Published : 25 Jul 2022 14:22 IST

Unused Apps: ఐఫోన్‌ మెమొరీపై యాప్‌ల భారం.. ఇలా తగ్గించుకోండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ వాడకం మారిపోయింది. అన్ని పనులకు మొబైల్‌ ఆధారమైపోయింది. విజ్ఞానం, వినోదంతోపాటు ఆర్థికపరమైన లావాదేవీలకు ఫోన్‌లోని యాప్‌లతో క్షణాల్లో పని పూర్తిచేస్తున్నాం. ఇలా ప్రతి పనికి యాప్‌ స్టోర్‌ (Apple Store)లో ఓ యాప్‌ అందుబాటులో ఉంది. కొన్నిసార్లు అవసరం ఉందని డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌లు, పని పూర్తయ్యాక.. నెలలపాటు వాటి జోలికి వెళ్లం. దీంతో అవి ఫోన్‌ మెమొరీని ఆక్రమించడమే కాదు.. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూ బ్యాటరీని ఖాళీ చేసేస్తాయి. అందుకే ఎక్కువ కాలం పాటు ఉపయోగించని యాప్‌లను ఐఫోన్‌ (iPhone) నుంచి తొలగించమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ యాప్‌లను ఎలా గుర్తించాలి? వాటిని ఫోన్‌ నుంచి ఎలా తొలగించాలో తెలుసుకుందాం. 

  • ఐఫోన్‌లో కొన్ని యాప్‌లకు పేరు పక్కన క్లౌడ్‌ సింబల్‌ కనిపిస్తుంది. అంటే ఆ యాప్‌లను చాలా కాలం నుంచి ఉపయోగించట్లేదని అర్థం. అలా మీ ఐఫోన్‌లో ఏవైనా యాప్‌లు ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయండి. సెట్టింగ్స్‌లో జనరల్‌ (General) సెక్షన్‌లోకి వెళ్లి డిలీట్ చేయాల్సిన యాప్‌ను సెలెక్ట్‌ చేసి ఆఫ్‌లోడ్ యాప్‌ (Offload App) బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.   
  • ఐఫోన్‌లో నెలల తరబడి ఉపయోగించని యాప్‌ల భారాన్ని తగ్గించుకునేందుకు మరో పద్ధతి కూడా ఉంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్‌ స్టోర్ (App Store) సెక్షన్‌ ఓపెన్‌ చేసి ఆఫ్‌లోడ్ అన్‌యుజుడ్‌ యాప్స్‌ (Offload Unused Apps) అప్షన్‌ను ఎనేబుల్ చేయాలి. దీంతో మీ ఫోన్‌లో ఎంత స్టోరేజ్‌ ఖాళీ అవుతుందనేది కూడా కనిపిస్తుంది. ఈ ఫీచర్‌తో యాప్‌ ఫోన్‌ మెమొరీ నుంచి డిలీట్ కావు. కేవలం ఆఫ్‌లోడ్‌ అయి, స్టోరేజ్‌ వినియోగాన్ని తగ్గిస్తుంది. తర్వాత ఎప్పుడైనా యాప్‌ను ఉపయోగించాలనుకుంటే.. దానిపై క్లిక్ చేస్తే తిరిగి డౌన్‌లోడ్‌ అవుతుంది.      
  • ఒకవేళ యాప్‌లను ఫోన్‌ మెమొరీ నుంచి పూర్తిగా తొలగించేందుకు మరో ఆప్షన్‌ కూడా ఉంది. యాప్‌ స్టోర్ (App Store) ఓపెన్‌ చేసి ప్రొఫైల్‌ పిక్చర్‌ (Profile Picture)పై క్లిక్‌ చేస్తే అప్‌డేట్ చేసిన యాప్‌ల జాబితా కనిపిస్తుంది. వాటిలో మీరు ఉపయోగించని యాప్‌లను గుర్తించి ఎడమవైపుకు స్వైప్ చేస్తే డిలీట్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే యాప్‌లు పూర్తిగా ఫోన్‌ మెమొరీ నుంచి డిలీట్‌ అయిపోతాయి. నెలకోసారి ఈ పద్ధతిని ఫాలో అయితే ఐఫోన్‌ మెమొరీపై భారం తగ్గుతుంది. 
  • వీటితోపాటు మరో రెండు ఆప్షన్ల ద్వారా కూడా యాప్‌లను డిలీట్ చేయొచ్చు. క్లౌడ్‌ సింబల్‌ ఉన్న యాప్‌ను ప్రెస్‌ చేసి హోల్డ్‌ చేస్తే డిలీట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే యాప్‌ ఫోన్‌ నుంచి పూర్తిగా డిలీట్ అయిపోతుంది. మరో ఆప్షన్‌ సెట్టింగ్స్‌లో జనరల్ సెక్షన్‌లోకి వెళ్లి ఆఫ్‌లోడ్ బటన్‌ కింద డిలీట్‌ యాప్‌ (Delete App) అనే ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లి్క్ చేస్తే యాప్‌ల జాబితా కనిపిస్తుంది. వాటిలో అవసరంలేని యాప్‌ను సెలెక్ట్‌ చేసి డిలీట్‌ చేయొచ్చు. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా అనుసరిస్తే ఐఫోన్‌ మెమొరీ ఎప్పటికప్పుడు ఖాళీ అవడమే కాకుండా, బ్యాటరీ పనితీరు కూడా మెరుగవుతుంది. 
Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts