటికీ, పూర్తి స్థాయిలో తొలగించలేదు. కొన్ని ప్రీమియం ఫోన్‌ మోడల్స్‌లో మాత్రమే ఇయర్‌ఫోన్‌ పోర్ట్‌ను తొలగించి వాటికి బదులు బ్లూటూత్ కనెక్టివిటీని ఉపయోగించుకునేలా యూజర్లను ప్రోత్సహిస్తున్నాయి. 


స్క్రీన్‌లాక్ బయోమెట్రిక్‌

స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచం చేతిలో ఉన్నట్లే. బ్యాంకింగ్ నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్ వరకు అన్నీ ఫోన్‌లోనే. దీంతో లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లతోపాటు ముఖ్యమైన సమాచారం ఇతరులకు తెలియకూడదనే ఫోన్‌కు లాక్ పెట్టేస్తుంటాం. వీటిలో నంబర్‌, ప్యాట్రన్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ వంటివి ఉన్నాయి. 2013లో తొలిసారిగా ఐఫోన్‌ 5ఎస్‌ మోడల్‌లో టచ్‌ ఐడీ, ఫింగర్‌ ప్రింట్ సెన్సర్లను యాపిల్ పరిచయం చేసింది. తర్వాతి కాలంలో ఆ ఫీచర్లను ఇతర కంపెనీలు సైతం తమ ఫోన్లలో ఇస్తున్నాయి. ఫేస్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌ను కూడా యాపిల్ మొట్టమొదటగా 2017లో ఐఫోన్ ఎక్స్‌ మోడల్‌లో తీసుకొచ్చింది. తర్వాత షావోమి, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, హువావే వంటి కంపెనీలు సైతం ఆయా కంపెనీల ఫోన్లలో ఇస్తున్నాయి.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని