FRAUD ALERT: *401* వీడు పక్కా కేటుగాడే.. తస్మాత్‌ జాగ్రత్త!

ఇంటర్నెట్‌ స్పీడ్‌ అంటూ హ్యాకర్లు కొత్త ఎత్తుగడ మొదలుపెట్టారు. టెలికాం సంస్థ ఎగ్జిక్యూటివ్‌లా కాల్‌ చేసి బురిడీ కొట్టిస్తున్నారు.. 

Published : 30 May 2022 16:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ సాధారణ, యూపీఐ లావాదేవీలు నిర్వహించే వినియోగదారులకు అలర్ట్‌. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. సైబర్‌ నేరస్థులు అంతే అప్‌డేట్‌గా కొత్త పన్నాగాలు రచిస్తున్నారు. *401* డయల్‌ చేస్తే మీ ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెరుగుతుందంటూ హ్యాకర్లు కొత్త ఎత్తుగడ మొదలుపెట్టారు. ఇందుకు హ్యాకర్లే స్వయంగా టెలికాం సంస్థ ఎగ్జిక్యూటివ్‌లా కనిపించే నంబర్ల నుంచి కాల్‌ చేసి బురిడీ కొట్టిస్తున్నారు జాగ్రత్త!

సాయంత్రానికల్లా ఇచ్చేస్తామని.. ఊడ్చేస్తారు..

ఈ కొత్త పన్నాగంలో.. ముందుగా టెలికాం సంస్థ ఎగ్జిక్యూటివ్‌గా కేటుగాళ్లు కాల్‌ చేసి ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెంచామని లేదా పెంచుతునట్లు చెబుతారు. ఇందుకు *401* డయల్‌ చేయాలని కాల్‌లో ఉండగానే ఉచ్చు బిగిస్తారు. కేటుగాళ్లు చెప్పినట్లు చేయగానే క్షణాల వ్యవధిలోనే బాధితుడికి తన వాట్సాప్ ఖాతాను లాగిన్ చేయడానికి పిన్‌ వస్తుంది. ఆ తర్వాత బాధితుడి వాట్సాప్‌ ఖాతా తన మొబైల్‌లో ఉన్నట్టుండి లాగౌట్‌ అవుతుంది. ఇక అంతే మోసగాడి ఉచ్చులో చిక్కుకున్నామని గ్రహించేలోపే వాట్సాప్‌లోని కాంటాక్ట్‌లకు అర్జెంటుగా డబ్బులు కావాలని అభ్యర్థనలు వెళ్తాయి. సాయంత్రానికల్లా తిరిగి ఇచ్చేస్తానని పేటీఎం, యూపీఐ నంబర్లు ఇచ్చి డబ్బులు పంపాలని కేటుగాళ్లు అభ్యర్థిస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇప్పటికే దేశంలో పదుల సంఖ్యలో వెలుగులోకి వచ్చాయి. 

మరోవైపు, ఇటువంటి మోసాల పట్ల జాగ్రత్త ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. చెప్పిన నంబర్లు డయల్‌ చేయడం వల్ల పూర్తి మొబైల్‌ యాక్సెస్‌ కూడా హ్యాకర్లు చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇలా చెక్‌ పెట్టొచ్చు.. 
* ఇంటర్నెట్ స్పీడ్ కోసం మీకు ఏదైనా కాల్‌ వస్తే దానిని అసలు పట్టించుకోవద్దు. 
* అదే సమయంలో, అది టెలికాం కంపెనీ కాల్‌గా మీరు భావిస్తే ధైర్యంగా లిఫ్ట్ చేసి మాట్లాడండి. తప్పితే ఎటువంటి సమాచారాన్ని వారితో పంచుకోవద్దు. 
* అలాగే సిమ్‌లో ఎక్కువ కాలం నెట్‌వర్క్ రాకపోతే, వెంటనే పోలీసులకు సమాచారం అందించి కొత్త సిమ్ కార్డ్ తీసుకోండి. 
* మరీ ముఖ్యంగా డబ్బు కావాలని ఏదైనా కాల్ వస్తే, తనిఖీ చేయకుండా పంపవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని